జూరాల ప్రాజెక్టు ముఖ ద్వారం వద్ద పోలీసుల బందోబస్తు
ధరూరు(గద్వాల)/ అమరచింత (వనపర్తి)/ దోమలపెంట (అచ్చంపేట)/నాగార్జునసాగర్ / హుజూర్‌నగర్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జల వివాదాల నేపథ్యంలో అన్ని ప్రాజెక్టుల వద్ద శనివారం భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఎగువన జూరాల నుంచి దిగువన పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. టీఎస్‌జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రం వద్ద నాగర్‌కర్నూల్ ఎస్పీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో పోలీసుల పహారా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. జూరాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం నిలిచిపోవడం, శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండటంతో నీటిమట్టం తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ జలాశయంలో నీటిమట్టం 821 అడుగులుండగా, శనివారం సాయంత్రం 819.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ 40.4514 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ 13.306 మిలియన్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. రేగుమాగడి గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకి నీటి విడుదల జరగలేదు. అలాగే జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న జెన్ కో జల విద్యుత్ కేంద్రం వద్ద ప్రధాన గేటును మూసివేశారు. ఈ ప్రాజెక్టుపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు.
సాగర్‌లో విద్యుదుత్పాదనకు 30,918 క్యూసెక్కులు
అలాగే సాగర్ ప్రాజెక్ట్ వద్ద నల్లగొండ ఎస్పీ రంగనాథ్ పోలీస్ బందోబస్తును పరిశీలించారు. మెయిన్ పవర్‌హౌజ్‌కు వెళ్లే రోడ్డు దారిని పూర్తిగా మూసివేశారు. కేవలం అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందిని మాత్రమే గుర్తింపు కార్డులను చూసి ఆ మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 533.80 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జలాశయానికి 27,587 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా 32,212 క్యూసెక్కులు విడుదలయ్యింది. విద్యుదుత్పాదనకు 30,918 క్యూసెక్కులు వినియోగించారు.
‘పులిచింతల’లో 30 మెగావాట్లు..
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని వజినేపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్ పవర్‌హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పవర్‌హౌజ్, డ్యామ్, పరిసర ప్రాంతంలో సాయుధ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. టీఎస్ జెన్ కోలో జల విద్యుత్ ఉత్పత్తి శనివారం కూడా కొనసాగింది. ఎగువనున్న నాగార్జునసాగర్ నుంచి 39 వేల క్యూసెక్కుల నీరు ఇ ఫ్లోగా వచ్చి ప్రాజెక్ట్‌లో చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల నీటితో పవర్ హౌస్‌లోని 2 యూనిట్లను రన్ చేస్తూ 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.06 టీఎంసీల నీరు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment