నన్నూ, నా చర్యల్ని చూడండి..
న్యూఢిల్లీ: మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చూసి తానేంటో అంచనా వేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం గురించి చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు. మంగళవారం తనకు కలిసిని ముస్లిం నేతలనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 30 మంది మతపెద్దలతో దాదాపు 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రి ముక్తార అబ్బాస్ నక్వీ కూడా హాజరయ్యారు.
తాను మతప్రాతిపదికన ప్రజలను విభజించే రాజకీయాల మీద తనకు నమ్మకం లేదన్నారు. మతవిద్వేష వ్యాఖ్యలు కూడా తానెప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దీనికోసం 125 కోట్ల రూపాయలను వెచ్చించనుందని ఆయన తెలిపారు.
మైనారిటీ, మెజారిటీ రాజకీయాలు దేశానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయని, ఆయా వర్గాలకు తగిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిండమే దీనికి పరిష్కామని మోదీ తెలిపారు. కొన్ని సంక్షేమ పథకాల ఫలాలు తమదాకా రావడం లేదన్నముస్లిం నేతల ఆవేదనకు ప్రధాని సానుకూలంగా స్పందించారు.. ముస్లిం వర్గం ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలపై తమ ప్రభుత్వానికి అవగాహన ఉందనీ, వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
విద్వేష వ్యాఖ్యల్ని సహించం, మైనార్టీలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే క్షమించమంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ముస్లిం ప్రతినిధి వర్గం ప్రధానిని కలిసింది. అయితే ప్రధానిని కలిసిన ముస్లిం ప్రతినిధి బృందం ఓటు బ్యాంకు రాజకీయాలను వ్యతిరేకించినట్టు, అభివృధ్దిని ఆకాంక్షించినట్టుగా ప్రధానిమంత్రిత్వ వర్గాలు పేర్కొన్నాయి.