Justice Raja Ilango
-
జస్టిస్ రాజా ఇలంగో పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం పదవీ విరమణ చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. న్యాయవ్యవస్థకు జస్టిస్ ఇలంగో అందించిన సేవలను ఉభయ రాష్ట్రాల అడ్వకేట్ జనరళ్లు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్ కొనియాడారు. జస్టిస్ ఇలంగోతో తనకున్న అనుబంధాన్ని ఏసీజే గుర్తు చేసుకున్నారు. ‘‘కేసులను అత్యంత వేగంగా పరిష్కరించారాయన. 37 వేలకు పైగా ప్రధాన వ్యాజ్యాలను, 21 వేలకు పైగా అనుబంధ వ్యాజ్యాలను పరిష్కరించారు’’ అంటూ కొనియాడారు. ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జస్టిస్ ఇలంగో కృతజ్ఞతలు తెలియచేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తినైనా ఇక్కడ పని చేసిన ఏ రోజూ తనకు పరాయి వాడినన్న భావన కలగలేదన్నారు. ప్రజలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తనపై ఎంతో ప్రేమ చూపారన్నారు. తన కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఇలంగో పాల్గొన్నారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ, పాశం సుజాత, కె.జ్యోతిప్రసాద్, బాచిన హనుమం తరావు, పలువురు కార్యవర్గ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. -
కామాంధుడు ‘మధు’కు చుక్కెదురు
బెయిల్ మంజూరుకు హైకోర్టు తిరస్కృతి పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: విద్య, ఉపాధి అవకాశాల ఆశ చూపి 300 మందికి పైగా అమాయక యువతుల జీవితాలతో ఆడుకున్న కామాంధుడు కలకండ మధు అలియాస్ శ్రీనివాస్ అలియాస్ రవికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో మధుకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరిస్తూ, అతని పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వ్యక్తులు జైల్లో ఉంటేనే మంచిదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కోర్టు ముందు కొత్త విషయాలు.. ఏపీపీ డి.రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, మధుకు సంబంధించి పలు కొత్త విషయాలను కోర్టు ముందుంచారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)లో పనిచేసే సమయంలో కూడా మధు ఎప్పుడూ ఇంటర్నెట్ నుంచి విద్యార్థినుల ఫొటోలను, వారి ప్రొఫైళ్లను, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేస్తూ ఉండే వాడని తెలిపారు. అప్పుడు నాలుగు సెల్ఫోన్లను వాడుతూ, తన రూమ్‌లో రహస్యంగా మాట్లాడుతూ ఉండేవాడని వివరించారు. సభ్య సమాజం తలదించుకునేలా మధు వ్యవహరించాడని, ఏకంగా 5 వేల మంది విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని వివరించారు. మధు నాగోల్‌లో ఉన్న ఇంటి నుంచి పోలీసులు 19 సెల్ఫోన్లు, 500 గ్రీటింగ్ కార్డులు, గర్భనిరోధక మాత్రలు స్వాధీనం చేసుకున్నారన్నారు. అంతేకాక అతని గదుల్లో ఉన్న పుస్తకాల నిండా యువతుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు వాటి పక్కన అతను రాసి ఉంచిన కామ వాంఛలే ఉన్నాయన్నారు. వీటిని బట్టి అతని ప్రవర్తన ఎలాంటిదో స్పష్టమవుతుందన్నారు. మరో నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న మధుకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. జైలు నుంచి బయటకు వస్తే మళ్లీ పాత నేరాలను కొనసాగించే అవకాశం ఉందని ఏపీపీ వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ ఇలంగో, బెయిల్ కోసం మధు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్యామల, రమేశ్‌లకు హైకోర్టులో చుక్కెదురు
ప్రత్యూషపై చిత్రహింస కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన ఆమె సవతి తల్లి చిప్పా చాముండేశ్వరి అలియాస్ శ్యామల, తండ్రి రమేశ్‌లకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రత్యూషను తీవ్ర హింసకు గురిచేసిన కేసులో వారికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న వారు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్‌ను కిందిస్థాయి కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్యామల, రమేశ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు.