బికినీయే కారణం కాదు!
‘మిస్ వరల్డ్’ కిరీటం సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. చక్కటి శరీర కొలతలతో పాటు సమయ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ... ఇలా ఎన్నో విషయాల్లో మార్కులు సంపాదిస్తేనే ఆ బిరుదు సొంతం అవుతుంది. అలాగే, ఈ పోటీల్లో భాగంగా ‘బికినీ రౌండ్’ ఒకటుంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పోటీలో నిలిచే భామలు ఈత దుస్తులు ధరించాల్సిందే. అయితే, ఇక ఈత దుస్తులు ధరించాల్సిన అవసరంలేదు.
‘మిస్ వరల్డ్’ పోటీలకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న జూలియా మోర్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈత దుస్తుల వల్ల అమ్మాయికి ఒరిగేదేమీ లేదనీ, ఆ మాటకొస్తే దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని ఈ సందర్భంగా జూలియా పేర్కొన్నారు. దీని గురించి ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ -‘‘1994లో నేను ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్నాను. వాస్తవానికి ఆ సమయంలో నాతో పాటు పోటీలో నిలిచిన 87 మంది అమ్మాయిలతో పోలిస్తే నా శరీరాకృతి ఈత దుస్తులకు అనువుగా ఉండేది కాదు.
కానీ, స్విమ్ సూట్ ధరించాలనే నిబంధన ఉండటంతో ఏమీ చేయలేకపోయాను. అయినప్పటికీ నేను ప్రపంచ సుందరి కిరీటం సాధించగలిగాను. ఈ కిరీటాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది బికినీ రౌండే అని చాలామంది భావిస్తారు. కానీ, అదొక్కటే కాదు. ఆత్మవిశ్వాసం, ప్రవర్తన.. ఇలా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఏదేమైనా బికినీ రౌండ్ తీసేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.