నేరాలు..శిక్షలపై అవగాహన అవసరం
♦ జస్టిస్ రజని డ్రంకన్ డ్రైవ్ నిరోధానికి
♦ ప్రత్యేక వాహనం ప్రారంభం
కలెక్టరేట్: నేరం చేసిన వారికి ఆ నేరం వల్ల జరిగే అనర్ధాలను, నష్టాలను ముందుగానే తెలియజేయడం ద్వారా మరెవరైనా అలాంటి నేరాలు చేయకుండా చూడవచ్చని హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి పి.రజిని అన్నారు. శనివారం నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని జస్టిస్ రజని, ైెహ దరాబాద్ సిటీ పోలీస్ కమిషన్ మహేందర్‌రెడ్డిలు ప్రారంభించారు.
అనంతరం రజని మాట్లాడుతూ నేరాలు చేసినవారికి ఎంత పెద్ద శిక్షను విధించినా నేరాల సంఖ్య తగ్గడం లేదన్నారు. అందుకే ముందుగానే శిక్షలపై అవగాహన కల్పించడం వల్ల వారు నేరాలకు పాల్పడరన్నారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే జరుగుతున్నాయని, వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని సూచించారు. కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలకు హానికలుగుతుందని, అంటువంటి వారికి జైలు శిక్ష తప్పదన్నారు.
కార్యక్రమంలో నగర అడిషనల్ కమిషనర్ జితేందర్, ట్రాఫిక్ డీసీపీ ఎన్ఎస్ చౌహాన్, ఏసీపీలు రాంభూపాల్‌రావు, జైపాల్‌లు, గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ , హరీష్, చంద్రకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, మూవీ ఈవెంట్ మేనేజర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.