జూలై 16 నుంచి పశుగణన
అనంతపురం అగ్రికల్చర్ : జూలై 16 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అఖిల భారత 20వ పశుగణన కార్యక్రమం చేపడుతున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోల్డ్స్మన్ తెలిపారు. సోమవారం స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో డివిజన్ స్థాయి నోడల్ అధికారులతో ఆయన సమావేశమై చర్చించారు. జిల్లాలో ఉన్న పశువులు, గేదెలు, దున్నలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, పందులు, గాడిదలు, గుర్రాలు, కోళ్లు తదితర అన్ని రకాల మూగజీవాలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాల కోసం ఇంటింటా సర్వే జరుగుతుందన్నారు. ఐదు మంది డివిజన్ నోడల్ అధికారులు, 32 మంది ఏరియా నోడల్ అధికారులు, 90 మంది సూపర్వైజర్లు, 225 మంది ఎన్యుమరేటర్లు ఇందులో భాగస్వాములవుతారన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పశుగణన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.