రంగారెడ్డి కోర్టుల వద్ద ఉద్రిక్తత
- ప్రత్యేక హైకోర్టు కోసం లాయర్ల ఆందోళన తీవ్రం
- ఓ జడ్జిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి యత్నం
- కోర్టు హాల్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం
- పోలీసులతో తోపులాట, పలువురిపై కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు డిమాండ్‌తో రంగారెడ్డిజిల్లా కోర్టులు, నాంపల్లి క్రిమినల్ కోర్టుల న్యాయవాదులు కొద్ది రోజులుగా చేస్తున్న ఉద్యమం శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యేక హైకోర్టు వచ్చే దాకా ఉమ్మడి పోస్టుల భర్తీని ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురవడంతో న్యాయవాదులు నిరసనకు దిగారు. రంగారెడ్డిజిల్లా కోర్డుల ప్రధాన ద్వారం ముందు బైఠాయించి జడ్జీలతోపాటు కోర్టు సిబ్బంది, కక్షిదారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 2వ అదనపు సెషన్స్ జడ్జి గాంధీ.. కోర్టు లోపలికి వెళ్తుండగా వెనుక్కురావాలని న్యాయ వాదులు నినాదాలు చేశారు.
సీమాంధ్ర జడ్జీలు గో బ్యాక్ అంటూ జడ్జిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోర్టు గేటు ముందు బైఠాయించిన న్యాయవాదులు ఎవరినీ లోపలికి వెళ్లనీయలేదు. దీంతో అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులకు, లాయర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే కోర్టులోకి ప్రవేశించిన గాంధీ.. ఓ కేసు విచారణను చేపట్టారు. దీంతో కోపోద్రిక్తులైన లాయర్లు కోర్టు హాల్లోకి ప్రవేశించి అక్కడి పూలకుండీలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జడ్జి టేబుల్‌పైనున్న కంప్యూటర్ను కూడా బద్దలుకొట్టారు. దీంతో జడ్జి గాంధీ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈలోగా అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు.. లాయర్లను నిలువరించి దాదాపు 20 మందిని అరెస్ట్ చేసి తర్వాత వ్యక్తిగత పూచీపై వదిలేశారు. కోర్టులో విధ్వంసం సృష్టించిన పలువురిపై కేసులు నమోదు చేశారు.
ప్రత్యేక హైకోర్టు ప్రజల ఆకాంక్ష: గద్దర్
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. దాన్ని నిజం చేసేందుకు ప్రధాని, ఇరురాష్ట్రాల సీఎంలు కృషి చేయాలని సూచించారు. హైకోర్టు విభజన కోసం నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. హైకోర్టు విభజన చేయకుండా జూనియర్ సివిల్ జడ్జీల (జేసీజే) నియామకాలు చేపడితే తెలంగాణకు మరోసారి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని సూచిం చారు. కాగా, జేసీజే నియామకాలు చేపట్టాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో శనివారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని హైకోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు సహోధర్‌రెడ్డి తెలిపారు.