ఫైలు కదలాలంటే...పైసలివ్వాల్సిందే! | Junior Assistant posts | Sakshi
Sakshi News home page

ఫైలు కదలాలంటే...పైసలివ్వాల్సిందే!

Published Tue, Feb 11 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

ఫైలు కదలాలంటే...పైసలివ్వాల్సిందే!

ఫైలు కదలాలంటే...పైసలివ్వాల్సిందే!

  • అటెండర్ల పదోన్నతి ఫైళ్లకే పరిమితం
  •  జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం 12 మంది ఎదురుచూపులు
  •  ఏడాదిన్నర కాలంగా కలెక్టరేట్‌లో పెండింగ్
  •  సాక్షి, మచిలీపట్నం :  రెవెన్యూ శాఖలో బండ చాకిరీ చేసే అటెండర్ల ప్రమోషన్‌ల ఫైలుకు నెలల తరబడి గ్రహణం వీడటంలేదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా 12 మంది అటెండర్లు పదోన్నతుల కోసం పడిగాపులు పడుతున్నారు. దిగువ స్థాయి ఉద్యోగులు కావడంతో వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

     ఫైలు సిద్ధం.. అమలు తాత్సారం

    జిల్లాలోని రెవెన్యూ శాఖలో ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగిన 12 మంది అటెండర్లకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. దాదాపు 18 నెలల క్రితమే వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సిద్ధం చేసిన ఫైలు అనేక కారణాలతో కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ఒక్కొక్కరు ఏడాదికి సుమారు లక్ష రూపాయల విలువైన ప్రయోజనాలతో పాటు సీనియారిటీని కూడా నష్టపోయారు. అటెండర్లకు పదోన్నతి ఇస్తే వారికి రెండు ఇంక్రిమెంట్లు కలిపి, జీతం పెంచుతారు. ఆ లెక్కన వారికి ఏడాదికి రూ.80 వేల నుంచి లక్ష వరకు అదనంగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. ఇదేమీ ఆలోచించని కొందరు ఉన్నత ఉద్యోగులు ‘సొంత అజెండా’తోనే వారి ఫైలు కదపకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు సమాచారం. తమ గోడు వినే నాథుడు లేకపోవడంతో అటెండర్లు ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు.  
     
    ఒక అధికారికి ఆగ్రహం వచ్చింది.. మరో అధికారి ‘అనుగ్రహం’ లేదు..

    అటెండర్ల ఫైలు నెలల తరబడి కదలకపోవడం ఏమిటని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటెండర్లపై ఒక అధికారికి ఆగ్రహం వచ్చిందని, మరో అధికారి అనుగ్రహం లేదని కలెక్టరేట్ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక అధికారి తన ఇంట్లో వివాహానికి సంబంధించి ఇద్దరు అటెండర్లు శుభలేఖలు సరిగ్గా పంచలేదని ఆగ్రహించి మొత్తం అటెండర్ల ప్రమోషన్ ఫైలును తొక్కిపెట్టినట్టు సమాచారం. ఆ అధికారి ఉన్నంత కాలం అటెండర్ల ప్రమోషన్ ఫైలు వెలుగు చూడలేదు. ఆ అధికారి బదిలీ కావడంతో ఇప్పుడైనా తమకు ప్రమోషన్ ఇచ్చేలా ఫైలు కదులుతుందని భావించిన అటెండర్ల ఆశలు ఆవిరయ్యాయి. ఆగ్రహించిన అధికారి లేకున్నా సంబంధిత సెక్షన్ అధికారి ‘అనుగ్రహం’ కొరవడిందని అంటున్నారు. పైసలిస్తేనే పదోన్నతుల ఫైలు కదులుతుందన్న ప్రతిపాదన కొత్తగా తెరమీదకు వచ్చింది. అధికారులకు ఊడిగం చేసే తమకే ఇటువంటి దుస్థితి రావడంతో అటెండర్లు ఎవరికీ చెప్పుకోలేక మూగవేదన అనుభవిస్తున్నారు.
     
    ఒకే సెక్షన్‌లో మూడు కీలక బాధ్యతలు ఆయనవే..
     
    కలెక్టరేట్ కాంపౌండ్‌లోని ఒక సెక్షన్‌లో అటెండర్ల ఫైలు మగ్గిపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఎనిమిదేళ్లుగా కలెక్టరేట్‌లో చక్రం తిప్పుతున్నారు. కలెక్టరేట్‌లోని ఒక కీలక సెక్షన్‌లో ఒక సీటు చూడాల్సిన ఆయన ఏకంగా మూడు సీట్లు (బాధ్యతలు) చక్కబెడుతున్నారు. ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు వంటి కీలకమైన ఫైళ్లు ఆయన చేతుల మీదుగానే కదలాలి. దీనికితోడు ఆయన దాదాపు పన్నెండేళ్లుగా ఈ జిల్లాలోనే పనిచేస్తుండటంతో దిగువస్థాయి ఉద్యోగులు ఆయన కనుసన్నల్లోనే పనిచేయాల్సిన దుస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో అటెండర్ల ప్రమోషన్ ఫైలు కదలకపోవడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తున్నారు.
     
    కలెక్టర్‌కు అటెండర్ల విన్నపం
     
    ఏడాదిన్నర కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అటెండర్లు ఇప్పటికీ తమ ఫైలు కదలకపోవడంతో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నెలల తరబడి తమకు పదోన్నతులు ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో నష్టపోతున్నామని కలెక్టర్‌కు వారు విన్నవించుకున్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్థాయిలో స్పందించినా వీఆర్వో, వీఆర్‌ఏల నియామకాలు పూర్తయ్యాకే చూద్దామంటూ దిగువ స్థాయి అధికారులు మరో మెలిక పెట్టడం కొసమెరుపు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement