అవును నేను సీఎంకు లంచమిచ్చాను..
సీఎంకు లంచమిచ్చానన్న ప్రధాన నిందితురాలు
తిరువనంతపురం/కొచ్చి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సారథ్యంలోని కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ‘సోలార్ స్కామ్’ వేడికి ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రుల మెడకు చుట్టుకున్న ఈ స్కామ్... తాజాగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపైకి మళ్లింది. రాష్ట్రంలో మెగా సోలార్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి గాను అనుమతుల కోసం సీఎం చాందీ కీలక అనుచరుడికి రూ.1.9 కోట్లు ఇచ్చినట్టు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సరిత ఆరోపించారు. కేసు విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు ఈ మేరకు వాంగ్మూలమిచ్చారు.
అంతేకాకుండా ఆయన కేబినెట్లోని విద్యుత్ శాఖ మంత్రి ఆర్యదన్ మహమ్మద్ పీఏకి రూ.40 లక్షలు లంచంగా ఇచ్చినట్టు వెల్లడించారు. కేరళలో సోలార్ ప్రాజెక్టుల కోసం చాందీ మాజీ పీఏ జిక్కుమన్ తనను రూ.7 కోట్లు లంచం అడిగారని, ఆ మొత్తాన్నీ ఢిల్లీలో ఉన్న సీఎం అనధికార అనుచరుడైన థామస్ కురువిల్లాకు అందజేయాలని చెప్పారని సరిత పేర్కొన్నారు. ‘చాందినీ చౌక్ షాపింగ్ మాల్ పార్కింగ్ గ్రౌండ్లో కురువిల్లాకు రూ.1.10 కోట్లు ఇచ్చా. డిసెంబర్ 27, 2012న విమానాశ్రయానికి వెళుతుండగా విజ్ఞాన్ భవన్లో చాందీని కలిశా’ అని సరిత కమిషన్ ముందు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను చాందీ, ఆర్యదన్లు ఖండించారు. కేసును తప్పుదోవ పట్టించడానికే సరిత ఇలా మాట్లాడుతున్నారని సీఎం చెప్పారు.