
వైభవంగా ముగిసిన పుస్తకాల జాతర
కాలాలె న్ని మారినా ‘‘పుస్తకం’’ మాత్రం చిరంజీవిగా వ ర్ధిల్లుతూనే ఉంటుందని హైదరాబాద్‌లో జరిగిన పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. డిసెంబర్ 17 నుంచి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ పుస్తక ప్రదర్శన నగరంపై చెరిగిపోని ముద్రవేసింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ప్రజలు పాల్గొన్న అతిపెద్ద పండుగగా ఇది నిలిచింది.
వైద్యులు రోగుల దగ్గరకు వెళ్లాల ని ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నార్మెన్ బెతూన్ పిలుపు నిస్తే పాఠకుల దగ్గరకు పుస్తకాన్ని తీసుకుపోవాలని, నెత్తిన పుస్తకా లు పెట్టుకొని మోసినవాడు ‘‘ప్రజల మనిషి’’ వట్టికోట ఆళ్వా రుస్వామి. ప్రజల కోసం జన హితం కోరి మాటలు కట్టిన కవి కాళోజీ నారాయణరావు ప్రాంగణంలో హైదరాబాద్ బుక్‌ఫెయిర్ 2014 అత్యంత ఘనంగా జరిగింది.
మున్నెన్నడూలేని విధంగా లక్షలాది మంది పుస్తక ప్రియులు ఈ బుక్‌ఫెయిర్‌లో పాల్గొన్నారు. పుస్తకాలు చదవటం తగ్గిందని చెబుతున్న ఈ డిజిటల్ యుగంలో పుస్తక ప్రియులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన డం అపూర్వం. కాలాలెన్నిమారినా ‘‘పుస్తకం’’ మాత్రం చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉందని ఈ పుస్తక ప్రదర్శన తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అతి పెద్ద పుస్తకాల పండుగగా ఈ ఏడాది బుక్‌ఫెయిర్ నిలు స్తుంది. ఈ పుస్తక ప్రదర్శనకు అపూర్వ ఆదరణ లభించ టమేగాక లక్షలాది పుస్తకాల విక్రయం కూడా జరిగింది.
హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగే వినాయక చవితి, దసరా, రంజాన్, క్రిస్‌మస్ పండుగల్లాగా ఈ పుస్తకాల పండుగ వైభవంగా జరిగింది. పండుగలకు కొత్త బట్టలు కుట్టించుకున్నట్లుగా ఈ పుస్తకాల పండుగలో పాల్గొని కొత్త పుస్తకాలను కొనుక్కునిపోయారు. అన్ని దినపత్రికల సంపాదకులు, అన్ని రాజకీయ పార్టీల నాయ కులు, తెలంగాణ పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకు లు, విద్యార్థులు, సబ్బండ వర్ణాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్న అతిపెద్ద పండుగగా ఇది నిలిచింది.
ఈ పుస్తక ప్రదర్శనలో యువతరం ప్రాతి నిధ్యం బాగా పెరగడం వల్ల ఈ పండుగకు కొత్త అందం వచ్చినట్లయింది. డిసెంబర్ 17 నుంచి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ పుస్తక ప్రదర్శన నగరంపై చెరిగి పోని ముద్ర వేసింది. ఇప్పటి వరకు 28 పుస్తక ప్రదర్శ నలు జరిగాయి. ఇన్నేళ్లకాలంలో ఈ స్థాయిలో జనం పోటెత్తి రావటం మాత్రం ఈసారేనని పలువురు పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శన విజయవంతం వెనుక ప్రచార ప్రసార సాధనాల పాత్ర మరువలేనిది.
బుక్ ఫెయిర్ సందర్భంగా పలు రంగాలకు చెందిన వారు విలువైన సందేశాలు ఇచ్చారు. తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ఎగిసిన కలాలు తమ గొంతు విప్పి ఆ ప్రాంగణంలో కవి సమ్మేళనమయ్యాయి. గోరటి వెంకన్న, సుద్ధాల అశోక్‌తేజ, దేశపతి శ్రీనివాస్, జయరాజ్‌లు తమ కంఠాలు విప్పి సాహిత్య సాంస్కృతిక సౌరభాలను వెదజ ల్లారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్, అల్లం నారా యణ, దిలీప్‌రెడ్డి, టంకశాల అశోక్, వీరయ్య, ఎం.వి.ఆర్. శాస్త్ర పుస్తక ప్రదర్శనలో అక్షరాయుధాలను లిఖించారు. రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావులు పుస్తక ప్రదర్శనకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు.
న్యాయాధిపతులు చంద్రకుమార్, జింబోలు ఆ సభల్లో పాల్గొని పుస్తక పఠనంపై తీర్పులిచ్చారు. మెరిసే అక్షరాల వెనుక కష్టజీవులున్నారని వరవరరావు ఉద్యమాక్షరాలను చదివారు. సిధారెడ్డి, జూకంటి, జయధీర్, ఎస్.వి, నాళే శ్వరం, జగన్‌రెడ్డి, నిఖిలేశ్వర్, సుంకిరెడ్డిల దగ్గర నుంచి పులిపాటి గురుస్వామి వరకు ఎందరెందరో కవులూ, రచ యితలు ఆ ప్రాంగణాన్ని తమ కలాలతో కదంతొక్కారు. రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, కోదండరామ్‌లు పుస్తక ప్రపం చాన్ని గూర్చి సందేశాలిచ్చారు.
సుమారు 4లక్షల మంది పుస్తక ప్రియులు పాల్గొన్న ఈ పుస్తక ప్రదర్శనను కనీసం 20 రోజులుగా నిర్వహిం చాలని పలువురు కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈ బుక్‌ఫెయిర్‌కు సంపూర్ణ సహకారం లభించిం ది. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో వరల్డ్ బుక్‌ఫెయిర్ నిర్వ హిస్తామని, పుస్తకాలను పాఠకుల దగ్గరకు తీసుకుపోయే ప్రక్రియలో భాగంగా ప్రతి జిల్లాలో ఈ బుక్‌ఫెయిర్‌ను నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వచ్చే ఏడాది పుస్తకాల పండుగ కోసం అందరం ఎదురు చూద్దాం. పుస్తకం వర్థిల్లాలి. జ్ఞాన సమాజం జిందాబాద్.
(వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు)