junior assistant posts
-
Group 4 Notification: 9,168 కొలువులకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు: గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది. అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే.. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి. -
సింగరేణి సంస్థకు షాకిచ్చిన హైకోర్టు.. ఆ పోస్టుల భర్తీ నిలిపివేయండి!
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్– 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని సంస్థ ఉన్నతాధికారులను హైకోర్టు శనివారం ఆదేశించింది. పరీక్షలో అవకతవకలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లు వాదనకు సరిపడా ఆధారాలు చూపించారని, తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని సింగరేణి రిక్రూట్మెంట్ సెల్‌కు ఆదేశాలు జారీచేసింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌తో సహా 8 జిల్లాలోని 187 కేంద్రాల్లో ఈనెల 4న రాత పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షలు సజావుగానే నిర్వహించామని సింగరేణి, జేఏన్టీయూ అధికారులు చెబుతున్నా.. కొందరు అభ్యర్థులను గోవా తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడ పేపర్ లీకైందని ఆరోపణలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన సింగరేణి, జేఎన్టీయూ అధికారులు హడావిడిగా ఫలితాలు విడుదల చేశారు. 78 వేల మంది పరీక్ష రాయగా, 49 వేల మంది అర్హత సాధించారని పేర్కొంటూ వారి మార్కులు, ర్యాంకులు వెల్లడించారు. అయితే, పరీక్ష రాసిన అభ్యర్థులంతా తమకెన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారని, కానీ సింగరేణి అధికారులు అలా విడుదల చేయలేదని, అందరి మార్కులు వెల్లడించిన తర్వాతే ర్యాంకులు విడుదల చేయాల్సి ఉండగా అర్హత పేరుతో 49 వేల మంది ఫలితాలు మాత్రమే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ పరిశీలించకుండా ఫలితాలు విడుదల చేయడాన్ని హైకోర్టు తప్పపట్టింది. అభ్యర్థుల పేర్లకు బదులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, డిగ్రీ మొదలైన పేర్లతో హాల్‌టికెట్లు ఎలా పంపిణీ చేశారని, పరీక్ష సమయంలో అభ్యర్థి పేరు రాస్తే ఎలా పరిగణనలోకి తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. కాగా, పరీక్షకు 15 రోజుల ముందే సింగరేణిలో కీలకమైన డైరెక్టర్(పా) పోస్టును చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఇచ్చారని, ఐదు నెలల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఆ వ్యక్తికి ఇప్పుడా పదవి కట్టబెట్టడంతో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జూనియర్ అసిస్టెంట్ నియామకాల్లో సింగరేణికి ‘పరీక్ష’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉద్యోగ నియామకాల విషయంలో తరచుగా విమర్శల పాలయ్యే సింగరేణికి మరో విషమ ‘పరీక్ష’ఎదురైంది. ఇటీవల సంస్థ.. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ తేదీ విషయమై డోలాయమానంలో పడినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత సింగరేణి సంస్థ 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 (క్లరికల్) పోస్టుల భర్తీకి జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ముగిసే సరికి రికార్డు స్థాయిలో లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్లోనే సెప్టెంబర్ 4న రాత పరీక్ష నిర్వహిస్తామని సింగరేణి ప్రకటించినా, తేదీ సమీపిస్తున్నప్పటికీ సంస్థ తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది. థర్డ్ పార్టీకి బాధ్యతలు నియామకాల్లో పారదర్శకత పాటించేందుకు సింగరేణి సంస్థ థర్డ్‌పార్టీకి పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తోంది. అందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షల బాధ్యతను జేఎన్టీయూకి అప్పగించాలని నిర్ణయించింది. హాల్‌టికెట్ల జారీ మొదలు, జవాబుపత్రాల మూల్యాంకనం, మెరిట్ జాబితా రూపకల్పన అంశాలన్నీ థర్డ్ పార్టీగా జేఎన్టీయూనే నిర్వర్తించాల్సి ఉంటుంది. ముందస్తు అంచనాల ప్రకారం పరీక్షల నిర్వహణకు రూ.కోటి వరకు చెల్లించాలని సింగరేణి నిర్ణయించింది. అయితే, జేఎన్టీయూ రూ.3 కోట్లు చెల్లించాలని అంటోంది. దీంతో ఫీజు విషయమై ఎటూ తేల్చుకోలేక సింగరేణి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆరోపణలు సింగరేణి ఆధ్వర్యంలో 2015లో చేపట్టిన నియామకాలు సంస్థకు చెడ్డపేరు తెచ్చాయి. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, కొందరు ఉద్యోగార్థులు ముందుగానే ప్రశ్నపత్రాలు సంపాదించి హోటల్ గదుల్లో సిద్ధమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సింగరేణి సంస్థ కూడా దర్యాప్తు చేపట్టింది. ఆ పరీక్షల నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూకే అప్పగించింది. దీంతో అప్పటి నుంచి ఏ పరీక్ష జరిగినా బాధ్యతలను జేఎన్టీయూకు అప్పగించొద్దంటూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక, యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడం ఆనవాయితీగా మారింది. రంగంలోకి దళారులు తాజాగా సింగరేణి నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం.. దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తుదారులకు ఫోన్లుచేసి ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో బేరం మాట్లాడటం మొదలెట్టారు. ఇది బయటపడటంతో సింగరేణి సంస్థ అంతర్గతంగా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను నియమించి విచారణ చేపట్టింది. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగానే అభ్యర్థుల ఫోన్ నంబర్లు బయటకు రావడం, దళారుల నుంచి ఫోన్లు వస్తున్నట్లు తెలియడంతో సింగరేణి అ«ధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో పరీక్షల నిర్వహణ ఫీజు విషయంలో సింగరేణి, జేఎన్టీయూ మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంపై సింగరేణి సంస్థ దృష్టి సారించినట్టు సమాచారం. ఇదీ చదవండి: SCCL Recruitment 2022 Notification: సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ -
ఫైలు కదలాలంటే...పైసలివ్వాల్సిందే!
అటెండర్ల పదోన్నతి ఫైళ్లకే పరిమితం జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం 12 మంది ఎదురుచూపులు ఏడాదిన్నర కాలంగా కలెక్టరేట్లో పెండింగ్ సాక్షి, మచిలీపట్నం : రెవెన్యూ శాఖలో బండ చాకిరీ చేసే అటెండర్ల ప్రమోషన్ల ఫైలుకు నెలల తరబడి గ్రహణం వీడటంలేదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా 12 మంది అటెండర్లు పదోన్నతుల కోసం పడిగాపులు పడుతున్నారు. దిగువ స్థాయి ఉద్యోగులు కావడంతో వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫైలు సిద్ధం.. అమలు తాత్సారం జిల్లాలోని రెవెన్యూ శాఖలో ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగిన 12 మంది అటెండర్లకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. దాదాపు 18 నెలల క్రితమే వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సిద్ధం చేసిన ఫైలు అనేక కారణాలతో కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ఒక్కొక్కరు ఏడాదికి సుమారు లక్ష రూపాయల విలువైన ప్రయోజనాలతో పాటు సీనియారిటీని కూడా నష్టపోయారు. అటెండర్లకు పదోన్నతి ఇస్తే వారికి రెండు ఇంక్రిమెంట్లు కలిపి, జీతం పెంచుతారు. ఆ లెక్కన వారికి ఏడాదికి రూ.80 వేల నుంచి లక్ష వరకు అదనంగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. ఇదేమీ ఆలోచించని కొందరు ఉన్నత ఉద్యోగులు ‘సొంత అజెండా’తోనే వారి ఫైలు కదపకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు సమాచారం. తమ గోడు వినే నాథుడు లేకపోవడంతో అటెండర్లు ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక అధికారికి ఆగ్రహం వచ్చింది.. మరో అధికారి ‘అనుగ్రహం’ లేదు.. అటెండర్ల ఫైలు నెలల తరబడి కదలకపోవడం ఏమిటని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటెండర్లపై ఒక అధికారికి ఆగ్రహం వచ్చిందని, మరో అధికారి అనుగ్రహం లేదని కలెక్టరేట్ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక అధికారి తన ఇంట్లో వివాహానికి సంబంధించి ఇద్దరు అటెండర్లు శుభలేఖలు సరిగ్గా పంచలేదని ఆగ్రహించి మొత్తం అటెండర్ల ప్రమోషన్ ఫైలును తొక్కిపెట్టినట్టు సమాచారం. ఆ అధికారి ఉన్నంత కాలం అటెండర్ల ప్రమోషన్ ఫైలు వెలుగు చూడలేదు. ఆ అధికారి బదిలీ కావడంతో ఇప్పుడైనా తమకు ప్రమోషన్ ఇచ్చేలా ఫైలు కదులుతుందని భావించిన అటెండర్ల ఆశలు ఆవిరయ్యాయి. ఆగ్రహించిన అధికారి లేకున్నా సంబంధిత సెక్షన్ అధికారి ‘అనుగ్రహం’ కొరవడిందని అంటున్నారు. పైసలిస్తేనే పదోన్నతుల ఫైలు కదులుతుందన్న ప్రతిపాదన కొత్తగా తెరమీదకు వచ్చింది. అధికారులకు ఊడిగం చేసే తమకే ఇటువంటి దుస్థితి రావడంతో అటెండర్లు ఎవరికీ చెప్పుకోలేక మూగవేదన అనుభవిస్తున్నారు. ఒకే సెక్షన్లో మూడు కీలక బాధ్యతలు ఆయనవే.. కలెక్టరేట్ కాంపౌండ్‌లోని ఒక సెక్షన్లో అటెండర్ల ఫైలు మగ్గిపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఎనిమిదేళ్లుగా కలెక్టరేట్లో చక్రం తిప్పుతున్నారు. కలెక్టరేట్లోని ఒక కీలక సెక్షన్లో ఒక సీటు చూడాల్సిన ఆయన ఏకంగా మూడు సీట్లు (బాధ్యతలు) చక్కబెడుతున్నారు. ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు వంటి కీలకమైన ఫైళ్లు ఆయన చేతుల మీదుగానే కదలాలి. దీనికితోడు ఆయన దాదాపు పన్నెండేళ్లుగా ఈ జిల్లాలోనే పనిచేస్తుండటంతో దిగువస్థాయి ఉద్యోగులు ఆయన కనుసన్నల్లోనే పనిచేయాల్సిన దుస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో అటెండర్ల ప్రమోషన్ ఫైలు కదలకపోవడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌కు అటెండర్ల విన్నపం ఏడాదిన్నర కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అటెండర్లు ఇప్పటికీ తమ ఫైలు కదలకపోవడంతో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నెలల తరబడి తమకు పదోన్నతులు ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో నష్టపోతున్నామని కలెక్టర్‌కు వారు విన్నవించుకున్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్థాయిలో స్పందించినా వీఆర్వో, వీఆర్ఏల నియామకాలు పూర్తయ్యాకే చూద్దామంటూ దిగువ స్థాయి అధికారులు మరో మెలిక పెట్టడం కొసమెరుపు. -
కోర్టు కొలువుల పేరుతో కుచ్చుటోపీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడు నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టాడు. సుమారు 25 మంది నుంచి భారీగా డబ్బు వసూలు చేసి నకిలీ జాయినింగ్ ఆర్డర్ కాపీలిచ్చి పరారయ్యాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2010లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా, 2011లో ఫలితాలు వెలువడ్డాయి. ఈ సమయలో ఉత్తీర్ణత కాని అభ్యర్థుల జాబితాను తీసుకున్న ఓ వ్యక్తి 25 మందికి ఉద్యోగం ఇప్పించేందుకు రూ. 50 వేలకు బేరం కుదుర్చుకొని ముందస్తుగా రూ. 25 వేల చొప్పున వసూలు చేశాడు. ఇందులో 15 మంది గురువారం పురానీహవేళీలోని ట్రిబ్యూనల్ కోర్టులో ఉద్యోగంలో చేరేందుకై జాయినింగ్ ఆర్డర్ కాపీతో వచ్చారు. ఈ ఆర్డర్ కాపీలను గమనించిన కోర్టు రిజిస్ట్రార్ చలపతి రావు నకిలీవని గుర్తించి డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.