Jubilant Life Sciences
-
జూబిలెంట్ సీఈవో మను అహుజా కన్నుమూత
జూబిలెంట్ ఇండస్ట్రీస్ (Jubilant Industries) ఎండీ, సీఈవో మను అహుజా కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ తెలియజేసింది. "కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మను అహుజా డిసెంబర్ 9 శనివారం నాడు ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాము" అని జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆదివారం (డిసెంబర్ 10) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అహుజా ఆకస్మిక మరణం కంపెనీకి కోలుకోలేని నష్టమని పేర్కొన్న యాజమాన్యం కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులందరూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, విచారం, సంతాపాన్ని తెలియజేస్తున్నారని అని వివరించింది. మను అహుజా 2018 మేలో జూబిలెంట్ ఇండస్ట్రీస్‌లో చేరారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, అహుజా జంషెడ్‌పూర్‌లోని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, పాటియాలాలోని థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదివారు. భారత్‌తోపాటు ఆగ్నేయాసియా అంతటా విభిన్న వ్యాపారాలు, పరిశ్రమలలో ఆయనకు విశేష అనుభవం ఉంది. జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది జూబిలెంట్ భారతీయ గ్రూప్‌నకు చెందిన అగ్రి, పెర్ఫార్మెన్స్ పాలిమర్స్ కంపెనీ. విస్తృత శ్రేణి పంట పోషణ, పంట పెరుగుదల, పంట రక్షణ ఉత్పత్తులతో పాటు అడెసివ్‌లు, వుడ్ ఫినిషెస్ వంటి వినియోగదారు ఉత్పత్తులు, వినైల్ పిరిడిన్, ఎస్బీఆర్, ఎన్‌బీర్ లేటెక్స్ వంటి ఆహార పాలిమర్లు కంపెనీ ఫోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. -
డిష్మన్- టీమ్‌లీజ్- జూబిలెంట్.. బోర్లా
సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్లు చొప్పున క్షీణించాయి. కాగా.. ఈ ఏడాది తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ బాటలో పనితీరు నిరాశపరచడంతో డిష్మన్ కార్బొజెన్ కౌంటర్ సైతం బోర్లా పడింది. మరోపక్క స్కూల్‌గురు ఎడ్యుసర్వ్‌లో మరో 36 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో టీమ్‌లీజ్ సర్వీసెస్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి ఈ మూడు కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. టీమ్‌లీజ్ సర్వీసెస్ అదనంగా 36.17 శాతం వాటాను సొంతం చేసుకోవడం ద్వారా స్కూల్‌గురు ఎడ్యుసర్వ్‌లో వాటాను 76.37 శాతానికి పెంచుకున్నట్లు టీమ్‌లీజ్ సర్వీసెస్ తాజాగా వెల్లడించింది. దీంతో స్కూల్‌గురును అనుబంధ సంస్థగా మార్చుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో టీమ్‌లీజ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం దిగజారి రూ. 2,140ను తాకింది. ప్రస్తుతం 5.2 శాతం నష్టంతో రూ. 2172 దిగువన ట్రేడవుతోంది. జూబిలెంట్ లైఫ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 52 శాతం క్షీణించి రూ. 88 కోట్లకు పరిమితమైన నేపథ్యంలో మూడో రోజూ జూబిలెంట్ లైఫ్ కౌంటర్ బోర్లా పడింది. దీనికితోడు సీఎఫ్‌వో అలోక్ వైష్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. రాజీనామాను ఆమోదించినట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో జూబిలెంట్ లైఫ్ షేరు ప్రస్తుతం 5.2 శాతం క్షీణించి రూ. 711 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 686 వరకూ జారింది. గత మూడు రోజుల్లో ఈ షేరు 17 శాతం నీరసించడం గమనార్హం! డిష్మన్ కార్బొజెన్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో డిష్మన్ కార్బొజెన్ ఎమిక్స్ రూ. 21.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ1లో రూ. 34.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం క్షీణించి రూ. 474 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో డిష్మన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 171 దిగువన ఫ్రీజయ్యింది. -
రెప్కో హోమ్ జూమ్- జూబిలెంట్ లైఫ్ స్కిడ్
విదేశీ ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎన్బీఎఫ్సీ రెప్కో హోమ్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో అంటే క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫలితాలు నిరాశపరచడంతో హెల్త్‌కేర్ కంపెనీ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి రెప్కో హోమ్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. జూబిలెంట్ లైఫ్ కౌంటర్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రెప్కో హోమ్ ఫైనాన్స్ నికర లాభం 3 శాతం బలపడి రూ. 69 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం పెరిగి రూ. 342 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ. 127 కోట్లను తాకగా.. నిర్వహణ లాభం 11 శాతం క్షీణించి రూ. 86 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో రెప్కో హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసింది. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 182 సమీపంలో ఫ్రీజయ్యింది. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ నికర లాభం 52 శాతం క్షీణించి రూ. 88 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2182 కోట్ల నుంచి రూ. 1893 కోట్లకు నీరసించింది. ఈ నేపథ్యంలో జూబిలెంట్ లైఫ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 788 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 772 దిగువకు చేరింది. -
ఆర్తి ఇండస్ట్రీస్ పతనం- జూబిలెంట్ జోరు
కరోనా వైరస్ రెండో దశ తలెత్తనున్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో తలెత్తుతున్నాయి. దీంతో ముడిచమురు ధరలు పతనంకాగా.. యూఎస్ మార్కెట్ల ఫ్యూచర్స్ నష్టాలలోకి ప్రవేశించాయి. దేశీయంగానూ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 779 పాయింట్లు పడిపోయి 33,001కు చేరగా.. నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 9,762 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ రెమ్‌డెసివిర్ ఔషధ లైసెన్సింగ్తోపాటు.. తాజాగా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించడంతో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. అయితే మరోపక్క దీర్ఘకాలిక కాంట్రాక్టు రద్దయిన వార్తలతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఆర్తి ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం.. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కోవిడ్-19 చికిత్సకు అభివృద్ధి చేస్తున్న రెమ్‌డెసివిర్ ఔషధానికి సంబంధించి యూఎస్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ ఇంక్ నుంచి నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 637 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 646 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. కంపెనీ తాజాగా స్వల్పకాలిక రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 50 కోట్లను సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2307 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 260 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీలో ప్రమోటర్లకు 50.68% వాటా ఉంది. గతేడాది పెట్టుబడి వ్యయాలపై రూ. 516 కోట్లను వెచ్చించింది. అంతేకాకుండా రూ. 514 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ తెలియజేసింది. మధ్య, దీర్ఘకాలాలకు జూబిలెంట్ లైఫ్ సైన్సెస్పట్ల సానుకూల ధృక్పథంతో ఉన్నట్లు పేర్కొంది. కాగా.. జూబిలెంట్ లైఫ్ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం ఊపందుకుంది. తొలి గంటన్నర సమయంలోనే ఈ కౌంటర్లో 12.73 లక్షల షేర్లు చేతులు మారినట్లు బీఎస్ఈ డేటా వెల్లడించింది. ఆర్తి ఇండస్ట్రీస్ గ్లోబల్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ నుంచి గతంలో దక్కించుకున్న 10ఏళ్ల కాంట్రాక్టును గడువుకంటే ముందుగానే ఆ సంస్థ రద్దు చేసుకుంటున్నట్లు ఆర్తి ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. 2017 జూన్‌లో కుదుర్చుకున్న కాంట్రాక్టులో భాగంగా హెర్బిసైడ్స్‌లో వినియోగించగల ఆగ్రోకెమికల్ ఇంటర్మీడియరీ సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. అయితే కంపెనీ ప్రొడక్ట్ తయారీ వ్యూహాన్ని మార్చుకోవడం ద్వారా కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు తెలియజేసింది. దీంతో 12-13 కోట్ల డాలర్లస్థాయిలో నష్టపరిహారం లభించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్తి ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం పతనమై రూ. 852 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో ఈ షేరు 29 శాతం తిరోగమించడం గమనార్హం! -
పనాసియా బయో- జూబిలెంట్ లైఫ్.. భళా
ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య ప్రకంపనలు సృష్టిస్తున్న కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో పనాసియా బయోటెక్ కౌంటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక మరోపక్క కరోనా వైరస్‌కు చెక్‌పెట్టగల రెమ్‌డెసివిర్ ఔషధ లైసెన్సింగ్‌కు ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకున్న జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్‌కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. పనాసియా బయోటెక్ కోవిడ్-19 నివారణకు వినియోగించగల వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా యూఎస్ కంపెనీ రెఫానాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తాజాగా పనాసియో బయోటెక్ వెల్లడించింది. తద్వారా ఈ వ్యాక్సిన్ అంతర్జాతీయ అభివృద్ధి, తయారీ, పంపిణీలకు వీలు కలగనున్నట్లు తెలియజేసింది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, వాణిజ్య ప్రాతిపదికన తయారీలతోపాటు.. క్లినికల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుందని వివరించింది. ఈ వ్యాక్సిన్‌ను 50 కోట్ల డోసేజీల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ యాజమాన్యం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పనాసియా బయోటెక్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ఈ షేరు రూ. 34 ఎగసి రూ. 204 సమీపంలో ఫ్రీజయ్యింది. తద్వారా ఏప్రిల్ 28న సాధించిన ఏడాది గరిష్టం రూ. 211కు చేరువలో నిలిచింది. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించాక జోరందుకున్న హెల్త్‌కేర్ రంగ కంపెనీ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్ మరోసారి జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 8.5 శాతం జంప్‌చేసి రూ. 604 వద్ద ట్రేడవుతోంది. తొలుత 12 శాతం దూసుకెళ్లి రూ. 625ను తాకింది. తద్వారా జనవరి 23న నమోదైన 52 వారాల గరిష్టం రూ. 639కు చేరువైంది. ఈ నెలలో ఇప్పటివరకూ ఈ షేరు 41 శాతం ర్యాలీ చేయడం విశేషం! కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జూబిలెంట్ లైఫ్ నికర లాభం 92 శాతం జంప్‌చేసి రూ. 260 కోట్లను తాకగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం యథాతథంగా రూ. 2391 కోట్లకు చేరింది. ఇటీవల యూఎస్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ నుంచి రెమ్‌డెసివిర్ ఔషధ తయారీ, మార్కెటింగ్‌కు జూబిలెంట్ లైఫ్.. లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. -
దేశీ వినియోగానికి రెమ్‌డెసివిర్ ఔషధం!
అమెరికాలో కోవిడ్-19 చికిత్సకు వినియోగిస్తున్న ఔషధం రెమ్‌డెసివిర్‌ను దేశీయంగా విక్రయించేందుకు అనుమతించమంటూ విదేశీ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తాజాగా దరఖాస్తు చేసుకుంది. ఈ ఔషధంపై క్లినికల్ పరీక్షలు పూర్తికాకపోయినప్పటికీ అత్యవసర ప్రాతిపదికన(ఈయూఏ) యూఎస్ఎఫ్డీఏ అనుమతించింది. ఈ బాటలో దేశీయంగానూ రెమ్‌డెసివిర్ ఔషధ మార్కెటింగ్‌కు అనుమతించమంటూ కేంద్ర ప్రామాణిక ఔషధ నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో)కు తాజాగా గిలియడ్ సైన్సెస్ దరఖాస్తు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై నిపుణుల కమిటీ సూచనలమేరకు సీడీఎస్‌సీవో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఔషధంపై ప్రీక్లినికల్, క్లినికల్ పరీక్షల డేటాను గిలియడ్ సైన్సెస్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 7న జపనీస్ ఆరోగ్య శాఖ సైతం అత్యవసర ప్రాతిపదికన కోవిడ్-19 బారినపడిన వారి చికిత్సకు వినియోగించేందుకు అనుమతించినట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. దేశీ కంపెనీలు యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌కు పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్ ఇటీవల దేశీ ఫార్మా రంగ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటెరో ల్యాబ్స్‌తో నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాలను చేసుకుంది. ఫలితంగా సిప్లా, హెటెరో ల్యాబ్స్ ఇప్పటికే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని దేశీయంగా తయారు చేసి విక్రయించేందుకు అనుమతించమంటూ దేశీ ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేశాయి. కోవిడ్-19 రోగులకు వెంటనే ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా అత్యవసర ప్రాతిపదికన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వవలసి ఉన్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. దీంతో క్లినికల్ పరీక్షలు పూర్తికాకుండానే ఈ ఔషధాన్ని వినియోగించేందుకు అనుమతించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి చికిత్సకు రెమ్‌డెసివిర్‌ను వినియోగించడం ద్వారా ప్రయోజనం కలుగుతున్నట్లు న్యూఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది. అయితే దేశీయంగా క్లినికల్ పరీక్షలు ముగించుకున్నాక మాత్రమే ఔషధాలకు అనుమతి లభిస్తుందని విశ్లేషకులు తెలియజేశారు. పలు దేశాలు ఇదే విధానాన్ని అవలంబిస్తాయని, ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు ఎదురుకావడంతో యూఎస్ఎఫ్డీఏ తాత్కాలిక ప్రాతిపదికన కొంతమేర సడలింపులను ఇచ్చినట్లు వివరించారు. -
జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ లాభం 22 శాతం అప్
న్యూఢిల్లీ: జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 22 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.132 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.162 కోట్లకు పెరిగిందని జూబిలంట్ లైఫ్‌సెన్సైస్ తెలిపింది. ఫార్మా సెగ్మెంట్లో అమ్మకాలు జోరుగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని జూబిలంట్ లైఫ్ సెన్సైస్ చైర్మన్ శ్యామ్ ఎస్. భర్తియ తెలిపారు. నికర అమ్మకాలు రూ.1,401 కోట్ల నుంచి రూ.1,426 కోట్లకు పెరిగాయని వివరించారు.