jukkal Constituency
-
జుక్కల్ నియోజకవర్గానికి రూ.32 కోట్ల నిధులు
మద్నూర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్గల్, పిట్లం, నిజాంసాగర్ ఐదు మండలాలకు రూ.32 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే హన్మంత్‌సింధే వెల్లడించారు. ఆయా మండలాల్లో నిధులను రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ.335 కోట్లు మంజూరు చేశారని అన్నారు. అతి త్వరలో డిగ్రీ కళాశాల.. మద్నూర్ మండల విద్యార్థులు, ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతి త్వరలో రాబోతుందని, దీంతో విద్యార్థుల కళ నెరవేరుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌సింధే పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మద్నూర్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం తీవ్రంగా కృషి చేసినట్లు ఆయన అన్నారు. ఆలస్యం లేకుండా మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు ఉత్తర్వులు త్వరలో వస్తాయని పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ మంజూరుతో బీఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేను స్థానిక ప్రజాప్రతినిధులు సన్మానించారు. సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు సురేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీపటేల్, ఆత్మకమిటీ చైర్మన్ గంగాధర్, ఉప సర్పంచ్ విఠల్, నాయకులు కంచిన్ హన్మండ్లు, పాకాల విజయ్, కుషాల్ తదితరులు ఉన్నారు. -
జుక్కల్ కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు..అసలు అక్కడ ఏం జరుగుతోంది?
అంతర్గత కలహాలు, కుమ్ములాటలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే పరిస్థితి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కూడా కుమ్ములాటలు మొదలయ్యాయి. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ముగిసింది జుక్కల్‌లోనే. రాహుల్ యాత్ర ఉత్సాహాన్ని ముఠా కుమ్ములాటలు నీరు గారుస్తున్నాయి. అసలు జుక్కల్‌లో ఏం జరుగుతోంది? కారు జోరు.. చేయి బేజారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ జుక్కల్ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయిగాని..టీఆర్ఎస్ను ఓడించేంత స్థాయిలో ఉన్నాయా అన్నది ప్రశ్నే. ఎలాగైనా జుక్కల్‌ను గెలుచుకోవాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు సీరియస్‌గా ఫోకస్ పెట్టాయి. అందుకే ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ గట్టిగానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలో జుక్కల్ నియోజకవర్గంలోనే ముగిసి మహారాష్ట్రలో ప్రవేశించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభకు భారీగా జనం రావడంతో.. కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నాయి. ఎప్పుడైతే కేడర్‌లో ఉత్సాహం పెరిగిందో నాయకుల్లో గ్రూపులు తయారయ్యాయి. పార్టీ నిస్తేజంగా ఉన్నంతవరకు అంతా బాగానే ఉంది. ఎన్నికలు ఏడాదిలోపే ఉండటం.. రాహుల్ యాత్ర తర్వాత పట్టు పెరిగిందని భావించడంతో గ్రూపులు పెరిగి కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరి ఊపు వారిదే గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన కాంగ్రెస్ నేత సౌదాగర్ గంగారాం ఈసారి ఎలాగైనా.. హన్మంత్ షిండేపై గెలిచి అసెంబ్లీలో మరోసారి అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అదే సమయంలో గడుగు గంగాధర్ అనే మరో నేత కూడా జుక్కల్ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాహుల్ పాదయాత్ర సమయంలో కూడా యాక్టివ్‌గా కనిపించారు. గంగాధర్ తీరుతో సౌదాగర్ గంగారాం అలిగి పాదయాత్ర నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసి నాయకులంతా ఆయన్ను బ్రతిమిలాడి సభకు తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీలోని స్థానిక విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఈ రెండు గ్రూపుల మధ్యకు ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మీకాంతరావు అనే మరో ఎన్ఆర్ఐ ప్రవేశించారు. తానూ లైన్లో ఉన్నానంటూ మీడియా సమావేశం నిర్వహించి రాహూల్ పాదయాత్రతో తాను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడైనట్టు ప్రకటించుకున్నారు. ఇప్పటికే ఆయన పేరు కూడా నియోజకవర్గంలో వినిపిస్తుండటంతో...ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు ముక్కలాట హాట్ టాపిక్‌గా మారింది. గ్రూపులు, ముఠాలు అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో తెలీని పరిస్థితుల్లో... జుక్కల్ కాంగ్రెస్‌లో ఇప్పటికే మూడు గ్రూపులు తయారయ్యాయి. నాయకులే ముఠాలు కట్టడంతో ఇక ఎక్కడికక్కడ స్థానిక, గ్రామస్థాయి కేడర్ కూడా గ్రూపులుగా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ చీలిక ఎన్నికల నాటికి ప్రత్యర్థులకు మంచి ఆయుధంగా ఉపయోగపడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు బయట ఎక్కడో లేరు..లోపలే ఉన్నారంటూ సెటైర్లు పడుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అట్టడుగు నుంచి అభివృద్ధి వైపు.. హన్మంత్‌సింధే
కర్ణాటక, మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న జుక్కల్ త్రిభాషా పద్ధతులకు నిలయంగా మారింది. సమైఖ్యపాలనలో వెనుకబడి ప్రాంతంగా పేరొందిన జుక్కల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కంచుకోటగా నిలిచిన జుక్కల్ నియోజకవర్గం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అనంతరం టీఆర్ఎస్ పార్టీ కారు జోరందుకుంది. గతంలో వెనుకబడిన ప్రాంతమిది.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం 1978లో ఎస్సీలకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి ఇక్కడి నుంచి ఏపీ అసెంబ్లీకి ఎన్నికైనా అభివృద్ధిని విస్మరించారు. రోడ్లు, రవాణా సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో విద్య, వైద్య సదుపాయాలు అందని ద్రాక్షగా మారాయి. సాగునీటి సదుపాయం లేక వ్యవసాయం దెబ్బతింది. అంతరాష్ట్ర లెండి ప్రాజెక్టుకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో పనులు అర్థంతరంగా నిలిచాయి. స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత 2014లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హన్మంత్‌సింధే విజయం సాధించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం కావడం టీఆర్ఎస్ నుంచి హన్మంత్‌సింధే ఎమ్మెల్యే కావడంతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. నిరక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు, రవాణా మార్గాలు మెరుగయ్యాయి. నాలుగు నెలల కాలంలో రూ.1,560 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఇది.. పిట్లం, బిచ్కుద, పెద్దకొడప్గల్ మండలాల్లోని 50గ్రామాలు, నిజాంసాగర్ మండలంలోని నాన్‌కమాండ్ ఏరియా ప్రాంత ప్రజల చిరకాల కోరికైన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.476.25 కోట్లు మంజూరు చేసింది. డబుల్ లైన్ రోడ్లు లేని జుక్కల్ నియోజకవర్గంలో 14రోడ్లను 165కి.మీ మేర సుందరీకరణకు రూ. 212.08 కోట్లు కేటాయించింది. అలాగే ఆయా మండలాల్లో నూతనంగా 6 వంతెనలకు రూ.52కోట్లు మిషన్ కాకతీయ పథకం కింద 264 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.85కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు గోదాములు 23,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి రూ.14.50కోట్లు జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లో 30 పడకల ఆస్పత్రుల గదుల నిర్మాణానికి రూ.10కోట్లు పంచాయతీరాజ్ బీటీ రోడ్లు 32 గ్రామాలకు 45కి.మీ రూ.52కోట్లు మిషన్ భగీరథ పథకానికి రూ.300 కోట్లు మంజూరు జుక్కల్ జూనియర్ కళాశాలకు రూ.2.25 కోట్లు బిచ్కుంద జూనియర్ కళాశాలకు రూ.1.50 కోట్లు రెసిడెన్షియల్, కళాశాలలు, పాఠశాల అదనపు గదులకు రూ.25 కోట్లు రూ. 45 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం రూ. 40 కోట్లతో కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం పెద్దకొడప్గల్లో మండల కేంద్రంగా ఏర్పాటు కొత్తగా 66 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేపట్టాల్సిన పనులు నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దడం, నిజాంసాగర్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, పిట్లం మండల కేంద్రంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల, పక్కగృహాలు లేనికి వారికి సొంతిళ్ల నిర్మాణం, కౌలాస్ కాలువల ఆధునికీకరణ, ఇండస్ట్రియల్స్ ఏర్పాటు చేయాల్సిన ఉంది. సెగ్మెంట్ గ్రాఫ్ మండలం ఓటర్లు పురుషులు స్త్రీలు ఇతరులు మద్నూర్ 40,254 20,251 19,999 04 జుక్కల్ 31,797 16,117 15,680 00 బిచ్కుంద 35,508 17,527 17,977 04 పెద్దకొడప్గల్ 13,638 6,833 6,804 01 పిట్లం 30,370 14,842 15,524 04 నిజాంసాగర్ 25,309 11,884 13,424 01 ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి ఇంజినీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి తనను జుక్కల్ నియోజవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయా.2009 ఎన్నికల్లో గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వ కారణంగా అనుకున్నతంత అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర సాధన కోసం 2014 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాను. స్వరాష్ట్రంలో జుక్కల్ అభివృద్ధికి సీఎం నిధులు కేటాయించడంతో పురోగతి సాధించాం. ఇప్పటివరకు చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుంది. – హన్మంత్‌సింధే, టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే -
మద్యం రవాణాపై డేగ కన్ను
బిచ్కుంద, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల నేపథ్యంలో మ ద్యం అక్రమ రవాణాపై పొలీసులు దృషి సారించారు. మ హారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల వెంట జుక్కల్ నియోజకవర్గంలో మద్యం ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టారు. ఏ మార్గం ద్వారానైనా మద్యం రవాణా లేకుండా పొలీసులు డేగ కన్ను ఉంచారు. ఎన్నికల్లో మద్యం సరఫరాను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్ధేశిత మద్య దుకాణాలకే సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోరినంత మద్యం అందడం లే దు. మద్యం కొరత ఏర్పడింది. అయినా కొందరు అడ్డదారుల్లో మద్యం రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యం గా చెక్‌పోస్టుల దగ్గర ఎవరికి అనుమానం రాకుండా కాలినడకతో పొలాల నుంచి వెళ్లి చెక్‌పోస్టు దాటిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి మద్యం దిగుమతికి ఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్‌ల్లో నిర్దేశిత స్టాక్ ఉంది. దీంతో ఎన్నికల ముందు కోరినంత మద్యం అందడం కష్టంగా మారింది. ఇప్పటి నుంచే వ్యాపారులు మద్యం సేకరించి రహస్య ప్రదేశాల్లో ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెక్‌పోస్టుల ఏర్పాటు.. మద్యం అక్రమ రవాణా ఎత్తులను చిత్తు చేసేందుకు పొలీ స్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఏ మార్గం ద్వారానైనా మద్యం రవాణాను నిరోధించేందుకు నిఘాను తీవ్రతరం చేశారు. ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా సరిహద్దు కల్హెర్ మండలం మాసన్పల్లి గేటు వద్ద, కర్ణాటక సరిహద్దులో జుక్కల్ మండలం గుల్లా, చండేగాం, సోమూర్, పిట్లం మండలం గోద్మెగాం, తిమ్మనగర్, మహారాష్ట్ర సరిహద్దు ఎస్ఎన్ఏ రోడ్డు మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద పొలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యాన్ని అడ్డుకుంటాం.. ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం రవాణా కాకుండా నిఘా కట్టుదిట్టం చేశాం. నిఘాను పెంచాం. అక్రమ వ్యాపారుల మార్గాలను నిరోధించి తీరుతాం. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో అక్కడక్కడ 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. అన్నిరకాలుగా ముమ్మర తనిఖీలు చేస్తున్నాం. రాత్రివేళ్లల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం. - వెంకటేశం, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి సీఐ, బిచ్కుంద.