వర్షం లోటే...
జూలైలో ముఖం చాటేసిన వరుణుడు ∙
చివరిలో కాస్త ఆశాజనకం
అమలాపురం : జూలైలో వరుణుడు ముఖం చాటేశాడు. జిల్లాలో సగటు కన్నా తక్కువ వర్షం కురవడంతో అన్నదాత నిరాశ చెందుతున్నాడు. నెల చివరిలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షం తప్ప చెప్పుకునేంత వర్షం లేదు. జిల్లా వ్యాప్తంగా 239 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 189.5 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. జిల్లావ్యాప్తంగా 20.8 లోటు వర్షం పడింది. మెట్టలోని తుని, కోటనందూరు, జగ్గంపేట, పెద్దాపురం మండలాల్లో మాత్రం సగటు కన్నా ఎక్కువ వర్షం నమోదవగా, మిగిలిన మెట్ట, డెల్టా, ఏజెన్సీ మండలాల్లో తక్కువ వర్షం పడింది. కడియం, తాళ్లరేవు, కె.గంగవరం మండలాల్లో వర్షపు లోటు ఎక్కువగా ఉంది. అయితే వర్షాకాలం ఆరంభమైన తరువాత జూన్ ఒకటి నుంచి ఆగస్టు ఒకటి వరకు కురిసిన వర్షం సగటు కన్నా 24 శాతం అధికంగా ఉండడం విశేషం. జూన్ నెలలో రికార్డు స్థాయిలో వర్షం కురవడం వల్ల అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలు మొఖం చాటేయడం వల్ల ఖరీఫ్ సాగుకు ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా మెట్టలోని ఏలేరు, పంపా, చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు ముందడుగు పడడం లేదు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఖరీఫ్ ప్రశ్నార్ధకంగా మారింది.