
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం పదవీ విరమణ చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. న్యాయవ్యవస్థకు జస్టిస్ ఇలంగో అందించిన సేవలను ఉభయ రాష్ట్రాల అడ్వకేట్ జనరళ్లు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్ కొనియాడారు. జస్టిస్ ఇలంగోతో తనకున్న అనుబంధాన్ని ఏసీజే గుర్తు చేసుకున్నారు. ‘‘కేసులను అత్యంత వేగంగా పరిష్కరించారాయన. 37 వేలకు పైగా ప్రధాన వ్యాజ్యాలను, 21 వేలకు పైగా అనుబంధ వ్యాజ్యాలను పరిష్కరించారు’’ అంటూ కొనియాడారు.
ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జస్టిస్ ఇలంగో కృతజ్ఞతలు తెలియచేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తినైనా ఇక్కడ పని చేసిన ఏ రోజూ తనకు పరాయి వాడినన్న భావన కలగలేదన్నారు. ప్రజలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు తనపై ఎంతో ప్రేమ చూపారన్నారు. తన కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఇలంగో పాల్గొన్నారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ, పాశం సుజాత, కె.జ్యోతిప్రసాద్, బాచిన హనుమం తరావు, పలువురు కార్యవర్గ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.