పాన్–ఆధార్‌పై ‘సుప్రీం’ అసంతృప్తి
న్యూఢిల్లీ: పాన్ కార్డు పొందాలంటే ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా జత చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుపట్టింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును ఐచ్ఛికంగానే ఉపయోగించాలని గతంలోనే తాము సూచించినప్పటికీ, తప్పనిసరి చేయడంపై జస్టిస్ ఏకే శిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరుఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ బదులిస్తూ... నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి కొందరు ఒకటి కంటే ఎక్కవ పాన్ కార్డులు పొందుతున్నారని, తద్వారా నిధులను దారి మళ్లిస్తున్నారని చెప్పారు. దాన్ని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్పందించిన ధర్మాసనం... ‘దాన్ని నియంత్రించడానికి ఇదొక్కటే మార్గమా? గతంలో కోర్టు వద్దని ఆదేశించినా ఆధార్‌ను తప్పనిసరి ఎందుకు చేస్తున్నారు?’అంటూ ఏజీని ప్రశ్నించింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏను ఆర్థిక చట్టం 2017లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు, పాన్ కార్డు పొందేందుకు ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా జతచేయాలి. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ సెక్షన్‌కున్న చట్టబద్దతను పిటిషనర్ తరుఫు న్యాయవాది అరవింద్ దతార్ సవాలు చేశారు. ఆధార్ లేకపోతే ఇక పాన్ కార్డు పొందలేరని, ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతుందని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
ధ్వంసమైన ప్రార్థనా స్థలాలకు ప్రభుత్వ నిధులా!
శాంతి, భద్రతల పరిరక్షణలో వైఫల్యం కారణంగా దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించాలని కోర్టులు ఆదేశించొచ్చా అన్న అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ విషయంలో మత ప్రమేయంలేని తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోర్టు ఆదేశించింది.
గోద్రా అల్లర్ల తర్వాత ధ్వంసమైన 500కు పైగా మసీదులకు నష్టపరిహారం ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. చట్ట ప్రకారం హైకోర్టు ఆదేశాలను అమలుచేయడం సాధ్యం కాదని, వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం వాదించింది. నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.
వితంతువులపై ఇంత నిర్లక్ష్యమా?
దేశంలోని వితంతువుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుప్రీం కోర్టు మండిపడింది. ‘ఈ విషయంలో మేం ఏవైనా ఆదేశాలిస్తే.. కోర్టులు ప్రభుత్వాన్ని నడిపేందుకు యత్నిస్తున్నాయి అని అంటారు. మీరు మాత్రం (ప్రభుత్వం) ఏమీ చేయరు. వితుంతుల సంరక్షణ కోసం ఏ చర్యలూ తీసుకోలేదు. అని శుక్రవారం ధ్వజమెత్తింది. దిక్కులేని వితంతువులను ఆదుకోవడానికి మార్గదర్శకాలతో రానందుకు ప్రభుత్వానికి రూ. లక్ష జరిమానా కూడా విధించింది.