jubilee hall
-
అవతరణ వేడుకలకు ఏర్పాట్లు షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. దీని కోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్ ఎదురుగా ఉన్న గార్డెన్‌ను మంత్రి పరిశీలించారు. అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆంద్రప్రదేశ్ ఏర్పడి నాడు ఎక్కడైతే వేడుకలు జరిగాయో అక్కడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ చరిత్రలో నిచిపోయే విధంగా ఆవిర్భావ వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆనాటి ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాడు జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఉత్సవాలు జరిపారు. ఆనాటి నిజాం తెలంగాణ ప్రజల చెమట రక్తంతో కట్టిన ఆనవాళ్ళు జూబ్లీహాల్ పరిసరాల్లో ఉన్నాయి. వాటన్నింటిని మర్చిపోయే విధంగా వేడుకలు జరగాలి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు అందబోతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుతున్నాయి.. ప్రతి ఆవిర్భావం దినోత్సవానికి అనేక పథకాలను ప్రజలకు చేరుస్తున్నాం.’’ అని వ్యాఖ్యానించారు. -
శాసనం కోసం నిర్మితమైన..
హైదరాబాద్ నగర నడిబొడ్డున గల అసెంబ్లీ భవనాలను చూడని వారుండరు. ఈ భవన సముదాయాలు నిజాం హయాంలో టౌన్ హాలుగా ఉండేవి. ఎంతో విశిష్టత ఉన్న ఈ భవనం నిర్మాణంలో ఇండో-ఇస్లామిక్ శైలి కనిపిస్తుంది. రాజస్థానీ-పర్షియన్ ఆర్కిటెక్చర్‌తో రాచఠీవిని కళ్ల ముందుంచుతుంది. ప్రజాసమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించే సమావేశ మందిరంగా ఆనాడు ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ఆరో నిజాం ప్రభువు నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో దీన్ని నిర్మించారు. నిజాం 40వ జన్మదిన వేడుకల సందర్భంగా 1905లో టౌన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1911లో ఆరో నిజాం కాలం చేశారు. తర్వాత రెండేళ్లకు అంటే 1913లో దీని నిర్మాణం పూర్తయింది. అనంతరం ఈ భవనాన్ని ప్రజానీకానికి అంకితమిచ్చారు. ఈ భవన నిర్మాణంలో స్థానిక ప్రజలు కూడా తమవంతు విరాళాలు అందజేశారు. అసెంబ్లీగా..భారత స్వాతంత్య్రానంతరం, ఈ భవనాలలో శాసనసభ, శాసన మండలిని ఏర్పాటు చేశారు. కాలనుగుణంగా అసెంబ్లీ భవనాలలో అనేక మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపట్టినా, ప్రధాన భవనం చారిత్రక విశిష్టత వన్నె తగ్గలేదు. శాసనసభ జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజానీకానికి ప్రవేశం పరిమితంగా ఉంటుంది. ముందుగా అనుమతి తీసుకుని శాసనసభా వ్యవహారాలు చూడొచ్చు. శాసనసభ నిర్వహణ లేని రోజుల్లో స్థానిక అధికారుల అనుమతితో శాసనసభా ప్రాంగణంలో కలియ తిరగవచ్చు. సిల్వర్ జూబ్లీ భవన్.. పబ్లిక్ గార్డెన్స్ కేంద్ర బిందువుగా జూబ్లీహాలు ఉంది. 1936 నాటికి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారం చేపట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం ప్రత్యేకంగా ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిర్మించిన భవనం కాబట్టి, క్లుప్తంగా జూబ్లీహాల్- జూబ్లీ భవన్‌గా ఈ నిర్మాణం ప్రసిద్ధి చెందింది. నాటి అధికార దర్పానికి ప్రతీకగా జూబ్లీ హాలు కనిపిస్తుంది. జూబ్లీ హాలు ప్రాంగణంలోనే నేడు రాష్ట్ర శాసన మండలిని నిర్వహిస్తున్నారు. ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించిన జూబ్లీహాలు. చారిత్రక నిర్మాణ విశిష్టత దృష్ట్యా జంట నగరాలలోని ప్రధాన భవనాలలో అత్యంత ప్రధానమైనదిగా చెప్పొచ్చు. మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
నేడు ఆర్థిక రంగ నిపుణుల సమావేశం
హైదరాబాద్: ఆర్థిక రంగ నిపుణుల కమిటీ సమావేశం నేడు జూబ్లీహాలులో జరగనుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం 14వ ఆర్ధిక సంఘానికి ఏడు కీలక అంశాలపై ప్రతిపాదనలు సమర్పించేందుకు రాష్ట్ర సర్కార్ ఈ సందర్భంగా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటికి కేటాయిస్తున్న నిధులు వంటి అంశాలపై సోదాహరణంగా ఆర్ధిక సంఘానికి వివరించాలని నిర్ణయించింది. ఈరోజు ఉదయం జూబ్లీ హాలులో ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, అధికారులు ఆర్ధిక సంఘం ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి, సభ్యులు అనిజిత్ సేన్, సుష్మానాధ్, ఎం.గోవిందరావు, సుదిప్తో మండల్, కేంద్రం నుంచి వచ్చే పలువురు అధికారులు కూడా సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవసరాలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఏడు రంగాలకు సంబంధించిన అవసరాలపై ఆర్ధిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించనుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ-ఎస్సీ సబ్‌ప్లాన్, ఆరోగ్యం, నగదు బదిలీ పథకం, నీటిపారుదలశాఖలపై ఈ ప్రతిపాదనలు ఉంటాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, వాటిపై చేస్తున్న ఖర్చు, అందుకు కావాల్సిన నిధులు వంటి అంశాలను వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.