‘ప్రాక్టికల్స్’పై గందరగోళం
♦ నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు
♦ సీనియర్లను వదిలి జూనియర్లకే ఎగ్జామినర్లుగా విధులు
♦ ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తారన్న ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లు గందరగోళంగా మారాయి. 1,322 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3,08,091 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల ప్రాక్టికల్స్‌ను పరిశీలించి మార్కులు వేసే ఎగ్జామినర్ల ఎంపిక అస్తవ్యస్తంగా తయారైంది. లోపాలను సరిదిద్దేందుకు ఈసారి మూడంచెల ఆన్లైన్ పరిశీలన విధానాన్ని అమల్లోకి తె చ్చినా అన్ని స్థాయిల్లో అధికారుల నిర్లక్ష్యం ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది.
సీనియర్ లెక్చరర్లను వదిలేసి జూనియర్లకు ఎగ్జామినర్లుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు అవగాహన లేక ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తారని... విద్యార్థులకు అన్యా యం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన లెక్చరర్లలో చాలామందికి అసలు ప్రాక్టికల్ పరీక్షల డ్యూటీలే వేయకపోవడం గమనార్హం. మొత్తంగా 15వేల మంది ఎగ్జామిన ర్లు, ఇన్విజిలేటర్లను నియమించినా.. అందులో చాలామంది జూనియర్లే ఉన్నారు.
కొత్త విధానం ఎందుకంటే
ప్రాక్టికల్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా, ఎగ్జామినర్లుగా అర్హతలు లేని వారు కూడా వస్తుండడంతో... ఈసారి ఇంటర్ బోర్డు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ఆదేశించింది. కళాశాల ప్రిన్సిపల్ స్థాయిలో, రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్ఐవో) స్థాయి లో, ఇంటర్ బోర్డు స్థాయిలో ఈ పరిశీలన ఉండాలని స్పష్టం చేసింది. కానీ కాలేజీల స్థాయిలో పరిశీలన జరిగినా... తమ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్ల వివరాలు ఎవరెవరికి అప్లోడ్ అయ్యాయన్నది సరిచూసుకోలేదు. మరోవైపు ఆర్ఐవో స్థాయిలోనూ పరిశీలన జరగలేదు.
ఇక ఏ కాలేజీలో ఎంత మంది లెక్చరర్లు ఉన్నారు, ఎంతమందికి ఎగ్జామినర్లుగా డ్యూటీ లు వేశారన్న దానిని బోర్డు పట్టించుకోలేదు. ఫలితంగా వేల మంది సీనియర్ లెక్చరర్ల వివరాలు అప్లోడ్ కాలేదు. దీంతో వారెవరికీ పరీక్షల డ్యూటీల కేటాయింపు జరగలేదు. ప్రైవేటు కాలేజీల్లో జరిగే ప్రాక్టికల్స్‌కు ఎగ్జామినర్లుగా వెళ్లే జూనియర్లను యాజమాన్యాలు మేనేజ్ చేసే అవకాశం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక నల్లగొండ బాలికల జూనియర్ కాలేజీ, ఖిలా వరంగల్, జనగాం, కౌటాల, శంషాబాద్, చేవెళ్ల, కోదాడ, బొమ్మల రామారం... ఇలా చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన లెక్చరర్లకు ఎగ్జామినర్లుగా విధుల కేటాయింపు జరుగలేదు.