Juluru Gowrisankar
-
వైభవంగా ముగిసిన పుస్తకాల జాతర
కాలాలె న్ని మారినా ‘‘పుస్తకం’’ మాత్రం చిరంజీవిగా వ ర్ధిల్లుతూనే ఉంటుందని హైదరాబాద్‌లో జరిగిన పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. డిసెంబర్ 17 నుంచి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ పుస్తక ప్రదర్శన నగరంపై చెరిగిపోని ముద్రవేసింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ప్రజలు పాల్గొన్న అతిపెద్ద పండుగగా ఇది నిలిచింది. వైద్యులు రోగుల దగ్గరకు వెళ్లాల ని ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నార్మెన్ బెతూన్ పిలుపు నిస్తే పాఠకుల దగ్గరకు పుస్తకాన్ని తీసుకుపోవాలని, నెత్తిన పుస్తకా లు పెట్టుకొని మోసినవాడు ‘‘ప్రజల మనిషి’’ వట్టికోట ఆళ్వా రుస్వామి. ప్రజల కోసం జన హితం కోరి మాటలు కట్టిన కవి కాళోజీ నారాయణరావు ప్రాంగణంలో హైదరాబాద్ బుక్‌ఫెయిర్ 2014 అత్యంత ఘనంగా జరిగింది. మున్నెన్నడూలేని విధంగా లక్షలాది మంది పుస్తక ప్రియులు ఈ బుక్ఫెయిర్లో పాల్గొన్నారు. పుస్తకాలు చదవటం తగ్గిందని చెబుతున్న ఈ డిజిటల్ యుగంలో పుస్తక ప్రియులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన డం అపూర్వం. కాలాలెన్నిమారినా ‘‘పుస్తకం’’ మాత్రం చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉందని ఈ పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అతి పెద్ద పుస్తకాల పండుగగా ఈ ఏడాది బుక్‌ఫెయిర్ నిలు స్తుంది. ఈ పుస్తక ప్రదర్శనకు అపూర్వ ఆదరణ లభించ టమేగాక లక్షలాది పుస్తకాల విక్రయం కూడా జరిగింది. హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగే వినాయక చవితి, దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగల్లాగా ఈ పుస్తకాల పండుగ వైభవంగా జరిగింది. పండుగలకు కొత్త బట్టలు కుట్టించుకున్నట్లుగా ఈ పుస్తకాల పండుగలో పాల్గొని కొత్త పుస్తకాలను కొనుక్కునిపోయారు. అన్ని దినపత్రికల సంపాదకులు, అన్ని రాజకీయ పార్టీల నాయ కులు, తెలంగాణ పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకు లు, విద్యార్థులు, సబ్బండ వర్ణాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్న అతిపెద్ద పండుగగా ఇది నిలిచింది. ఈ పుస్తక ప్రదర్శనలో యువతరం ప్రాతి నిధ్యం బాగా పెరగడం వల్ల ఈ పండుగకు కొత్త అందం వచ్చినట్లయింది. డిసెంబర్ 17 నుంచి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ పుస్తక ప్రదర్శన నగరంపై చెరిగి పోని ముద్ర వేసింది. ఇప్పటి వరకు 28 పుస్తక ప్రదర్శ నలు జరిగాయి. ఇన్నేళ్లకాలంలో ఈ స్థాయిలో జనం పోటెత్తి రావటం మాత్రం ఈసారేనని పలువురు పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శన విజయవంతం వెనుక ప్రచార ప్రసార సాధనాల పాత్ర మరువలేనిది. బుక్ ఫెయిర్ సందర్భంగా పలు రంగాలకు చెందిన వారు విలువైన సందేశాలు ఇచ్చారు. తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ఎగిసిన కలాలు తమ గొంతు విప్పి ఆ ప్రాంగణంలో కవి సమ్మేళనమయ్యాయి. గోరటి వెంకన్న, సుద్ధాల అశోక్‌తేజ, దేశపతి శ్రీనివాస్, జయరాజ్‌లు తమ కంఠాలు విప్పి సాహిత్య సాంస్కృతిక సౌరభాలను వెదజ ల్లారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్, అల్లం నారా యణ, దిలీప్‌రెడ్డి, టంకశాల అశోక్, వీరయ్య, ఎం.వి.ఆర్. శాస్త్ర పుస్తక ప్రదర్శనలో అక్షరాయుధాలను లిఖించారు. రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావులు పుస్తక ప్రదర్శనకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు. న్యాయాధిపతులు చంద్రకుమార్, జింబోలు ఆ సభల్లో పాల్గొని పుస్తక పఠనంపై తీర్పులిచ్చారు. మెరిసే అక్షరాల వెనుక కష్టజీవులున్నారని వరవరరావు ఉద్యమాక్షరాలను చదివారు. సిధారెడ్డి, జూకంటి, జయధీర్, ఎస్.వి, నాళే శ్వరం, జగన్‌రెడ్డి, నిఖిలేశ్వర్, సుంకిరెడ్డిల దగ్గర నుంచి పులిపాటి గురుస్వామి వరకు ఎందరెందరో కవులూ, రచ యితలు ఆ ప్రాంగణాన్ని తమ కలాలతో కదంతొక్కారు. రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, కోదండరామ్‌లు పుస్తక ప్రపం చాన్ని గూర్చి సందేశాలిచ్చారు. సుమారు 4లక్షల మంది పుస్తక ప్రియులు పాల్గొన్న ఈ పుస్తక ప్రదర్శనను కనీసం 20 రోజులుగా నిర్వహిం చాలని పలువురు కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈ బుక్‌ఫెయిర్‌కు సంపూర్ణ సహకారం లభించిం ది. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో వరల్డ్ బుక్‌ఫెయిర్ నిర్వ హిస్తామని, పుస్తకాలను పాఠకుల దగ్గరకు తీసుకుపోయే ప్రక్రియలో భాగంగా ప్రతి జిల్లాలో ఈ బుక్‌ఫెయిర్‌ను నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వచ్చే ఏడాది పుస్తకాల పండుగ కోసం అందరం ఎదురు చూద్దాం. పుస్తకం వర్థిల్లాలి. జ్ఞాన సమాజం జిందాబాద్. (వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు) -
ప్రపంచ ముఖచిత్రం పుస్తకం
సందర్భం పుస్తకాలు జ్ఞాన నిక్షిప్త కేంద్రా లు. పుస్తకాల్లోనే ప్రపంచం పొదిగి ఉంటుంది. పుస్తకాల్లో పండే జ్ఞానపు పంటలు కొత్త సమాజాలను నిర్మిస్తాయి. వంద తుపాకులను చూసినా వెనకడుగు వేయని నియంత లు సైతం ఒక్క సిరాచుక్కను చూస్తే భయంతో వెనుదిరు గుతారు. ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ల కదలిక అన్నది అక్షర సత్యమని మరువరాదు. పుస్తకాల సమ్మేళనమంటే ప్రపం చంలోని దేశదేశాల సమ్మేళనంలాగా ఉంటుంది. ఒక ప్రాంతాన్ని చూడాలన్నా ఆ ప్రాంతం సర్వసమగ్రరూపం, సాహిత్య సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగాలను అవగతం చేసుకునే జ్ఞానకేంద్రం పుస్తకం. ప్రపంచమంతా పరిణామక్రమంలో ఎలా పురోగమి స్తూ ముందుకు సాగిందో తెలియజేసే సాధనం పుస్తకం. అందుకే పుస్తకం మనచేతిలో ఉంటే ప్రపంచమంతా మన చేతుల్లో ఉన్నట్లుగానే భావించాలి. చరిత్రను చదువుకుని వర్తమానంలో నిలిచి భవిష్యత్తుకు ముందుకు అడుగులు వేసేందుకు ఒక వంతెనలాంటిది పుస్తకం. అందుకే ప్రపం చాన్ని వెతుక్కుంటూ పోయిన వాళ్ల దారులన్నీ పుస్తకాల నుంచే మొదలయ్యాయి. పుస్తకం ఒక బోధి చెట్టు. పుస్తకం ఒక సమాజ వ్యవస్థ. పుస్తకం ఎగిసిపడే పోరాటాల అలల నది. పుస్తకం ప్రపంచ ముఖచిత్రం. పుస్తకం సర్వస్వం. అందుకే మనందరం పుస్తకాలమవుదాం. మనదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలను చదువుకుంటూ ప్రపంచాన్ని చదువుకున్నవా డు. నెహ్రూ పుస్తక ప్రియుడు. అందుకే తన ఆలోచనతో నేషనల్ బుక్‌ట్రస్టును ప్రారంభించారు. ఆ వారసత్వంతో నే ఇప్పటి వరకు నేషనల్ బుక్‌ట్రస్ట్ అన్ని ప్రాంతీయ భాషల్లో అనేక విలువైన పుస్తకాలను దేశానికి అందిం చింది. నెహ్రూ ఆలోచనా మార్గంలో నాటి నుంటి నేటి వరకు నేషనల్ బుక్‌ట్రస్టు వేలాది విలువైన పుస్తకాలను చరిత్రకు అందించింది. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బుక్ ట్రస్టు తరపున ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ‘‘వరల్డ్ బుక్ ఫెయిర్’’ జరుగు తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు, భారతీ య భాషలు, దేశదేశాల భాషలకు చెందిన పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్‌లో లభిస్తాయి. ఇతర భాషల్లోకి వెళ్లే వారికి కాపీరైట్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఈ వరల్డ్‌బుక్ ఫెయిర్‌లో విస్తృతంగా జరుగుతాయి. రచయితల ప్రచుర ణలకు, ప్రచురణకర్తలకు కాపీరైట్స్ అమ్మకాలకు, వరల్డ్ బుక్ ఫెయిర్ వేదికగా ఢిల్లీ బుక్‌ఫెయిర్ నిలుస్తుంది. ఈ వరల్డ్ బుక్ ఫెయిర్ దృక్పథం నుంచే మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ బుక్‌ట్రస్ట్ దేశ వ్యాప్తంగా బుక్ ఫెయిర్లు నిర్వహిస్తుంది. నేషనల్ బుక్ ట్రస్ట్(ఎన్బీటీ) ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు రాష్ట్రాలను ఎంపిక చేసుకొని జాతీ య పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ ఉంది. ఇదే కాకుండా ప్రాంతీయ జిల్లాస్థాయిల వరకు ఈ పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తుంది. కొత్త పుస్తకాలు తేవటం, అచ్చు వేయటం, కొత్త రచయితలు విస్తృతంగా రాసుకునే అవకాశం ఎన్బీటీ కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహి స్తున్నట్లుగా తెలుగు రచయితలకు, ప్రచురణకర్తలకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు తెలంగాణ భాషాభివృద్ధి, నిఘంటువుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ‘‘తెలుగు బుక్‌ట్రస్ట్’’ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో 28 బుక్ ఫెయిర్లు జరిగాయి. ఈ ఏడాది 29వ బుక్ ఫెయిర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 17 నుంచి 26వ తేదీ వరకు జరు గుతుంది. ప్రాంతీయ భాషల సమాహారంగా హైదరాబా ద్ విలసిల్లుతుంది. పలు భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలను తన కడుపులో దాచుకున్న పలు భాషల తల్లిగా హైదరాబాద్ నగరం నిలిచింది. 14, 15 శాతాబ్దాల నుంచి బహుభాషల రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నిలిచింది. కులీకుతుబ్‌షా హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తూ సముద్రంలో చేపలు ఎలా నిండుతాయో హైదరాబాద్ నగరం కూడా ప్రజలతో నిండిపోవాలని ఈ నగర నిర్మాణం ప్రారంభించారు. దేశంలో ఎన్ని భాషలున్నాయో అవన్నీ హైదరాబాద్ నగర పునాదుల్లో ఉన్నాయి. దేశ భాషలన్నింటికీ హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ భాషతో, తెలం గాణ జీవన సంస్కృతి ఉట్టిపడే విధంగా తెలంగాణ రాష్ట్రం లో తొలిసారిగా ఈ బుక్‌ఫెయిర్ జరగబోతుంది. భిన్న భాషా సంస్కృతులను తనలో ఇముడ్చుకున్న రాష్ట్రం ఏదంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని సగ ర్వంగా చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జరుగుతున్న తొలి పుస్తకాల పండుగగా 2014 బుక్ ఫెయిర్ నిలుస్తుంది. ఈసారి జరిగే బుక్ ఫెయిర్ ముఖద్వారం తెలంగాణ వైతాళికులతో రూపు దిద్దుకుం టుంది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతికరంగానికి దిశా నిర్దేశం చేసిన వైతాళికులతో ఈ బుక్‌ఫెయిర్ ద్వారం నిర్మించబడుతుంది. బుక్ ఫెయిర్ లోపల జరిగే సాహిత్య సాంస్కృతిక వేదిక నవల, కథ, రచయిత, ఆంధ్ర మహా సభ, నాయకులు, తెలంగాణ పోరాటాల్లో భాగస్వామి అయిన వట్టికోట ఆళ్వారుస్వామి, బండి యాదగిరిల పేరుతో రూపుదిద్దుకుంటుంది. 1938లోనే దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 1961 వరకు వట్టికోట పుస్తకాల ను వేశారు. పుస్తక సంస్కృతిని పెంపొందించేందుకు ఈ బుక్ ఫెయిర్‌ను తీర్చిదిద్దాలని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పేరుపడ్డ పబ్లికేషన్స్ మూడు రోజు లకొక పుస్తకాన్ని వెలువరిస్తున్నాయి. అలాగే స్వతంత్రంగా ఎందరెందరో రచయితలు పుస్తకాలు వేస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో సంవత్స రానికి వేయికి పైగా పుస్తకా లు వెలువడుతున్నాయి. ఈ పుస్తక ప్రదర్శనను తిలకిం చేందుకు లక్షలాది మంది హాజరవుతున్నారు. దేశంలో ఢిల్లీ, కలకత్తా, తర్వాత జరిగే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు స్థానముంది. దేశంలోనే బుద్ధిజీవులందరికీ ఈ పుస్తక ప్రదర్శన కేంద్రంగా నిలుస్తుంది. పుస్తక సంస్కృతిని విస్తృతపరిస్తే అది విశ్వ కల్యాణానికి దోహదపడుతుంది. మంచి సమాజాన్ని నిర్మించటానికి మనందరం కలిసి అడుగులు వేద్దాం. కొత్త సమాజ నిర్మాణానికి పునాదులు వేసేందుకు కొత్త తరాన్ని తయారు చేసేందుకు మనందరం పుస్తకాలమవుదాం పదండి. పుస్తకమే ప్రపంచమని ప్రపంచానికి చాటి చెబుదాం. (ఈ నెల 17 నుంచి 26 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 2014 బుక్‌ఫెయిర్ సందర్భంగా) వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్ట్