కామాంధుడు ‘మధు’కు చుక్కెదురు | Shock to madhu | Sakshi
Sakshi News home page

కామాంధుడు ‘మధు’కు చుక్కెదురు

Published Wed, Nov 25 2015 3:17 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

కామాంధుడు ‘మధు’కు చుక్కెదురు - Sakshi

కామాంధుడు ‘మధు’కు చుక్కెదురు

బెయిల్ మంజూరుకు హైకోర్టు తిరస్కృతి 
పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు

 
 సాక్షి, హైదరాబాద్: విద్య, ఉపాధి అవకాశాల ఆశ చూపి 300 మందికి పైగా అమాయక యువతుల జీవితాలతో ఆడుకున్న కామాంధుడు కలకండ మధు అలియాస్ శ్రీనివాస్ అలియాస్ రవికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో మధుకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరిస్తూ, అతని పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వ్యక్తులు జైల్లో ఉంటేనే మంచిదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.

 కోర్టు ముందు కొత్త విషయాలు..
 ఏపీపీ డి.రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, మధుకు సంబంధించి పలు కొత్త విషయాలను కోర్టు ముందుంచారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)లో పనిచేసే సమయంలో కూడా మధు ఎప్పుడూ ఇంటర్‌నెట్ నుంచి విద్యార్థినుల ఫొటోలను, వారి ప్రొఫైళ్లను, హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేస్తూ ఉండే వాడని తెలిపారు. అప్పుడు నాలుగు సెల్‌ఫోన్‌లను వాడుతూ, తన రూమ్‌లో రహస్యంగా మాట్లాడుతూ ఉండేవాడని వివరించారు. సభ్య సమాజం తలదించుకునేలా మధు వ్యవహరించాడని, ఏకంగా 5 వేల మంది విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని వివరించారు.

మధు నాగోల్‌లో ఉన్న ఇంటి నుంచి పోలీసులు 19 సెల్‌ఫోన్లు, 500 గ్రీటింగ్ కార్డులు, గర్భనిరోధక మాత్రలు స్వాధీనం చేసుకున్నారన్నారు. అంతేకాక అతని గదుల్లో ఉన్న పుస్తకాల నిండా యువతుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు వాటి పక్కన అతను రాసి ఉంచిన కామ వాంఛలే ఉన్నాయన్నారు. వీటిని బట్టి అతని ప్రవర్తన ఎలాంటిదో స్పష్టమవుతుందన్నారు. మరో నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న మధుకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. జైలు నుంచి బయటకు వస్తే మళ్లీ పాత నేరాలను కొనసాగించే అవకాశం ఉందని ఏపీపీ వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ ఇలంగో, బెయిల్ కోసం మధు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement