Jukanti Jagannadham
-
Yennam Satyam: అతడి మరణం ఓ విషాదం!
సత్యం! 30, 35 ఏళ్ల క్రితం కవిత్వం, కథలు రాస్తున్న నాతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రమక్రమంగా స్నేహితుడిగా, కవిగా కూడా పరిణామం చెందాడు. నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాడు. అంతేగాక తన మొదటి మూడు పుస్తకాలను ఖగోళ శాస్త్రం, విశ్వ రహస్యాలను ఆధారం చేసుకొని భూమి కేంద్రంగా సూక్ష్మస్థాయిలో సుదీర్ఘ కవితల్ని రచించాడు. అవి సుదీర్ఘ జ్ఞాపకం(1996), శిలా ఘోష (1997), బొంగరం (2004). తనకంటూ తెలుగు కవిత్వ రంగంలో ఒక స్థానాన్ని అప్పుడప్పుడే ఏర్పర్చుకుంటున్న కాలమది. చాలా రోజులు అటు జీవితంలోనూ ఇటు కవిత్వంలోనూ తాయిమాయి తొక్కులాడాడు. 2011లో సూది నానీలు పేరుతో ‘నానీ’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకం ఇన్నర్ టైటిల్లో ‘అగర్ తేరీ గలిమే కోయీ భూకా హైతో లానత్ హై తేరే ఖానే పే’ అనే మహమ్మద్ ప్రవక్త సూక్తి తెలుగు అనువాదం ‘మీ వీధిలో ఎవరైనా పస్తులుంటే నువ్వు తినే అన్నం అధర్మమే’ ముద్రించాడు. తద్వారా సత్యం మరో నూతన తాత్విక లోకంలోకి నిబద్ధతతో, నిమగ్నతతో ప్రవేశించాడు. అన్నట్టు చెప్పలేదు కదూ... అరబ్బీని అనర్గళంగా మాట్లాడడమే కాక చదువుతాడు, రాస్తాడు కూడా. ఇక్కడ కొద్దిగా అతడి వలస బతుకు గురించీ యాది చేసుకోవాలి. దర్జీల కుటుంబంలో పుట్టిన సత్యం... జీవిత ప్రారంభంలో జీవనాధారాన్ని వెతుక్కుంటూ సిరిసిల్ల, ముంబై ప్రాంతాల గుండా అరబ్బు దేశాలకు షర్ట్ మేకర్ కార్మికునిగా వలస పోయి 26 ఏళ్లు గడిపాడు. చివరికి ఇక అరబ్బు దేశానికి పోనవసరం లేదనీ, ఇక్కడ సిరిసిల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. పేద దర్జీ బతుకులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే నానీలను రాశాడు సత్యం. గుండెలను పిండి వేసే మచ్చుకు రెండు నానీలు... ‘అందరికీ జేబులు కుట్టేవాడు చాయ్ బీడీలకు అప్పు పడ్తడు’ ‘అమ్మకు కన్నీళ్లే కళ్లద్దాలు వాటితోనే కాజాలు కుట్టేది’ అంతా సవ్యంగా సాఫీగా బతుకు బండి నడుస్తుందనుకునేసరికి, మూడేళ్ల క్రితం బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. మూడుసార్లు తలకు ఆపరేషన్ జరిగినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. పైగా చివరి 4 నెలలు ఒక్కొక్క అవయవం కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. యెన్నం సత్యం (58) కవిగా ఎన్నో మెట్లు ఎక్కవలసిన వాడు, ఎన్నో లక్ష్యాలను అధిగమించి, అందరి అంచనాలను బదాబదలు చేయవలసిన వాడు. కానీ ఆరోగ్యం విషమించి ఈనెల 18న (ఆదివారం) తనువు చాలించాడు. సిరిసిల్ల కవి మిత్రులకే గాక... కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాహితీ మిత్రులందరికీ ఇదో తీరని లోటు. ఒక విషాద జ్ఞాపకం. సత్య ప్రమాణంగా సత్యం మరువలేని ఉప్పకన్నీళ్ల చేదు యాది! (చదవండి: సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!) – జూకంటి జగన్నాథం -
సామాజిక చలనాలకు కవిత్వ సాక్షి
మనసున పట్టనివ్వని అనేక తండ్లాటలు, నిలువనియ్యని మనాదులు, సిరిసిల్లా నుండి మొదలై తెలంగాణమంతటా కలెదిరిగి, దేశాన్ని పులుకు పులుకున చూసి కవిత్వ వాక్యమయ్యే మొసమర్రనితనం జూకంటి. ఎప్పుడూ చల నంలో ఉండే భూమికి ఎన్ని రుతువులున్నాయో, నిరంతరం ఎన్ని కోతలున్నాయో అన్ని జూకంటి కవిత్వంలోనూ తిరుగుతున్నాయి. దేశం అత్య వసర పరిస్థితిలోకి నెట్టబడ్డ నాటి నుండి నేటి దాకా సమాజ చలనాన్ని దుర్భిణితో చూస్తున్నది జూకంటి కవిత్వం. ప్రవహించని ప్రతి మనిషి మూలకు పడ్డ సామానుగా భావించే జూకంటి కవిత్వం నిండా ఒక చలన శీలత, భావ గాఢత, అభివ్యక్తి సాంద్రత ముప్పిరిగొంటాయి. జూకంటికి వ్యవస్థలో జరుగుతున్న మార్పు లకు కారణభూతమైన రాజకీయ శక్తి పాత్ర పట్ల ఒక చూపు ఉంది. అట్లానే, అది అధికారాన్ని సొంతం చేసుకొని చేస్తున్న పనుల వెనుక ఉన్న స్వార్థాల పట్ల లోచూపు ఉంది. తత్ఫలితంగా జరుగుతున్న మనిషి లోపలి కల్లోలం, గ్రామం లోపలి విధ్వంసం, జీవన సంబంధాల విచ్చిన్నం, అభివృద్ధి పేరుతో జరిగే అరాచకం, రాజ్యపు దళారీతనం పట్ల ఎడతెగని దుఃఖం, నిరసన ఉన్నాయి. అందుకే, అతడు సమూహం కావాలనుకుంటాడు. సమూహం కానివాడు శాపగ్రస్తుడే, ప్రపంచం కానివాడు నిలవనీరే అవుతాడంటాడు. నిరంతరం పాద ముద్రల చలనంలోకి ఇంకిపోయి, ఒక ఉద్యమ కొనసా గింపుగా ఉండాలనుకుంటాడు. పాతాళ గరిగెతో మొదలై పదిహేను కవితా సంపుటాలను వెలువరించిన జూకంటి ఒకే నిబ ద్ధతతో తేజాబ్ పట్టుకొని నడుస్తున్నాడు. అది అతనికి ప్రజల పట్ల ఉండే నిబద్ధత. సిరిసిల్లా కల్లోలాన్ని కనులతో చూసి, వలసల దుఃఖాన్ని మిత్రులతో పంచుకొని చెంచరిల్లె హృదయం. గాంధీ చౌరస్తాలో ఉదయం పూట కూలి కోసం వెతుక్కునే వారిని చూసి విలవిలలాడిపోతాడు. దేశం చౌరస్తాలో ఊరు లేబర్ అడ్డామీద నిలు చున్న కూలి కావడాన్ని చూసి రంధి పడుతాడు. ఈ మూడు నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ప్రధాన పరిణామాలను జూకంటి కవిత్వం ద్వారా తెలుసుకోవచ్చు. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు తదనంతర పరిస్థితులు, తెలంగాణలో విప్లవ పోరాటాల కల్లోల సమయాలు, ప్రపం చీకరణ దాని పరిణామాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వివిధ దశలు, అస్తిత్వ ఉద్యమాల ఛాయలు చాలా ప్రబలంగా జూకంటి కవిత్వంలో కనిపిస్తాయి. అంతా రాజకీయమే, రాజకీయం కాని దంటూ రాజ్యంలో వుండనే వుండదు, రాజ కీయం లేకుంట మనిషి వుండనే వుండడు అన్న ఎరుకతో కవిత్వాన్ని రాస్తాడు. పొలం నా బలం బలగం పొలమే నా స్వస్థలం అంటాడు. తల్లికొంగు నీడ నుంచి తరలిపోతున్న కొడుకు లను, కడుపులో బాధ నులి పెట్టగా గెదిమి కొట్ట బడుతున్న బిడ్డల వలసలను తలచుకొని తండ్లా డుతాడు. ఊళ్ళను ఖాళీ చేయించి ప్రాజె క్టులు నిర్వాసితులను చేస్తున్న సందర్భంలో ‘నా రెండు కనుగుడ్లను తీసి నా అరచేతుల్లో ప్రదర్శిస్తున్నట్టు కుప్పకూలిన పాత ఇల్లు/ దేన్నైనా కూలగొట్టడం అల్కగనే పునర్నిర్మించడమే బహుకష్టం’ అని గోసను అక్షరబద్ధం చేస్తాడు. ‘ప్రజల చేత చేతు లారా ప్రజలు స్వాధీన పరచిన అధికారంతో, ప్రజల కొరకు ప్రజల క్షేమం కొరకు, విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వం దళారై భూములు వేలం వేయబడును’ అని వాస్తవాన్ని పలుకుతాడు. ‘రాజ్యాంగంలో ఎలుకలు పడ్డయ్ /శాసన సభల్లో పందికొక్కులు సొర్రినయ్’ తీవ్ర నిరసన స్వరాన్ని వినిపిస్తాడు. ‘గ్రామం నా నామం/ ఊరు నా చిరునామా/ కన్నీరే నా వీలు నామా’ అని తన కవిత్వానికి క్షేత్రం ఊరుగా ప్రకటించుకుంటాడు. ‘కంట కన్నీరు ఉబికిన ప్పుడు, గుండె మండి కోపమచ్చినప్పుడు, ఆమె మనసు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు కవితగా నవ నవలాడిపోతాను’ అని నవనవంగా నాలుగు దశాబ్దాలుగా కవిత్వాన్ని రాస్తూనే ఉన్నాడు జూకంటి జగన్నాథం. – బూర్ల వేంకటేశ్వర్లు (జూకంటి జగన్నాథంకు నేడు ‘సినారె సాహితీ పురస్కార’ ప్రదానం సందర్భంగా) -
అది ప్రశ్నకు తలదించుకోవడమే
నాలుగు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో ఉన్న జూకంటి జగన్నాథం 14 కవితా సంపుటాలు, ఒక కథల సంపుటి తెచ్చారు. జూన్ 20న ఆయన 65వ పుట్టినరోజు సందర్భంగా ఒక సంభాషణ. ►మీరు సాహిత్యంలోకి రావడానికి దోహదం చేసిన పరిస్థితులు? నేను ఐదవ తరగతి చదివేటప్పుడు నా సహాధ్యాయి రాజ్యలక్ష్మి వాళ్ళనాన్న తెలుగు పండితుడు. వాళ్లింటికి చందమామ, బాలమిత్ర, ఆంధ్రప్రభ వస్తుండేవి. వాటిని అడుక్కొని చదివేవాణ్ణి. మా ఊళ్లో చలికాలంలో హరికథలు, ఎండాకాలంలో పటం కథలు, వరినాట్లు వేసిన తర్వాత ‘పాండ’ కతోల్లు పాండవుల బాగోతం ఆడేవారు. ఇవే బీజాలు వేశాయనుకుంటా. ►మీ ఊళ్లో సాహిత్య కొనసాగింపు ఎలా జరిగింది? మానేరుకు ఇవతలి ఒడ్డున తంగళ్లపల్లి మా వూరు. అవతలి ఒడ్డునున్న సిరిసిల్లలో 1972–73 ప్రాంతంలో సాహిత్య వాతావరణం విరాజిల్లుతుండేది. అప్పుడు సినారె సహచరుడు కనపర్తి లక్ష్మీనర్సయ్య, అతని అనుయాయి జక్కని వెంకటరాజం తదితరులతో పరిచయమేర్పడింది. వెంకటరాజం సార్ తన గ్రంథాలయ కార్డ్ ఇవ్వడమే గాక, కనపర్తి సార్ సొంత గ్రంథాలయంలోని పుస్తకాల్ని చదివే ఏర్పాటు చేశారు. వీటి ప్రభావంతో శ్రీపాద, గురజాడ, నుండి చలం బుచ్చిబాబు నుండి వట్టికోట, దాశరథి సోదరులు, శ్రీశ్రీ, దిగంబర కవుల వరకు అధ్యయనం చేశాను. సినారె అంతేవాసులైన వారు రేడియో లలితగీతాలకు పరిమితమయ్యారు. నేను కూడా మొదట్లో లలిత గీతాలు రాశాను. కానీ మెల్లగా సాహిత్యంలో మిళితం అయ్యాను. నాది కాలేజి మెట్లు ఎక్కని ఎండకాలం చదువు. ►ఆధునిక కవిత్వంలో మీ ప్రయాణం? అంతవరకు ఏవేవో రాసిన నేను ‘చీకటి దారి’ నుంచి 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి తర్వాత నాటి స్థల, కాలాల ప్రభావం వలన ఏది సరియైన వెలుగుదారో వెతుక్కున్నాను. జక్కని వెంకటరాజం సాహచర్యంలో చేసిన అధ్యయనం ఒక ఎత్తయితే, మిత్రుడు నిజాం వెంకటేశం పరిచయం మరో ఎత్తు. ఒక్కసారి వెలుగు దర్వాజ నాలోకి తెరుచుకున్నట్టు అయింది. మరోవైపు ఉత్తర తెలంగాణ– అణిచివేతకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటానికి సన్నద్ధమౌతోంది. నా ఆలోచనా విధానంలో గొప్ప మార్పుకు ఆస్కార మేర్పడింది. అలా మొదలైన నా కవిత్వం నదీప్రవాహంలా సాగుతూనే ఉంది. ►రెండు దశాబ్దాల తెలుగు కవిత్వ దశ దిశ? ఉద్యమ కాలంలోనే గాక అంతకు ముందు నుంచే ‘తెలంగాణ కవి’ అని సరిహద్దు గీతల్ని గీస్తున్నారు. రాయలసీమ, కళింగాంధ్ర సాహిత్యకారులను కూడా కుట్ర పూరితంగా ఆ ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. వ్యవహారిక భాష విషయంలోనూ ఇదే అంటరానితనాన్ని వర్తింపజేస్తున్నారు. సాహిత్యానికి ప్రయోజనం ఉందా, లేదా? అనే శషభిషల్లోకి కొందరు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజా ఉద్యమాలు వెనుకంజ వేయడం, ప్రపంచీకరణలో మనిషి మనుగడ ప్రమాదంలో పడటం కారణాలు. ఇదంతా ప్రశ్నకు తలదించుకు పోవడమే గాక, వర్తమాన సంక్షోభాలను ధిక్కరించలేక గతంలోకి పారిపోవడమే. ఇప్పుడు తిరిగి తెలుగు సాహిత్యం ఒక కుదుపు రావడానికి పురిటినొప్పులు పడుతోంది. ►ప్రపంచీకరణపై ముందుచూపుతో ఎలా రాయగలిగారు? దేశంలో 1980 నుండే ప్రపంచీకరణ చాపకింది నీరులా ప్రవేశించినా, ఆ దుష్పరిణామాలు 1990లో ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నన్ను అవి ఉక్కిరి బిక్కిరి చేశాయి. మనిషి జీవిత విధ్వంసాలను కథలలో చిత్రీకరించాను. తక్షణ çహృదయ స్పందనలను కవిత్వంలో నమోదు చేశాను. ►బహుజన రచయితల నినాదంపై మీ పరిశీలనలు? ఈ పదబంధాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల నుంచి ఎదిగివచ్చిన సృజనకారులందరినీ కలిపి అంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు పార్లమెంటరీ విధానంలో, ఉపాధి రంగాలలో రాజ్యాంగపరమైన హక్కులు కల్పించబడ్డాయి. మైనార్టీలు రాజ్యాన్ని అనేక రూపాలలో బార్గెయిన్ చేస్తున్నారు. వీరి అవసరం రాజ్యానికి ఓట్ల రూపంలో కలదు. కానీ బీసీ రచయితలు ఒక అగమ్యగోచరంగా ఉన్నారు. సంఖ్యా పరంగా గణనీయంగా ఉన్నప్పటికి అనైక్యంగా వున్నారు. వీరు ఏకం కాకుంటే ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. -మోతుకుల నారాయణ గౌడ్ -
‘మేధ’ బోనులో నిలబడింది
అభిప్రాయం ప్రజాసంఘాలు తెలంగాణకు కాక, తెరాసకు అనుబంధంగా మారడం మొదలైంది. దీనికి ఆంధ్ర పెట్టుబడి దారుల నుంచి తెరాస నిధులు సమకూర్చి పెట్టింది. అందుకే చాలామంది దీనికి ఎడం పాటించారు. గతవారం నేనూ, నా పెద్దదిక్కు నిజాం వెంకటేశం సార్ కలిశాం. ‘అరే! ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది. తెలంగాణ పది జిల్లాలకు లక్ష కోట్ల బడ్జెట్ అంటే మాట లా?’ అన్నారు వెంకటేశం. ‘పని చేయడం అధికారంలో ఉన్న ప్రభుత్వం విధి’ అన్నా ను. ఈ మాటలో వెటకారం ధ్వనించిం దేమో, ‘ప్రభుత్వాన్నీ, దాని విధానాలనీ సకారాత్మక దృష్టితో చూడాలి!’ అన్నారా యన. నాకు డేనియల్ బెల్ ‘భావజాల అంతం’ (ఎండ్ ఆఫ్ ఐడియా లజీ) వ్యాసం జ్ఞప్తికి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన ఏడాదిలో ఆలోచనాపరులంతా నిశ్శబ్దం వహించడం సరిగ్గా అందుకేనని అనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్పుడు లెఫ్ట్ పోజుతో కొందరు ప్రభుత్వ కనుసన్నలలో మెలుగుతుంటే, ఒక విప్లవకవి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న ఆ ‘ఇద్దరు’ వామపక్ష రాజకీయాల నుంచి వచ్చినవారేనని సంబరపడ్డారు. బహుళత్వ సమాజం-సంక్షేమరాజ్యం వంటి ఆలోచన లతో రాజ్యం ముందుకు పోతున్నప్పుడు సమాజ అవస రాన్ని మౌలికంగా మార్చవలసిన అవసరం లేదంటాడు బెల్. మేధావులంతా దీనిని అంగీకరించారు కాబట్టే ఐడియా లజీ మరణించింది అని కూడా చెప్పారాయన. ఇక 1848 నాటి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ‘వైద్యులు, న్యాయవాదులు, కవులు, శాస్త్రవేత్తలు, బుద్ధిజీవులను బూర్జువా ప్రభుత్వం కూలికి పనిచేసే నౌకర్లుగా మార్చి వేస్తుంది’ అంటుంది. ఇది ఇప్పటికీ ఇక్కడి బుద్ధిజీవులందరికీ వర్తిస్తుం ది. కొందరు ప్రభుత్వం వైపువెళితే, ఇంకొందరు క్షమించరాని మౌనం లోకి వెళ్లారు. ఇక్కడే ఈ మేధావుల పాత్రపై అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. ఉద్యమకాలంలో, తరువాత వర్గం, కులం పనిచేసింది. అం దుకే తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజాసంఘాలు, తరువాతి సం ఘాలు, ఆ నాయకుల ఆచరణ కొద్దిగా పరిశీలిద్దాం. ప్రత్యేక ఉద్యమం తెరాసతోనే మొదలు కాలేదు. 1990 నాటి నూతన ఆర్థికవిధానాల కింద నలిగిపోయిన తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను గురించి నాడే బుద్ధిజీవులు గుర్తించారు. దీనినే 1995లో ఏర్పడిన జనసభ మరింత తీక్షణంగా వెల్లడించింది. దీని వెనుక పీపుల్స్‌వార్ ఉన్నదని ప్రభుత్వాలు దమనకాండకు దిగాయి కూడా. అప్పుడే సీనియర్ తెలంగాణ వాదులు చర్చను లేవదీశారు. ఆ తరువాతే తెరాస ఆవిర్భవించింది. దీనికి జయశంకర్ కట్టె విరగని, పాము చావని భావజాలంతోడైంది. ప్రజాసంఘాలు తెలంగాణకు కాక, తెరాసకు అనుబంధంగా మారడం మొదలైంది. దీనికి ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి తెరాస నిధులు సమకూర్చి పెట్టింది. అందుకే చాలామంది దీనికి ఎడం పాటించారు. అయితే తెరాసలో పలువురు వామపక్షవాదులు చేరడంతో విశ్వసనీయత పెరిగింది. అదే సమయం లో సీట్లు, ఓట్ల రాజకీయంలో ఆరితేరి, తన అధీనంలో నడిచే ప్రజాసం ఘాల నేతలు కాగితం పులులు అనే అంచనాకు తెరాస వచ్చింది. అప్పుడే టీఎన్జీ సంఘం, విద్యావంతుల వేదిక పూర్తిగా ఆ పార్టీ కౌగి లిలోకి వెళ్లాయి. చివరికి పూర్తిస్థాయి ఎన్నికల పార్టీగా మారి, సామాజిక సమీకరణ హామీలను విస్మరించింది. పైగా తైనాతీలతో అనుబంధ సంఘాలను నిర్మించింది. తెలంగాణ ఏర్పడి ఏడాది అయింది. దాని విధానాలు మాత్రం గత ప్రభుత్వాలవే. ఆశ్రీత పెట్టుబడి, ఇసుక, గ్రానై ట్, మానవ, సహజవనరుల దోపిడీ వేగం అందుకున్నాయి. దీనిని కప్పిపుచ్చడానికి చెరు వులు, జలహారం, ఆసరా అంటూ ప్రకటనలు ఇస్తున్నది. తెలంగాణ బుద్ధిజీవులు, ముఖ్యంగా లెఫ్ట్ నుంచి వచ్చిన వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఈ ఏడాది కాలంలో ప్రజాసంఘాల నేతలు ప్రజాబోనులో ముద్దాయిలుగా మిగిలారు. ‘మేధావులు సమాజ మా ర్పులో తమ పాత్ర ఉందనే విషయాన్ని మరచిపోతారు. సంక్షేమ రాజ్యాధికారానికి దగ్గరగా ఉండడమే వారికి ఇష్టం’ అన్న బెల్ మాటలే ఇందుకు సమాధానం. కానీ మేధా వులు తృప్తి పడినంత మాత్రాన మార్పు అవసరం లేదా? జూకంటి జగన్నాథం (వ్యాసకర్త అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు) మొబైల్: 9441078095 -
మీరేం చేయగలరు...
వ్యవసాయం నుంచి మెలమెల్లగా పెట్టుబడిని తరలించి ఫలసాయం లేనిది ఎవుసం అనగలరు ఇంటింటికి టివి అందించి వస్తువులు అక్కర లేకున్నా అవసరమని ఒప్పించి ఇల్లును బోల్తా కొట్టించగలరు మనిషి మనిషికి ఒక సెల్‌ను అమ్మి బంధాలను విడగొట్టగలరు కుదిరిన పెండ్లిల్లను చెడగొట్టగలరు రైతులను స్వచ్ఛందంగా ఆత్మహత్యల వైపు కూలీలను లేబర్ అడ్డాల వైపు తరిమి రోడ్లు ఊడ్చేవారిగా భవన నిర్మాణ కార్మికులుగా పరిమార్చగలరు తరి భూములను బరాబరి గుంజుకుని పరిశ్రమలకు దానధర్మం చేయగలరు . సహజ ఆత్మీయుల మధ్య పొగలేని మంటపెట్టి మసలివారిని పాత సామానులా వృద్ధాశ్రమాలకు తరిమికొట్టగలరు దిక్కుతోచక తల్లిదండ్రులు పుటుక్కున చనిపోతే పిల్లలను అనాథాశ్రమాలకు దయతో పంపించగలరు ఫోర్లైన్ల రోడ్లేసి గ్రామ సంపదను క్షణాల్లో తరలించగలరు తాగే నీళ్లు లేకుండా చేసి ఇంటింటికి మంచినీళ్లు అమ్మగలరు తిండి అందకుండా చేసి బియ్యం పంచగలరు ఆహారానికి భద్రతను కల్పించగలరు పని దొరక్కుండా చేసి ఉపాధి హామీ ఇవ్వగలరు .పరిహాస పరిహారాలు ఇవ్వగలరుగాని ఊరితో ముడిపడిన జ్ఞాపకాలను ఇవ్వలేరు . స్థూపాలను కట్టగలరు కానీ గుండెల్లో గడ్డపారలా దిగబడిన మనఃస్తాపాలను మాన్పలేరు రాత్రులకు లెసైన్స్ ఇచ్చి ఉదయాలను బంధించాలని చూస్తారు. రాజ్యాంగం పేర నియంతృత్వం చేయగలరు చట్టం పేర దేశాన్ని నేలమట్టం చేయగలరు మీరేం చేయగలరు మహా అయితే పాత గోడలకు పూత సున్నం పూయగలరు .మీరేం చేయగలరు నిరసన చేసే ప్రజలకు మోచేతికి బెల్లం పెట్టి నాకమనగలరు. కాదంటే చచ్చేలా చేసి చావు డప్పు కొట్టగలరు. - జూకంటి జగన్నాథం 9441078095