365లో 420 పనులు
సాక్షి, హన్మకొండ : భారీ వాహనాలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత నాణ్యత ప్రమాణాల ప్రకారం జాతీయ రహదారి పనులు చేపట్టాలి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో జిల్లా మీదుగా కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 365 పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారి పేరు చెబుతూ గ్రామీణ రోడ్ల స్థాయిలో పనులు చేపడుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.
సన్నకంకర, గ్రానైట్ శాండ్ (జీఎస్బీ, గ్రాన్యుల్ సబ్ బేస్) మిశ్రమంతో ప్రాథమిక స్థాయిలో పనులు చేపట్టాల్సి ఉండగా... చవగ్గా లభిస్తుందనే ఉద్దేశంతో ఎర్రమట్టితోనే రోడ్డు నిర్మాణం చేపడతున్నారు. సమీపంలో ఉన్న గుట్టల నుంచి అక్రమంగా ఎర్రమట్టి తవ్వి రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి దాదాపు కోటిన్నర రూపాయలు వెచ్చిస్తున్నా... పట్టపగలే నాసిరకంగా, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నా... అధికార యంత్రాంగం కళ్లుమూసుకుని చోద్యం చూస్తోంది.
మొదటిదశలో 80 కి.మీలు
ప్రస్తుతం వరంగల్ జిల్లా మీదుగా హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్తోంది. కొత్తగా మరో జాతీయ రహదారిని జిల్లా మీదుగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నిర్ణయించింది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా మహారాష్ట్ర సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్ రేణిగుంట వరకు ప్రస్తుతం ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ జాతీయ రహదారి మన జిల్లాలో భూపాలపల్లి మండలంలో ప్రవేశించి మరిపెడ మండలంలో ముగుస్తుంది.
జిల్లాలో 220 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు నిర్మాణాన్ని భూపాలపల్లి-పరకాల-ఆత్మకూరు, ములుగు మండలం మల్లంపల్లి-మరిపెడ, మరిపెడ- నల్గొండ జిల్లా నకిరేకల్ మధ్య మొత్తం మూడు పనులుగా విభజించారు. మొదటిదశలో మల్లంపల్లి-మరిపెడ మధ్య ఉన్న 80 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులను రూ. 127 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు.
ప్రభుత్వ ఆదాయూనికీ గండి
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నల్లబెల్లి మండలం కన్నారావుపేట, గుండ్లపహాడ్ గ్రామాల సమీపంలోని రాజన్నగుట్టల నుంచి అనుమతులు పొందకుండా ఎర్రమట్టిని తవ్వుతున్నారు. ఇక్కడ మైనింగ్ చేసేందుకు ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కానీ... సర్కారు రికార్డుల్లో ఉన్న గుట్టల్లో మైనింగ్ చేపడుతూ ప్రొక్లెయినర్లు, టిప్పర్ల సాయంతో యథేచ్ఛగా ఎర్ర మన్ను తరలించుకుపోతున్నారు.
నెలరోజులుగా ఈ తతంగం కొనసాగుతున్నా... అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారీతిగా సాగుతున్న మైనింగ్ కారణంగా గుట్ట హరించుకుపోతోంది. మరోవైపు అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సినఆదాయానికి గండి పడుతోంది.