Jurala projects
-
పహారాలోనే ప్రాజెక్టులు
ధరూరు(గద్వాల)/ అమరచింత (వనపర్తి)/ దోమలపెంట (అచ్చంపేట)/నాగార్జునసాగర్ / హుజూర్నగర్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జల వివాదాల నేపథ్యంలో అన్ని ప్రాజెక్టుల వద్ద శనివారం భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఎగువన జూరాల నుంచి దిగువన పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. టీఎస్జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రం వద్ద నాగర్‌కర్నూల్ ఎస్పీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో పోలీసుల పహారా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. జూరాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం నిలిచిపోవడం, శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండటంతో నీటిమట్టం తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ జలాశయంలో నీటిమట్టం 821 అడుగులుండగా, శనివారం సాయంత్రం 819.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ 40.4514 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ 13.306 మిలియన్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. రేగుమాగడి గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకి నీటి విడుదల జరగలేదు. అలాగే జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న జెన్ కో జల విద్యుత్ కేంద్రం వద్ద ప్రధాన గేటును మూసివేశారు. ఈ ప్రాజెక్టుపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. సాగర్‌లో విద్యుదుత్పాదనకు 30,918 క్యూసెక్కులు అలాగే సాగర్ ప్రాజెక్ట్ వద్ద నల్లగొండ ఎస్పీ రంగనాథ్ పోలీస్ బందోబస్తును పరిశీలించారు. మెయిన్ పవర్హౌజ్కు వెళ్లే రోడ్డు దారిని పూర్తిగా మూసివేశారు. కేవలం అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందిని మాత్రమే గుర్తింపు కార్డులను చూసి ఆ మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 533.80 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జలాశయానికి 27,587 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా 32,212 క్యూసెక్కులు విడుదలయ్యింది. విద్యుదుత్పాదనకు 30,918 క్యూసెక్కులు వినియోగించారు. ‘పులిచింతల’లో 30 మెగావాట్లు.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని వజినేపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్ పవర్‌హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పవర్‌హౌజ్, డ్యామ్, పరిసర ప్రాంతంలో సాయుధ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. టీఎస్ జెన్ కోలో జల విద్యుత్ ఉత్పత్తి శనివారం కూడా కొనసాగింది. ఎగువనున్న నాగార్జునసాగర్ నుంచి 39 వేల క్యూసెక్కుల నీరు ఇ ఫ్లోగా వచ్చి ప్రాజెక్ట్‌లో చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల నీటితో పవర్ హౌస్‌లోని 2 యూనిట్లను రన్ చేస్తూ 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.06 టీఎంసీల నీరు ఉంది. -
జూరాలకు పాలమూరు నీళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలకు నీటి లభ్యత పెంచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది. కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు రెండు సీజన్లలోనూ సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి వచ్చే నీటితో కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్లను నింపుతూనే జూరాల వరకు నీటిని తరలించే ప్రణాళిక రచిస్తోంది. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంజనీర్లు ఆ పనిలో పడ్డారు. ఈ ప్రతిపాదనపై జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడాదంతా నీటి లభ్యత జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, నికర నిల్వ సామర్థ్యం 6.80 టీఎంసీలు మాత్రమే. దీనికింద 1.02 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుపై ఆధారపడి నెట్టెంపాడు (21.42 టీఎంసీ), భీమా (20 టీఎంసీ), కోయిల్ సాగర్ (3.9 టీఎంసీ) ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. అన్ని ప్రాజెక్టుల కింద కలిపి 5.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. జూరాలకు వరద ఉండే రోజు ల్లోనే నీటిని ఎత్తిపోసే వీలుంది. దీనికి తోడు వరద నీటికి ఎగువ నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాల్సి ఉంటోంది. ఒక సీజన్లో మాత్రమే జూరాలలో నీటి లభ్యత ఉంటుండగా, రెండో సీజన్‌కి కనీసం తాగునీటి అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. దీంతో జూరాలకు నీటి లభ్యతను పెంచేందుకు వీలుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కర్వెన రిజర్వాయర్‌కు తరలించే నీటిని జూరాలకు తరలించాలని సీఎం ఇటీవల ఇంజనీర్లను ఆదేశించారు. కర్వెన రిజర్వాయర్ నుంచి ప్రత్యేక కెనాల్స్‌ను ఏర్పాటు చేసి నీటిని నారాయణపేట్ నియోజకవర్గానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నారాయణపేట వరకు ఏర్పాటు చేసిన కెనాల్ ద్వారా కోయిలకొండ మండల సమీపంలో ఉన్న పెద్దవాగు నుంచి కోయిల్‌సాగర్‌ను నింపా లని ప్రతిపాదించారు. నారాయణపేట జాయమ్మ చెరువు నుంచి ఉట్కూర్ మీదుగా సంగంబండ రిజర్వాయర్ వరకు పాలమూరు ఎత్తిపోతల పథకం జలాలు తరలించి, అటు నుంచి జూరాలకు నీటిని తరలించాలన్నది ప్రస్తుత ప్రతిపాదనగా ఉంది. ఈ ప్రతిపాదనలపై ఇంజనీర్లు కసరత్తు మొదలు పెట్టారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే జూరాలకు ఏడాదంతా నీటి లభ్యత ఉండనుంది. అనుసంధానంపై మంత్రుల సమీక్ష పూర్వ పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పాలమూరు–రంగారెడ్డి నీళ్లు జూరాలకు తరలింపు, కొత్త ఎత్తిపోతల పథకాలపై శనివారం మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు హరితప్లాజాలో ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్ రెడ్డి, అంజయ్య యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, ఈఎన్సీ మురళీధర్, సీఈలు ఖగేందర్, రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భం గా గత వేసవిలో జూరాల కింద తాగునీటి అవసరాలకు కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి నీటిని తీసుకో వాల్సి వచ్చిందని, భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా కర్వెన రిజర్వాయర్ నుండి సంగంబండ, సంగంబండ నుండి జూరాల రిజర్వాయర్‌కు నీటిని నింపేలా ప్రతిపాదనలు వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
గద్వాల : జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి నాలుగు జిల్లాల్లో దాదాపు 20లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టనున్న రెండు కొత్త ప్రాజెక్టుల సర్వేలను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు సోమవారం నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు సంబంధిత సర్వే సంస్థలతో ఒప్పందాలు ఖరారు చేశారు. మూడు నెలల్లోగా రెండు కొత్త ప్రాజెక్టుల సమగ్ర సర్వేలను పూర్తిచేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి కీలకంగా భావిస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వేను చేపట్టేందుకు రూ. 49లక్షలు అవసరమని జూరాల అధికారులు ఈఎన్సీ కార్యాలయంలో నివేదిక సమర్పించారు. ఇలా మూడు ప్రాజెక్టులకు సంబంధించిన సర్వేల నిర్ణయాలు హైదరాబాద్‌లో జరిగిపోయాయి. జూరా ల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి మూడు జిల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రతిపాదించిన పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వేను రూ.5.71కోట్లతో చేపట్టేందుకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలే జ్ ఆఫ్ ఇండియా సంస్థ మూడు నెలల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు సర్వే సంస్థ మధ్య ఒప్పందాలు కుదిరాయి. అలాగే జూరాల రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా మరో మూడు జిల్లాల పరిధిలో 10లక్షల ఎకరాలకు ఆయకట్టు నీటిని అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన జూరాల-పాకాల ప్రాజెక్టు సర్వేను 3కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వరంగ సర్వే సంస్థవాట్కాస్ చేపట్టనుంది. ఈ మేరకు నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు, వాట్కాస్సంస్థ అధికారులు ఒప్పందం ఖరారు చేసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల సర్వేలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించా రు. జూరాల అధికారులు సమర్పించిన తుమ్మిళ్ల సర్వే నివేదిక మేరకు ప్రభుత్వం రూ.49లక్షలను విడుదల చేస్తే త్వరలోనే ఇందుకు సంబంధించిన సర్వే పనులను మరో సంస్థకు అప్పగించనున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం... పాలమూరు ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 8న 6.91కోట్లకు మంజూరు ఇచ్చింది. ఈ పథకం సర్వే చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ ఇప్పటికే జూరాల అధికారులు టెండర్లు పిలిచారు. ఈ సర్వే పనులను ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు జూరాల ఇంజనీర్లే ప్రాథమికం గా సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ దశలో సీఎం కేసీఆర్ సమీక్ష చేసి తక్షణం సర్వే చేపట్టాలని, అవసరమైన నిధులను విడుదల చేస్తామని ఆదేశించడంతో ఇక పనులు వేగవంతం కానున్నాయి. దాదాపు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో ఐదుచోట్ల లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో డిజైన్ రూపొందిస్తున్నారు. జూరాల - పాకాల ప్రాజెక్టు... కృష్ణానది నీటిని మళ్లించి మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో గ్రావిటీ ఫ్లో ద్వారా 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా డిజైన్ రూపొందించారు. గత నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి అధికారులకు ఆదేశాలివ్వడంతో డిజైన్‌లో కొంత మార్పులు చేసి ప్రాథమిక సర్వేను సిద్ధం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌లో 312 మీటర్ల ఎత్తు నుంచి నీటిని వరంగల్ జిల్లా పాకాల వద్ద 262 మీటర్ల డౌన్ వరకు తరలించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. జూరాల ప్రాజెక్టు నుంచి పాకాల వరకు మొత్తం 410 కిలోమీటర్ల పొడవునా ప్రధాన కాలువను నిర్మించాల్సి ఉంటుంది. మూడు జిల్లాల్లో 617 చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతో పాటు పది లక్షల ఎకరాలకు కృష్ణానది జలాలను ఈప్రాజెక్టు ఆయకట్టు భూములకు అందిస్తుంది. సాగునీటితో పాటు మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో తాగునీటి అవసరాలకు ఈ రెండు భారీ సాగునీటి ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు తుమ్మిళ్ల... ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో మూడు దశాబ్దాలుగా సాగునీరెరగని మానవపాడు, అలంపూర్, వడ్డేపల్లి మండలాల పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీళ్లం దించేందుకు తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతలను అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో సర్వే చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఇందుకుగాను జూరాల అధికారులు సర్వేకు అవసరమైన నిధుల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. సమగ్ర సర్వే (డీపీఆర్) చేసేం దుకు రూ.49లక్షలు అవసరమని పేర్కొన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా కనీసం 10 టీఎంసీల నీటిని ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో అందేలా ఈ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించేందుకు అధికారులు నిర్ణయించారు.