‘ఎక్స్ కేడర్’పై మా ఆదేశాలు ఎందుకు ఉల్లంఘించారు?
సీఎస్ మహంతికి హైకోర్టు సూటి ప్రశ్న
హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్స్ కేడర్ స్థాయి పోస్టులను నిబంధనలకు మించి సృష్టించవద్దన్న తమ ఆదేశాలను ఉల్లంఘించాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎస్ మహంతిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మంగళవారం స్వయంగా కోర్టుకు హాజరుకావాలని మహంతిని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ మాజీ ప్రత్యేక కార్యదర్శి షఫీకుజ్జమాన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ వ్యవహార శైలి సంతృప్తికరంగా లేదని మండిపడింది.
కాగా, రాష్ట్రంలోని ఎక్స్ కేడర్ పోస్టులను నిబంధనలకు మించి సృష్టించవద్దని ప్రభుత్వానికి హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నిర్దేశిత సంఖ్య కన్నా సీఎస్ స్థాయిలో ఎక్స్‌కేడర్ పోస్టులు సృష్టించారని, ఇది కోర్టు ధిక్కారమవుతుందని, ఎన్.రమేష్‌కుమార్ అనే అధికారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చారని ఇది కూడా కోర్టు ఆదేశాలకు విరుద్ధమని షఫీకుజ్జమాన్ తన పిటిషన్లో పేర్కొన్నారు.