Justice Surya Kant
-
సర్ చట్టబద్ధమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న ఓటరు జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియ చట్టబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఇది జీవ నాడి వంటిదని వ్యాఖ్యానించింది. వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా బిహార్, బెంగాల్‌లలో చేపట్టిన సర్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పును ఎన్నికల కమిషన్ సాధించిన ఘన విజయంగా భావిస్తున్నారు. సర్ ప్రజాప్రాతినిధ్య చట్టం–1960లోని నిబంధనలకు ఏమాత్రం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయత ఓటరు జాబితా కచ్చితత్వంపైనే ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రక్రియను కేవలం పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం చేపట్టినట్లుగా తాము నిర్థారించలేకపోతున్నామని తెలిపింది. ఎన్నికల కమిషన్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించిందనే వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం..ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలన్న రాజ్యాంగం నిబంధనలకు సర్ ప్రాణం పోస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, ఓటరు జాబితా సవరణ ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం మాత్రం ఈసీకి లేదని స్పష్టం చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరుల పిటిషన్లపై జనవరిలో విచారణ ముగించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు బుధవారం 124 పేజీల సవివర తీర్పు వెలువరించింది. జాబితా ప్రక్షాళన ఈసీ అధికారమే ఓటర్ల జాబితాలో ఒకసారి పేరు నమోదైన తర్వాత, దానిపై మళ్లీ కొత్తగా విచారణ జరిపి పేర్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జాబితా సవరణ పేరుతో ఈసీ చేపట్టిన తొలగింపులు నిబంధన 21ఏకు విరుద్ధమని వారన్నారు. అలాగే, ఓటరు నమోదు, ధ్రువీకరణలకు సంబంధించి పత్రాల పరిశీలన కోసం ఈసీ విధించిన నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, వీటి కారణంగా ఎందరో ఓటు హక్కును కోల్పోతున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల సంఘం చర్యలను సమర్థించింది. ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక గుర్తింపే అయినప్పటికీ, దాన్ని మళ్లీ పరిశీలించకూడదన్న నియమం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను, ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచేందుకు ఇలాంటి సవరణలు (ఎస్ఐఆర్) చేపట్టే పూర్తి అధికారం ఈసీకి ఉంటుందని వ్యాఖ్యానించింది. పత్రాల పరిశీలనకు ఈసీ విధించిన నిబంధనలు పరీక్షకు నిలబడతాయని, అవి పూర్తిగా సహేతుకమైనవేనని తెలిపింది. అయితే, ఒక వ్యక్తి పౌరసత్వంపై ఈసీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేయగలదని, పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం ఆ సంస్థకు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈసీ తీసుకునే నిర్ణయం కేవలం ఎన్నికల ప్రయోజనాలకు మాత్రమే పరిమితం అవుతుందని, పౌరసత్వ చట్టం కింద సదరు వ్యక్తులు తమ హక్కులు కోల్పోయినట్లు భావించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనుమానిత కేసులన్నీ అథారిటీకేసర్లో ముందుగా ఈసీ నోటీసులిచ్చి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకునే విధానాన్ని పాటించినందున ఈ ప్రక్రియ చట్టబద్ధంగా అమలైందని ధర్మాసనం తుది తీర్పులో పేర్కొంది. అయితే, 2003 జాబితా నుంచి భారత పౌరులు కారు అనే కారణంతో తొలగింపునకు గురైన వారి కేసులన్నిటినీ నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం–1955 కింద ఏర్పాటు చేసిన ‘కాంపిటెంట్ అథారిటీ’కి తప్పనిసరిగా పంపాలని ఆదేశించింది. ఆ అథారిటీ చట్టబద్ధంగా విచారణ జరిపి వారు భారత పౌరులే అని తేల్చితే, ఆ పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. మరణించినవారు, వలస వెళ్లిన వారు లేదా నకిలీలు అనే కారణాలతో పొరపాటున జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు న్యాయ సమీక్ష ద్వారా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం కూడా ఉందని ధర్మాసనం వివరించింది. పౌరసత్వానికి ఆధార్ ధ్రువీకరణ కాదుసర్ కోసం ఎన్నికల కమిషన్ అమలు చేసిన ధ్రువీకరణ పత్రాల విధానాన్ని ధర్మాసనం సమర్థించింది. ఎన్నికల సంఘం అనుమతిస్తున్న డాక్యుమెంటేషన్ ప్రమాణాలపై అభ్యంతరాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓటర్ల జాబితాల తయారీ ఒక యాంత్రిక ప్రక్రియ కాదు, అదొక ప్రాథమిక రాజ్యాంగబద్ధమైన విధి అని తీర్పు నొక్కి చెప్పింది. నివాసం, అర్హత వంటి చట్టబద్ధమైన నిబంధనల నిర్ధారించే హక్కు ఈసీకి ఉందని పేర్కొంది. అదేవిధంగా, ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని కూడా తెలిపింది. 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) చట్టం ప్రకారం ఆ కార్డును పౌరసత్వానికి, స్థానికతకు నిరూపణగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటు హక్కుకు అవసరమైన చట్టబద్ధ అర్హతగా దీనిని పరిగణించకపోవడంలో ఈసీ నిర్ణయం సరైందేనని పేర్కొంది. ఒక వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఆధార్‌ను ఉపయోగించాలని తెలిపింది. ఓటర్ల ముమ్మర సర్వే కోసం నిర్దేశించిన పత్రాల జాబితా నుంచి రేషన్ కార్డులను మినహాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. సర్ ప్రక్రియకు అనుగుణంగా రేషన్ కార్డుల స్థానంలో మరింత విశ్వసనీయమైన పత్రాలను కోరడం, కొన్ని రకాల పత్రాలను మార్చడం వంటి విచక్షణాధికారాలు ఈసీకి ఉన్నాయని తీర్పులో పేర్కొంది.తీర్పు ముఖ్యాంశాలు→ బిహార్‌లో చేపట్టిన సర్ ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం–1960 నిబంధనలకు విరుద్ధంగా లేదు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిబంధనలకు భంగం కలిగించడం లేదు. → ప్రస్తుతం నిర్వహించిన సర్ ప్రక్రియ, చట్ట పరమైన అవసరాలకు అనుగుణంగానే ఉంది. సాధించాల్సిన లక్ష్యానికి అనుగుణంగానే ఈ చర్యలు ఉన్నాయి. ఇవి హేతుబద్ధమైనవి. ఏకపక్షంగా ఎవరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా నిరోధించడానికి తగు రక్షణ విధానాలు ఇందులో ఉన్నాయి. → ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకే కొన్ని రకాల పత్రాల వర్గీకరణ, కొన్ని వర్గాల పత్రాల మినహాయింపు స్పష్టమైన ప్రమాణాల ఆధారంగానే నిర్ణయించారు. → ఓటర్ల జాబితాలో చేర్చడానికి కావలసిన అర్హతను నిర్ధారించే క్రమంలో పౌరసత్వంపై పరిమితమైన విచారణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది. అయితే, ఇటువంటి విచారణ పౌరసత్వాన్ని పూర్తిగా నిర్ధారించే ప్రక్రియ మాత్రం కాదు. → ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన వారు తమ ఫిర్యాదులను నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం పరిధిలోని సంబంధిత అథారిటీకి ఎన్నికల సంఘం రిఫర్ చేయాలి. → ఆయా కేసులపై సంబంధిత అథారిటీ చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలి. వీలైతే తదుపరి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏది ముందుగా జరిగితే దానికి ముందే నిర్ణయం ప్రకటించాలి. అలాగే, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు ముందుగా నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినడానికి తగిన అవకాశం కల్పించాలి. → ఒకవేళ సదరు అథారిటీ విచారణ తర్వాత తొలగింపునకు గురైన వారు భారత పౌరులేనని తేలితే వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఎవరు ఓటేయాలో నిర్ణయించేది బీజేపీయే: యోగేందర్ యాదవ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లలో ఒకరైన యోగేందర్ యాదవ్ స్పందించారు. తీర్పు తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఇలాంటి తీర్పు వస్తుందని తాను ముందే ఊహించానన్నారు. అందుకే, తీర్పు సమయానికి తాను కోర్టుకు వెళ్లలేదని చెప్పారు. సర్ రాజ్యాంగబద్ధతను పరిశీలించడం వదిలేసి, ఫిర్యాదుల పరిష్కారం, మధ్యవర్తిత్వంపైనే న్యాయస్థానం దృష్టి సారించినప్పుడే తనకీ విషయం అర్థమైందని చెప్పారు. ఇకపై ఎవరు ఓటేయాలో, ఎవరు ఓటేయ కూడదో నిర్ణయించేది బీజేపీనంటూ ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. అసలు వాస్తవమేమంటే.. ఈ తీర్పు లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును రద్దు చేయడానికి అనుమతి ఇవ్వడం. ఇప్పటివరకు కనీసం 5.9 కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోయారు. ఇది మున్ముందు 10 కోట్లకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.సుప్రీం తీర్పుతో సమాధానాలకు మించి ప్రశ్నలు: కాంగ్రెస్ సర్‌కు రాజ్యాంగబద్ధతను కట్టబెడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తీర్పుతో తాము గౌరవప్రదంగా ఏకీభవించడం లేదని తెలిపింది. ‘సర్‌కు అనుమతి ప్రాథమికంగా ఒక చట్టబద్ధతను చేకూర్చవచ్చు. కానీ, దాని అమలులోని దురుద్దేశాన్ని ఎంతమాత్రం సరిదిద్దలేదు’అని పేర్కొంది. సర్ ప్రక్రియను ఈసీ అమలు చేసిన తీరుపై తాము లేవనెత్తిన అనేక ప్రశ్నలను న్యాయస్థానం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపింది. పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు ఈసీకి లేదని ఈ తీర్పు స్పష్టం చేసినప్పటికీ ఈసీ ఇప్పటికే పౌరసత్వం ప్రాతిపదికన ప్రజలను ఓటర్ల జాబితా నుంచి మినహాయించడం పరస్పర విరుద్ధం కాదా? అని ప్రశ్నించింది. -
టాయిలెట్లు, నాప్కిన్ల కొరత సాకుతో బాలికలను బడికి దూరం చేయరాదు
న్యూఢిల్లీ: స్కూళ్లలో శానిటరీ నాప్కిన్లు, వేరుగా టాయిలెట్లు లేవనే ఒకే ఒక్క కారణంతో బాలికలు చదవుకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 30వ తేదీన తాము వెలువరించిన ఆదేశాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో తుచ తప్పక అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని మరోసారి కోరింది. విద్యార్థినులకు ఉచిత శానిటరీ నాప్కిన్లు అందించడం, పాఠశాలల్లో బాలికలకు వేరుగా నీటి వసతి కలిగిన పనిచేసే మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించేలా చర్యలు వేగవంతం చేశామని సోమవారం జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల ధర్మాసనానికి కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అర్చనా పాఠక్ దవే విన్నవించారు. స్పందించిన ధర్మాసనం..‘ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోండి. అవి మన దేశంలోని మహిళలు, బాలికల మేలు కోసమే. కేవలం టాయిలెట్లు, నాప్కిన్లు లేవని బాలికలు చదువు మానేసి ఇంటి పనులకు పరిమితం కారాదు’అని పేర్కొంది. అదేవిధంగా, తమ ఆదేశాల అమలు తీరుపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వివరాలను సేకరించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎప్పటికప్పుడు ఈ అంశంపై సమీక్ష కొనసాగిస్తూనే ఉండాలని తెలిపింది. ఆదేశాల అమలుపై ప్రతి మూడు నెలలకోసారి తమకు నివేదిక అందజేయాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించింది. తాము వాటిపై సమీక్ష చేపడతామంది. ఈ అంశంపై సెప్టెంబర్ ఒకటో తేదీన తదుపరి విచారణ జరుపుతామని, ఇందుకుగాను ఆగస్ట్ 15కల్లా నివేదిక అందజేయాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సహకారం అందించాలని స్పష్టం చేసింది. ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని పేర్కొంది. ఈ సందర్భంగా ఒక మధ్యంతర పిటిషనర్ తరఫు న్యాయవాది జనవరి 30వ తేదీ నాటి ఆదేశాల్లో ఉన్న ఆక్సో–బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ల గురించి ప్రస్తావించారు. అవి పర్యావరణ హితమైనవి కావని తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.ఆ కీలక తీర్పులో ఏముంది? జనవరి 30వ తేదీన అత్యున్నత న్యాయస్థానం..‘రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కులో రుతుక్రమ ఆరోగ్య హక్కు కూడా భాగమే. రుతుక్రమ పరిశుభ్రతకు తగు సదుపాయాలు లేకుంటే బాలికలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది. అంతిమంగా వారు వెనుకబాటుకు గురవుతారు. వీటిని నివారించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్లను బాలికలకు పూర్తిగా ఉచితంగా అందించాలి. అదేవిధంగా, సక్రమంగా పనిచేసే, నీటి వసతి కలిగిన టాయిలెట్లను బాలికల కోసం వేరుగా నిర్మించాలి’అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. -
కాక్రోచ్ దుమారం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సమర్థనలు, ఖండనలు.. తీవ్ర అభ్యంతరాలతో ఈ క్యాంపెయిన్‌పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇటు తిరిగి చివరకు.. ఈ రాజకీయ సెటైర్ క్యాంపెయిన్ కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీజేఐ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్లను పరిశీలించారు. అయితే ఇది అత్యవసర విచారణ జరిపే పిటిషనేం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మే 15న జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ‘‘కొందరు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు..’’ అంటూ సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక, వృత్తుల్లో స్థానం దక్కని కొందరు యువకులు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు. కొందరు మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తుంటారు అని పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు యువతపై కాకుండా నకిలీ, బోగస్ డిగ్రీలతో వ్యవస్థల్లోకి చొరబడుతున్న వారినే ఉద్దేశించాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ “కాక్రోచ్ జనతా పార్టీ” (సిజెపి) పేరిట సోషల్ మీడియాలో వ్యంగ్య ప్రచారం కొనసాగింది. ఈ పరిణామాలను ప్రాక్టీసింగ్ లాయర్ రాజా చౌదరి సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి.. నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రచారం చేశారని.. ఈ దుష్ప్రచారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని అందులో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్లపై న్యాయవాది గోస్వామి వాదనలు వినిపించారు. కోర్టు విచారణల్లో జరిగిన మాటల మార్పిడిని.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదుల వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దంటూ సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్‌కు సూచించారు. ఈ అంశంలో ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అత్యవసర విచారణ జరపాల్సినంత సీన్ లేదు. సమయం వచ్చినప్పుడు కోర్టు ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది అని లాయర్ గోస్వామిని ఉద్దేశిస్తూ సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యల ప్రస్తావన, మళ్లీ వివరణ అంశాల్ని ఆయన ప్రస్తావించలేదు."Don’t take it so sentimentally’, says Chief Justice of India Surya Kant, as a lawyer mentions PIL, saying a distorted and malicious narrative is being continued to malign the judiciary despite clarification by the CJI on the 'cockroach' remark.CJI says there is no such grave… pic.twitter.com/gi0yp91N9h— ANI (@ANI) May 25, 2026మరో పిటిషన్లో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట సాగుతున్న ఆన్లైన్ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైంది. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్‌గా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం సాగిస్తూ వాణిజ్య లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని కూడా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అలా మొదలై..మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిజిత్ దిప్కే ప్రారంభించిన “కాక్రోచ్ జనతా పార్టీ” మొదట సరదా సెటైర్లా మొదలైనా.. క్రమంగా ఇది వ్యవస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసే డిజిటల్ ఉద్యమంగా మారింది. సీజేఐ సూర్యకాంత్ చేసిన “కాక్రోచ్” వ్యాఖ్యలను తమపై అవమానంగా భావించిన కొంతమంది నిరుద్యోగ యువత, సోషల్ మీడియా యూజర్లు ఈ పేరును వ్యంగ్య చిహ్నంగా మార్చుకున్నారు. “మమ్మల్ని బొద్దింకలు అంటారా..? అయితే ఇదే మా పార్టీ” అన్నట్లుగా ఈ క్యాంపెయిన్‌ను నడిపిస్తున్నారు.చదవండి: కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల బరిలోనికి దిగుతుందా?ఈ గ్రూప్ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టర్లు, వ్యంగ్య నినాదాలు, డిజిటల్ పోస్టర్లతో భారీ ప్రచారం చేస్తోంది. “Wherever WiFi Works is our headquarters”, “Party for the unemployed and overqualified” లాంటి ట్యాగ్లైన్లతో యువతలో వైరల్ అవుతోంది. రాజకీయాలపై, న్యాయవ్యవస్థపై, ఉద్యోగ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.ట్రోలింగ్ మాత్రమే కాదు..అయితే ఇది కేవలం ట్రోలింగ్‌కే పరిమితం కాలేదు. మాజీ ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ అవకాశాలు ఇవ్వొద్దని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు-ఎంపీలకు 20 ఏళ్ల అనర్హత విధించాలని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, పరీక్షల లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావాలని వంటి డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ఇది పూర్తిగా సరదా క్యాంపెయినా..? లేక వ్యవస్థలపై డిజిటల్ నిరసనా..? అనే చర్చ మొదలైంది.మరోవైపు విమర్శకులు మాత్రం ఈ క్యాంపెయిన్ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతోందని ఆరోపిస్తున్నారు. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్‌గా కట్ చేసి వైరల్ చేయడం, మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం చేయడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. -
కంటెంట్‌పైనే అభ్యంతరం రచయితలపై కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్య పుస్తకంలోని వివాదాస్పద అంశాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠ్యపుస్తకాల్లోని విషయాలకు (కంటెంట్) సంబంధించి మాత్రమే తమకు అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని రూపకల్పన చేసిన విద్యావేత్తలను తప్పుబట్టడం తమ ఉద్దేశం కాదని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో తామిచ్చిన ఉత్తర్వుల్లో రచయితలను ఉద్దేశించి చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేవలం 8వ తరగతి పుస్తకాల్లోనే కాకుండా 11వ తరగతి పాఠ్యపుస్తకాల్లోనూ అభ్యంతరకర కార్టూన్లు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వయసు విద్యార్థులపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని, విద్యా సంబంధిత పుస్తకాల్లో ఇలాంటి వాటికి తావుండరాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు. వివాదాస్పద కంటెంట్ రూపొందించిన వారితో భవిష్యత్తులో ప్రభుత్వం కలిసి పనిచేయదన్న నిర్ణయాన్ని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. ఈ సందర్భంగా రచయితలు, విద్యావేత్తల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో రచయితల ఉద్దేశాలను తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వారి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాల రూపకల్పన సమష్టి బాధ్యత అని, ఇందులో ఏ ఒక్కరినీ బాధ్యులను చేయ డం సరికాదన్నారు. వాటిని ఉత్తర్వుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ‘గత ఉత్తర్వుల్లోని వ్యాఖ్యలతో రచయితలకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. వారి వివరణ విన్న తర్వాత ఆ ప్రతికూల వ్యాఖ్యలను తొలగిస్తున్నాం. మా అభ్యంతరాలు కంటెంట్ పైనే తప్ప, రూపొందించిన వ్యక్తులపై కాదు’అని స్పష్టం చేసింది. -
టెట్రా ప్యాక్‌ల్లో మద్యం.. మోసపూరితం
సాక్షి, న్యూఢిల్లీ: టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల వంటి ‘గుర్తించలేని ప్యాకేజింగ్’లో మద్యం విక్రయాలు సాగిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వీటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర ఇతర భాగస్వామ్య పక్షాలను ఆదేశించింది. కేంద్రంసహా అన్ని రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ‘డ్రంకెన్ డ్రైవింగ్ వ్యతిరేక కమ్యూనిటీ’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని, టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల మద్యం అమ్మకాలను నిషేధించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున అడ్వొకేట్ విపిన్ నాయర్ వాదనలు వినిపించారు. ఎక్సైజ్ విధానం కింద ‘సీసా’ అనే పదానికి నిర్వచనం అస్పష్టంగా ఉందని, దీనిపై కొంత ప్రామాణీకరణ జరగాలని చెప్పారు. ఆకుపచ్చ ఆపిల్ ఫోటోలు ఉన్న టెట్రా ప్యాక్‌ల్లో మద్యం ప్యాక్ చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం నిజంగా మోసపూరితమేనని ధర్మాసనం పేర్కొంది. టెట్రా ప్యాక్ చూసి వినియోగదారులు పొరబడుతున్నారని, పైన ఆపిల్ ఫోటో, లోపల వోడ్కా ఉంటోందని విపిన్ నాయర్ వెల్లడించారు. పౌరుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని తేల్చిచెప్పారు. ‘‘పొగాకు ప్యాకెట్లపై ఉన్నట్లుగా టెట్రా ప్యాక్‌లపై ఎలాంటి హెచ్చరిక గుర్తులు లేవు. ఇవి పండ్ల రసాల ప్యాకెట్ల మాదిరిగానే ఉంటాయి. లోపల మద్యం నింపుతున్నారు. మిరపకాయ, మామిడి వోడ్కాలు కూడా ఉన్నాయి. దీనివల్ల పబ్లిక్ ప్రదేశాల్లో, వాహనాలు నడుపుతూ సులభంగా మద్యం తాగే అవకాశం కలుగుతోంది. మైనర్లు వీటికి త్వరగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రాల సరిహద్దులు దాటించి స్మగ్లింగ్ చేయడం కూడా సులభంగా మారుతోంది. ఈ తరహా విక్రయాలను నిషేధించేలా ఒక విధానాన్ని తీసుకురావాలి. ‘బాట్లింగ్’ అంటే కేవలం గాజు సీసాలు లేదా పారదర్శక కంటైనర్లు మాత్రమే అన్నట్లుగా ఏకీకృత నిర్వచనం ఇవ్వాలి. అంతేకాకుండా ప్లాస్టిక్ సాచెట్లు, పెట్ బాటిళ్లు, టెట్రా ప్యాక్‌ల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. వీటిని రీసైకిల్ చేయడం దాదాపు అసాధ్యం. ఆదాయం పెంచుకోవడానికే వాటిని ప్రోత్సహిస్తున్నారు. ప్రమాదకరమైన ప్యాకేజింగ్‌లో మద్యం అమ్మకాలను నిషేధించడం ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అత్యవసరం’’ అని అని విపిన్ నాయర్ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే: ధర్మాసనం పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పండ్ల రసాల ప్యాకెట్లను పోలి ఉండే టెట్రా ప్యాక్‌ల్లో విరివిగా మద్యం విక్రయించడం అత్యంత మోసపూరితమైన చర్య అని వ్యాఖ్యానించింది. ఇలాంటి విక్రయాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అభిప్రాయపడింది. గతంలో ఓ ట్రేడ్ మార్క్ వివాదానికి సంబంధించిన విచారణలోనూ టెట్రా ప్యాక్‌ల్లో మద్యం అమ్మకాలపై తాము అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
కోర్టులూ ఆస్పత్రుల్లా 24/7!
జబల్పూర్: వైద్యాలయాల మాదిరిగా న్యాయస్థానాలూ 24 గంటలూ సామాన్యులకు అందుబాటులో ఉంటూ వాళ్ల బాధలు, ఆకాంక్షలను నెరవర్చే రాజ్యాంగబద్ధ కేంద్రాలుగా పరిఢవిల్లాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిలషించారు. మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర హైకోర్టు పరిధిలో కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధిచేసిన సందర్భంగా ‘సమీకృత ఐక్య డిజిటల్ వేదికగా న్యాయసాధికారత’పేరిట జరిగిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. ‘‘ఆస్పత్రుల్లా కోర్టులూ వారంలో ప్రతిరోజూ ప్రతిగంటా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడు ప్రజల బాధలు, ఆకాంక్షలను న్యాయవ్యవస్థ సత్వరం తీర్చగలదు. సాంకేతికతో మాత్రమే కోర్టుల సమయం వృథాకాకుండా నివారించగలం. న్యాయవ్యవస్థలో సమర్థవంతమైన టెక్నాలజీ, కృత్రిమమేథ ఆధారిత మౌలికవసతుల కల్పన తర్వాత వేగవంతమైన న్యాయవితరణ సాధ్యమవుతుంది. తక్షణం ఉపశమనం కల్పించేలా ప్రజలకు న్యాయం అందించాలి. అందుకోసమే న్యాయవ్యవస్థ అనేది 24/7 పనిచేయాల్సిందే’’అని అన్నారు. యువతపై అలాంటి భాష వాడలేదు.. సరైన వృత్తి ఎంచుకునే సామర్థ్యంలేక యువత పరాన్నజీవుల్లా మీడియా, సోషల్‌మీడియా, లాయర్, సామాజిక కార్యకర్తల్లా మారి దేశవ్యవస్థను నాశనంచేస్తున్నారంటూ సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంకావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలో ఒక వర్గం దురుద్దేశంతో నా మాటలను తప్పుగా వక్రీకరించింది. తప్పుడు, బోగస్ డిగ్రీ పట్టాలు సంపాదించి కొందరు లాయర్ వృత్తిలోకి వస్తున్నారనే ఉద్దేశంతో నిన్న అలా మాట్లాడా. యువతను అస్సలు కించపరచలేదు. భారతీయ యువత నాకెంత గౌరవం ఇస్తారో నవభారత మూలస్తంభాలుగా వాళ్లనూ అంతకంటే ఎక్కువగా నేను గౌరవిస్తా’’అని సీజేఐ అన్నారు. -
న్యాయ సమీక్ష రాజ్యాంగ విధి
న్యూఢిల్లీ: న్యాయ సమీక్షాధికారం తమ రాజ్యాంగ విధి అని, సంస్కరణలు, సంక్షేమం వంటి అంశాల్లో ఆ అధికారాన్ని తాము వదులుకోజాలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని శబరిమల, తదితర మత ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోందంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టడం తెల్సిందే. ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ లాయర్ కె.పరమేశ్వర్ గురువారం తన వాదనలు వినిపించారు. ‘సామాజిక సంక్షేమం, సంస్కరణల ప్రాథమిక బాధ్యత శాసనసభలపైనే ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. దీనర్థం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టులకు అధికారం లేదని కాదు. న్యాయస్థానం అత్యుత్సాహం చూపే సంస్కర్త మాదిరిగా ఉండరాదు, అలాగని ప్రేక్షక పాత్రకే పరిమితం కారాదు’అని పరమేశ్వర్ పేర్కొన్నారు. ‘మతపరమైన హక్కుల చెల్లుబాటును హేతుబద్ధత వంటి అంశాల ఆధారంగా అంచనా వేయకూడదు. విశ్వాసానికి, హేతబద్ధతకు చాలా వ్యత్యాసం ఉంది. హేతుబద్ధతను తెరపైకి తెచ్చిన పక్షంలో రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25, 26లు ఉనికినే కోల్పోతాయి. ప్రజల స్వేచ్ఛను, సమగ్రతను కాపాడే సందర్భాల్లో మాత్రమే న్యాయస్థానాలు మతాచారాల్లో జోక్యం చేసుకోవచ్చు’అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై సీజేఐ ఏకీభవించారు. ‘న్యాయసమీక్ష బాధ్యతను రాజ్యాంగ న్యాయస్థానం వదులుకోజాలదు. ఇది కేవలం అధికారానికి సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగం కోర్టుకున్న రాజ్యాంగవిధి’అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. 16 రోజులపాటు కొనసాగిన వాదనలు ప్రార్థనాస్థలాల్లో మహిళలపై వివక్షపై వాదనలు వాదనలు ముగించిన 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా పక్షాలు తమ వాదనలను ఈ నెల 29వ తేదీలోగా పూర్తిస్థాయిలో రాతపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోనిరాజ్యాంగ ధర్మాసనం 16 రోజులపాటు వాదనలు విన్నది. సీఎస్ వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి, ఇందిరా జైసింగ్, నీరజ్ కిషన్ కౌల్, గోపాల్ శంకరనారాయణన్ తదితర సీనియర్ లాయర్లు వాదనలు వినిపించారు. ధర్మాసనంలో సీజేతోపాటు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలె, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఉన్నారు. అంతకు ముందు కేంద్రం, శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళలను అనుమతించరాన్న నిబంధనను కొనసాగించాలని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా తెలిపింది. ఈ నిబంధనల మత విశ్వాసాల పరిధిలోకి వస్తుందని, న్యాయపరమైన సమీక్షకు ఇది అతీతమని వివరించింది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2018లో తీర్పు వెలువరించడం తెల్సిందే. అనంతరం సుప్రీంకోర్టు ఈ అంశంపై అంతిమ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని నిర్ణయించింది. శబరిమలతోపాటు మసీదులు, దర్గాల్లో ముస్లిం మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం, పార్సీయేతర పురుషులను వివాహమాడిన పార్సీ మహిళలను ఆ మత పవిత్రప్రాంతంలోకి అనుమతించారన్న అంశంపైనా తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. ముస్లిం, పార్సీ మహిళలు తమ ప్రార్థనా స్థలాల్లోకి ప్రవేశించకుండా విధించిన ఆంక్షల వంటి మత స్వేచ్ఛా వ్యవహారాల్లో సంపూర్ణ న్యాయం చేయడానికి ఒక న్యాయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం పేర్కొంది.రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కు పరిధిలోకి వచ్చే ఏడు ప్రశ్నలను పరిశీలిస్తామని ధర్మాసనం ముందుగానే తెలిపింది. అవి..→ ఆర్టీకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛా హక్కు పరిధి, పరిమితి ఏమిటి? → ఆర్టీకల్ 25 ప్రకారం దఖలు పడే హక్కులకు, ఆర్టీకల్ 26 కింద మతపరమైన సంస్థలకు ఉండే హక్కులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? → ఆర్టీకల్ 26 ప్రకారం మత సంస్థలకు ఉండే హక్కులు.. ప్రజా శాంతి, నైతికత, ఆరోగ్యంతో పాటు ఇతర ప్రాథమిక హక్కులకు కూడా లోబడి ఉంటాయా? → ఆర్టీకల్ 25, 26లలో పేర్కొన్న నైతికత అనే పదానికి అర్థం, పరిధి ఏమిటి? అందులో రాజ్యాంగబద్ధమైన నైతికత కూడా భాగమేనా? → ఆర్టికల్ 25లో పేర్కొన్న మతపరమైన ఆచారాల విషయంలో న్యాయ సమీక్షకు ఎంత వరకు అవకాశముంటుంది? → రాజ్యాంగంలోని అధికరణ 25 (2) (బీ)లో ఉన్న హిందువులలోని విభాగాలు అనే పదానికి అర్థం ఏమిటి? → ఏదైనా ఒక మత సమూహానికి, సంస్థకు చెందని వ్యక్తి, ఆ మతానికి సంబంధించిన ఆచారాలను ప్రశ్నిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయొచ్చా?. -
ఆ చట్టాన్ని సవరించండి
న్యూఢిల్లీ: అత్యాచార బాధిత బాలికల గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మైనర్‌ను గర్భాన్ని మోయాలంటూ బలవంతం చేయజాలమని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం.. బాధిత మైనర్ తన అవాంఛిత గర్భాన్ని 20 వారాలు దాటిన తర్వాత సైతం తొలగించుకునేందుకు అనుమతించేలా చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం వెలువరించిన ఈ నిర్ణయం అత్యాచార బాధితులు, ముఖ్యంగా చిన్నారుల ప్రాథమిక హక్కుల విషయంలో ఒక మైలురాయిగా మారనుంది. 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి 30 వారాల గర్భాన్ని తొలగించాలంటూ ఏప్రిల్ 24వ తేదీన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఎయిమ్స్‌ను ఆదేశించడం తెల్సిందే. దీనిపై ఎయిమ్స్ వేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఎయిమ్స్ వినతిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిణామం చెందేలా చట్టాలు ఉండాలి. అత్యాచారం వంటి కారణాలతో గర్భం దాల్చినప్పుడు, దాన్ని తొలగించుకునేందుకు సమయ పరిమితి విధించడం సరికాదు. ఆ మేరకు చట్ట సవరణ చేయండి. ఇటువంటి కేసుల విచారణను వారంలోపే పూర్తి చేసేలా మార్పులు చేపట్టండి. విచారణ ఆలస్యంతో కలిగే మానసిక వేదనను ఆ చిన్నారి ఎందుకు అనుభవించాలి?’అని సీజేఐ ప్రశ్నించారు. ఎయిమ్స్ వాదనను ఖండించిన ధర్మాసనం ఇది చిన్నారికి, లోపలున్న పిండానికి సంబంధించిన సమస్య కాదని, చిన్నారికి మరో చిన్నారికి సంబంధించిన అంశమని ఎయిమ్స్ తరఫున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. ‘ఇప్పటికే 30 వారాలు గడిచాయి కాబట్టి, గర్భస్థ శిశువు స్వతంత్రంగా జీవించగలిగే స్థితిలో ఉన్న ప్రాణం. ఒకవేళ ఇప్పుడు గర్భస్రావం చేస్తే, అది తీవ్ర వైకల్యాలతో కూడిన సజీవ శిశువు అవుతుంది. మరోవైపు, మైనర్ అయిన ఆ తల్లి జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఆమె తిరిగి గర్భం దాల్చే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు’అని భాటి వివరించారు. స్పందించిన ధర్మాసనం..‘అన్ని వివరాలను బాలిక తల్లిదండ్రులకు చూపించండి. వారు ఆ గర్భాన్ని ఉంచుకోవాలని నిర్ణయించుకుంటే, అలాగే కానివ్వండి. ఆ చిన్నారి మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వారు భావిస్తే, నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వండి. వారే క్యూరేటివ్ పిటిషన్ వేయాలి. ఒక సైకియాట్రిస్ట్‌ను, కౌన్సెలర్‌ను వారితో మాట్లాడించండి. అంతిమ నిర్ణయం వారిదే కావాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరుల తరపున నిర్ణయాలు తీసుకోవడం ఎయిమ్స్ పని కాదని, వారు కేవలం వైద్య సేవలు మాత్రమే అందించాలని తేల్చిచెప్పింది. స్కూలుకెళ్లే వయస్సు.. ‘ఇది చిన్నారిపై జరిగిన అత్యాచార ఉదంతం. గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇవ్వకపోతే, ఆ బాధితురాలి మనసుపై జీవితాంతం ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది. ఆ చిన్నారికి ఎటువంటి శాశ్వత శారీరక వైకల్యం కలగనంత వరకు, గర్భస్రావం చేపట్టాల్సిందే. ఇష్టం లేని గర్భాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఆమె ఒక చిన్నపిల్ల. స్కూలుకెళ్లి చదువుకోవాల్సిన వయస్సులో మనం ఆమెను తల్లిని చేయాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఆ చిన్నారి అనుభవిస్తున్న బాధను, అవమానాన్ని ఒక్కసారి ఊహించండి’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. -
మీ విధులు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కొన్ని నైతిక బాధ్యతలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొత్తగా అర్హత సాధించిన అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్(ఏఓఆర్) బృందం అప్రమత్తంగా వ్యవహరించాలని, న్యాయపరమైన పనులను కృత్రిమ మేధ(ఏఐ) లేదా ఇతర బాహ్య సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించవద్దని తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 కింద రూపొందించిన నిబంధనల ప్రకారం.. అడ్వొకేట్స్–ఆన్–రికార్డ్‌గా నియమించబడిన న్యాయవాదులు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో ఒక పక్షం తరఫున వాదించగలరు. న్యాయవాదులను ఏఓఆర్లుగా నియమించే ముందు సుప్రీంకోర్టు వారికి పరీక్ష నిర్వహిస్తుంది. శుక్రవారం ఏఓఆర్‌ల పదవీ స్వీకార కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ఏఓఆర్లు కేవలం బార్ సభ్యులు మాత్రమే కాదని.. అధికారిక కోర్టు అధికారులు అని గుర్తుచేశారు. ఏఓఆర్‌ల వృత్తి నిబద్ధత, అంకితభావంపైనే న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. వారిపై ఉంచిన విశ్వాసమే వారు తమ ప్రతిష్టను నిర్మించుకోవడానికి పునాదిగా తోడ్పడుతుందన్నారు. న్యాయపరమైన విధులను ఏఓఆర్లే వ్యక్తిగతంగా నిర్వర్తించుకోవాలని సూచించారు. కేసుల ఫైలింగ్‌ను ఒక సాధారణ ప్రక్రియగా భావించవద్దని అన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలింగ్ కేంద్రాల్లో దొంగ, నకిలీ, డూప్లికేట్ ఓట్ల బెడదను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్ వ్యవస్థను అమలుచేయాలని సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. ఓటింగ్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతను కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం స్వీకరించింది. ఓటు వేసే ముందు ఓటర్ల వేలిముద్రలు, ఐరిస్, ముఖ గుర్తింపు (బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్) తనిఖీని తప్పనిసరి చేయాలని, వీటిని అమలుచేసేలా కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, న్యాయవాది ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ, దొంగ ఓట్లు, ఒకరి బదులు మరొకరు ఓటేయడం, నగదు ప్రలోభాల వంటి ఘటనలు ఎక్కువయ్యాయి. పాత ఓటర్ ఐడీ కార్డులు, వాటిపై సరిగా కన్పించని ముఖాలు, కార్డుల్లో టైపింగ్ తప్పిదాలు, రియల్‌టైమ్‌తో అనుసంధానంకాని పాత సమాచారం వంటి లోపాలు దొంగ, నకిలీ ఓట్ల వ్యవస్థ తిష్టవేయడానికి కారణమవుతున్నాయి. ఫింగర్, ఐరిస్‌తో ఇలాంటివన్నీ ఆగిపోతాయి. పోలింగ్ వ్యవస్థలో లోపాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ అనేది అత్యంత అవసరం. ‘ఒక పౌరుడికే ఒకే ఓటు’అనే రాజ్యాంగ స్ఫూర్తిని బయోమెట్రిక్ విధానం కాపాడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 కింద ఆధార్‌ను ఇప్పటికే సరైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు. అదే తరహాలో పోలింగ్ బూత్‌లలో బయోమెట్రిక్‌ను అమలుచేయవచ్చు’’అని ఆయన కోర్టులో వాదించారు. ‘‘మార్చి 28న ఈసీకి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా సంక్రమించిన సర్వాధికారాలతో ఈసీ ఇలాంటి అత్యంత పారదర్శకమైన విధానాలను స్వీయనిర్ణాయాధికారాలతో అమలుచేయవచ్చు’’అని ఆయన గుర్తుచేశారు. తర్వాత కోర్టు స్పందించింది. ‘‘బయోమెట్రిక్ తనిఖీల విధానాన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకురావాలంటే ప్రస్తుత ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతికతను దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అమలుచేయాలంటే కేంద్రప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫింగర్, బయోమెట్రిక్ ఐరిస్‌ను అమలుచేయాలని ఆదేశించలేం. ఏర్పాట్లన్నీ అయిపోయిన ఈ దశలో ఇప్పటికిప్పుడు వినూత్న విధానం అమలు అసాధ్యం. తదుపరి సార్వత్రిక ఎన్నికలు లేదా శాసనసభల ఎన్నికల నాటికి ఈ బయోమెట్రిక్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాల్సి ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. బయోమెట్రిక్ విధానం అమలుపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. -
ప్రజలకు అందని చట్టాలు అంతరాన్ని పూడ్చాలి: జస్టిస్ సూర్యకాంత్
డెహ్రాడూన్: ‘‘దేశ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు చట్టాల కొరత కాదు. అవి సామాన్య ప్రజలకు ఆశించినంతగా అందుబాటులో లేకపోవడమే’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. చట్టపరమైన హక్కులకు, వాటి ఆచరణాత్మక లభ్యతకు మధ్య అంతరాన్ని తక్షణమే పూడ్చాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. మన దేశంలో హక్కులు, విధానాలకు సంబంధించి పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ.. దూరం, జాప్యం, అమలులో లోపాల కారణంగా ఆయా ప్రయోజనాలు నిరుపేదలకు చేరడం లేదని వివరించారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో రాష్ట్ర హైకోర్టు, నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ (నల్సా), ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నార్త్ జోన్ ప్రాంతీయ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. ‘‘న్యాయం కేవలం ఉనికిలో ఉంటే చాలదు. అది ప్రతి పౌరుడి ముంగిటికీ సకాలంలో చేరాలి’’ అని స్పష్టంచేశారు. ఒక గణతంత్ర దేశపు బలాన్ని అది ప్రకటించుకున్న హక్కుల ద్వారా కాకుండా, సాకారమైన హక్కుల ద్వారానే కొలవాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు హక్కులు ఉన్నప్పటికీ.. అవి వారికి సులువుగా చేరే మార్గాలు, వేదికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం న్యాయ వ్యవస్థ బాధ్యత అని పిలుపునిచ్చారు. -
PIL: ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే కాన్సెప్ట్ తొలగిస్తే..
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే కాన్సెప్ట్‌ను తొలగించాల్సిన సమయం వచ్చిందంటూ సుప్రీం కోర్టు వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. శబరిమల కేసు సమీక్ష పిటిషన్ల సందర్భంగా ఇది చోటు చేసుకుంది. అయితే సుప్రీం కోర్టు మాత్రం తొందరపాటు నిర్ణయం మంచిది కాదన్న రీతిలో వ్యాఖ్య చేసింది. పిల్(Public Interest Litigation) తరచుగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయన్నది కేంద్రం వాదన. బుధవారం శబరిమల కేసు విచారణ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. పిల్లు ఇప్పుడు తమ అసలు ఉద్దేశ్యాన్ని కోల్పోయాయి అన్నారు. నేటి పరిస్థితుల్లో న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్, కోర్టులకు సులభమైన ప్రాప్యత పెరిగినందున పిల్ అవసరం తగ్గిందని కేంద్రం అభిప్రాయపడుతోందని తెలిపారాయన. అయితే.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం ప్రజా ప్రయోజన వ్యాజ్యల విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం అని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. కోర్టులు పిల్‌ను స్వీకరించడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి అన్నారు. అవి దాఖలు చేసే సమయంలో కఠినమైన ప్రమాణాలు అమలు చేస్తున్నాం. ప్రతి పిటిషన్‌ను పరిశీలించి మాత్రమే స్వీకరిస్తున్నాం అని సాలిసిటర్ జనరల్‌కు గుర్తు చేశారు. అలాగే.. శబరిమల కేసులో భక్తులు కాని వ్యక్తులు వేసిన పిటిషన్లు ఎందుకు స్వీకరించబడ్డాయి? అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు.అసలు పిల్ అంటే..పిల్ అనేది 1980లలో భారత న్యాయవ్యవస్థలో ప్రవేశపెట్టబడిన ఒక ప్రత్యేక పద్ధతి. దీని ఉద్దేశ్యం పేదలు, అక్షరాస్యులు, శారీరక వైకల్యం ఉన్నవారు, సామాజికంగా వెనుకబడినవారు న్యాయస్థానాలకు చేరుకోలేని పరిస్థితుల్లో వారి తరఫున ఇతరులు పిటిషన్ వేసే అవకాశం కల్పించడం. తద్వారా సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు వంటి అంశాలు కోర్టు దృష్టికి వస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితిగతంలో సామాజిక మార్పు సాధనంగా పిల్ ఉపయోగపడినప్పటికీ.. ఇప్పుడు అవి అధిక సంఖ్యలో దాఖలు అవుతున్నాయి. తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. అందుకే కేంద్రం తొలగింపు కోరుకుంటోంది. అయితే.. సామాజిక న్యాయం కోసం PILలు ఇంకా అవసరమే అని న్యాయవేత్తలు, పౌరసమాజం భావిస్తోంది. కాబట్టే.. కేంద్రం PILలను తొలగించాలని కోరుకుంటున్నప్పటికీ.. సుప్రీం కోర్టు వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ కొనసాగిస్తోంది. -
రాజ్యాంగం సజీవం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే లక్ష్యంతో పనిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్మించే నూతన హైకోర్టు జోన్–2 భవన నిర్మాణ పనులకు ఆదివారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్టి, జస్టిస్ అలోక్ అరాధే, హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌తో కలసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం సీజేఐ మాట్లాడారు. ఈ కార్యక్రమం లాంఛనం కాదని.. రాజ్యాంగ విధి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కల కార్యరూపం దాలుస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం అభినందనీయమన్నారు. మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి..: ‘న్యాయవ్యవస్థలో నా సుదీర్ఘ వృత్తి జీవితంలో నేను ఒకటి నమ్ముతాను. ప్రతి కార్యానికి మూడు దశలు ఉంటాయి. ప్రారంభం ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. మధ్యభాగం పట్టుదలను ప్రదర్శిస్తుంది. ముగింపు వాగ్దానం నెరవేరిందా లేదా అనేది తెలియజేస్తుంది. ప్రజలంతా న్యాయపీఠం, చిహ్నం, కార్యకలాపాలను మాత్రమే చూస్తారు. అదే మనకు కనిపించే న్యాయవ్యవస్థ. కానీ ప్రతి కోర్టు గది వెనుక దాన్ని నడిపించే ఓ ప్రపంచం ఉంటుంది. అక్కడే న్యాయమూర్తులు నివసిస్తారు.. శిక్షణ పొందుతారు.. తీర్పులు భద్రపరుస్తారు.. ఈరోజు దానికి మనం పునాది వేస్తున్నాం. మనం ఇక్కడికి రావడం లాంఛనం కాదు.. రాజ్యాంగ విధి. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలన్న సూత్రాన్ని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. ప్రతి రాష్ట్రంలో ఓ హైకోర్టు ఏర్పాటు చట్టపరమైన అవసరమే కాకుండా గణతంత్ర రాజ్య నిబద్ధతగా ఎప్పుడూ భావిస్తాను. అలాంటి నిబద్ధతకు.. అందుకు ఆధారమైన మౌలిక సదుపాయాలు ఉన్నంత వరకే అర్థం ఉంటుంది. అది లేకుంటే కేవలం కాగితాల్లోనే మిగిలిపోతుంది. తెలంగాణలో అది నిర్ధిష్ట రూపాన్ని సంతరించుకుంటోంది. జోన్–1లో పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ భవనాలు ఓపక్క రూపుదిద్దుకుంటుండగానే జోన్–2 మొదలవుతోంది. న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అది సరైనదే. ప్రస్తుత భవనం చారిత్రాక కట్టడం అయినప్పటికీ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. రాబోయే వందేళ్ల అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాలను కల్పించడం ఓ లక్ష్యం మాత్రమే కాదు.. తప్పనిసరి. కోర్టు గదులతోపాటు జోన్–2 కూడా అంతే ముఖ్యం. చెట్టులో మనకు కొమ్మలు, ఎత్తు మాత్రమే కనిపిస్తాయి. కానీ తుపాను వచ్చినప్పుడు వేర్లు మాత్రమే దాన్ని కాపాడతాయి. జోన్–2 న్యాయవ్యవస్థకు వేర్లలాంటింది’అని పేర్కొన్నారు. దశాబ్దం తర్వాత కార్యరూపం.. ‘హైకోర్టు రోజువారీ కార్యకలాపాలు తన నియంత్రణలో లేని ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ 100 ఎకరాల ప్రాంగణం ఆ పరిస్థితిని మారుస్తుంది. సంస్థాగత స్వయం సమృద్ధిని సిద్ధాంతం నుంచి ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు అది ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ నిర్మించబోయే ఆడిటోరియంలో న్యాయవ్యవస్థకు శిక్షణా కార్యక్రమాలు, పౌరుల కోసం న్యాయ అవగాహన శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామం. సెంట్రల్ రికార్డ్ రూమ్.. తీర్పులను భద్రపర్చడం అత్యంత ప్రాధాన్యం. ప్రస్తుత హైకోర్టులో 2009లో చోటుచేసుకున్న ఓ అగ్నిప్రమాదం కొత్త భవన నిర్మాణానికి బీజం వేసింది. ఫుల్ కోర్టు ఆమోదం, హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల ప్రస్తావనతో దశాబ్దం తర్వాత కార్యరూపం దాల్చింది. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు న్యాయ వ్యవస్థకు సదుపాయాల కల్పనకు ముందు వస్తున్నాయి. అత్యంత అవశ్యకం అని గుర్తిస్తున్నాయి. ఇది గొప్ప విషయం. రూ. 2,583 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ సహకారాన్ని అభినందిస్తున్నా. న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ ఒకే లక్ష్యంతో పనిచేస్తే రాజ్యాంగం నిజంగా సజీవంగా నిలుస్తుంది. ఇక్కడి నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు మార్గదర్శకం కావాలి’అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. రాబోయే వందేళ్లకు న్యాయ వేదిక: సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఇదో ప్రత్యేకమైన రోజు. మన దేశంలో దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయం. కానీ న్యాయం కోసం ఓ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడమంటే అన్ని మతాల ప్రజల కోసం ఓ పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే. మన ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర ఆధారితంగా, గౌరవంగా పనిచేస్తాయి. సామాన్య పౌరుడికి కోర్టు ఓ చివరి ఆశ. తెలంగాణ కోసం కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం మా ప్రభుత్వానికో గొప్ప అవకాశం. ఈ భవనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. రాబోయే వందేళ్లపాటు పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వేదికగా సేవలందిస్తుంది. ఇది మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం. వ్యవస్థలు పరస్పర గౌరవంతో, సహకారంతో పనిచేయాలి. ఈ భవనం దేశంలోని అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటి మాత్రమే కాదు.. అత్యాధునిక, మౌలికవసతుల ప్రమాణంగా ప్రఖ్యాతి చెందుతుంది. అందుకే ప్రభుత్వం ఏర్పడగానే రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల భూమిని కేటాయించాం. జోన్–1 పనులు శరవేగంగా సాగుతున్నాయి. జోన్–2 పనులను కూడా 2027 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తాం. తీర్పులకే కాదు.. న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకూ అత్యున్నత గౌరవం ఇస్తాం’అని వెల్లడించారు. ప్రతి వ్యక్తికి భరోసా కల్పించాలి: జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ప్రధాన కోర్టు సముదాయం, కార్యాలయ భవనాల జోన్–1 ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడు నివాస బంగళాలు, అనుబంధ నిర్మాణాలు, ఆడిటోరియం, సెంట్రల్ రికార్డ్ రూమ్.. జోన్–2ను ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. కోర్టులు ఆస్పత్రుల్లా పనిచేయాలని సీజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. అక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికీ భరోసా, విశ్వాసం కల్పించే ప్రదేశాలుగా ఉండాలి. న్యాయం అందించడమే కాదు.. దాన్నిపౌరులు అనుభూతి పొందాలి’అని అభిలíÙంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్టార్లు, ఏజీ సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్రావు, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఎస్.సురేందర్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, హెచ్‌సీఏఏ ఉపాధ్యక్షుడు డీఎల్ పాండు, కార్యదర్శులు శ్రావణ్‌కుమార్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
జవాన్లకు న్యాయ సౌలభ్యం కల్పించాలి
న్యూఢిల్లీ: దేశ రక్షణలో సాయుధ బలగాల పాత్ర శ్లాఘనీయమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వారికి మెరుగైన న్యాయసౌలభ్యం కల్పించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం సరిహద్దుల్లో ఒక యుద్ధం, న్యాయపరమైన హక్కుల కోసం మరో యుద్ధం, ఇలా రెండు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులను వారికి రానివ్వరాదన్నారు. లేహ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. కోర్టులు న్యాయవ్యవస్థ, రాజ్యాంగ విలువలకు రక్షణ కల్పిస్తుండగా, సాయుధ బలగాలు అందుకు అవసరమైన ఆదర్శాలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయని ఆయన తెలిపారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, గౌరవం, సమానత్వం, న్యాయం దేశ ప్రజలకు అందించేందుకు తగిన రక్షణను, పరిస్థితులను కల్పించిన ఘనత సైనికులకే దక్కుతుందన్నారు. -
హైకోర్టు సీజేలుగా బాధ్యతలు చేపట్టే జడ్జీలను ముందుగానే బదిలీ చేయాలి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలకమైన విధానపర నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు అప్పగించే జడ్జీలను ఆ పోస్ట్ ఖాళీ అయ్యేందుకు కనీసం రెండు నెలలు ముందుగానే ఆయా కోర్టులకు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ హైకోర్టు కార్యకలాపాలపై ఆ జడ్జికి మంచి అవగాహన వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో గురువారం సమావేశమైన కొలీజియం అభిప్రాయపడింది. కోర్టు నిర్వహణలో సమర్థంగా, మెరుగ్గా వ్యవహరించగలుగుతారని కొలీజియం సమావేశం పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్ శుక్రవారం తెలిపింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేయాలని తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైరైన వెంటనే ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నియామకం అమల్లోకి వస్తుందని వివరించింది. అదేవిధంగా, కేరళ హైకోరు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారిని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్మానించింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్చి 5న రిటైరవనున్నారు. -
కేంద్రానికి తలనొప్పి.. కోర్టుకు పెనుభారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ట్రిబ్యునళ్ల వ్యవస్థ పనితీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ సంస్థలు ఎవరికీ జవాబుదారీగా ఉండటం లేదని, అవి ప్రస్తుతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’(ఎవరికీ సంబంధం లేని ప్రాంతం)గా తయారయ్యాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం–2021ను కొట్టివేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వివిధ ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల పదవీకాలాన్ని పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించింది. మీరు తెచ్చిందే.. మీకే తలనొప్పి కోర్టు విచారణలో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని ఉద్దేశించి సీజేఐ మాట్లాడుతూ.. ‘ట్రిబ్యునళ్లను సృష్టించింది కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి అవి ఇప్పుడు మీకు తలనొప్పిగా, మాకు పెద్ద భారం (లయబిలిటీ)గా పరిణమించాయి. రెండు మూడు ట్రిబ్యునళ్లు మినహా మిగతావి వెలువరిస్తున్న ఉత్తర్వులను చూస్తుంటే.. అవి ఏమాత్రం జవాబుదారీతనంతో పనిచేయడం లేదని స్పష్టమవుతోందని’వ్యాఖ్యానించారు. ఎంతటి చెత్త వ్యవస్థను సృష్టించాం..? ఓ కీలక ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్న సభ్యుడి తీరుపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ‘టెక్నికల్ మెంబర్’ఏకంగా తాను ఇవ్వాల్సిన తీర్పు లను జ్యుడీషియల్ సభ్యులతో రాయించడం లేదా బ యటి వ్యక్తులకు ‘ఔట్సోర్సింగ్’ఇవ్వడం చేస్తున్నారని సీజేఐ తప్పుబట్టారు.‘అతడికి ఎంతటి ధైర్యం? సరైన సమయం చూసి అతడిని కచ్చితంగా సాగనంపుతాం. కోర్టులపై భారాన్ని తగ్గించుకోవాలన్న ఆత్రుతలో మనం ఎంతటి అస్తవ్యస్తమైన వ్యవస్థను సృష్టించుకున్నామో కదా’అని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే, టెలికాం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (టీడీశాట్)లో చైర్పర్సన్ లేనప్పుడు టెక్నికల్ మెంబర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. సంస్థాగత సంక్షోభం తలెత్తకుండా చూడాలని, టెక్నికల్ మెంబర్ ఒక్కరే ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని జస్టిస్ బాగ్చి కేంద్రానికి తేల్చి చెప్పారు. ట్రిబ్యునల్ సభ్యులకు ఉండాల్సిన కనీస అర్హతలపైనా ధర్మాసనం పెదవి విరిచింది. పర్యావరణ చట్టాలు, వాణిజ్య చట్టాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు.. నాలుగేళ్లలో ఆయా అంశాల్లో నిపుణులు ఎలా అయిపోతారని సీజేఐ ప్రశ్నించారు. ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం జాతీయ ప్రయోజనాలకే విరుద్ధమని, చక్కదిద్దేందుకు కొత్త యంత్రాంగం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. -
తప్పుడు ఫిర్యాదులపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు నమోదు అవుతున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న వారిని కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. కొన్ని సందర్భాల్లో కేసు నమోదు అయిన విషయం ఫిర్యాదు దారుడికి కూడా తెలియడం లేదన్నారు. తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు, దురుద్దేశపూర్వకంగా నమోదు చేసే క్రిమినల్ కేసులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన పిల్‌పై గురువారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీల ధర్మాసనం విచారణ చేపట్టింది. తప్పుడు కేసుల వివరాలను తెలపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిరపరాధుల జీవితాన్ని రక్షించాలి ఆరి్టకల్ 32 కింద దాఖలైన ఈ పిల్లో అంశాలు ఇలా ఉన్నాయి. ‘తప్పుడు కేసులను అరికట్టేందుకు పరిపాలనా భద్రత చర్యలు తీసుకోవాలి. నిరపరాధుల జీవితం, స్వేచ్ఛ, గౌరవాలను రక్షించాలి. నిజమైన కేసుల కంటే తప్పుడు కేసుల వల్లనే న్యాయవ్యవస్థపై భారం పడుతోంది. భూ వివాదాలు వంటి సివిల్ కేసులు కొన్ని సందర్భాల్లో.. ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద క్రిమినల్ కేసులవుతున్నా యి. ఫలితంగా గ్రామీణ వాతావరణం ఇబ్బ ందికరంగా ఉంటోంది’అంటూ సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. రోజూ దేశంలో తప్పుడు కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థలపై ఉందని ఆమె పేర్కొన్నారు. విమర్శలకు భయపడం నిరపరాధులను రక్షించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ‘కోర్టు ఈ అంశంపై ఆదేశాలు ఇస్తే.. ప్రజల హక్కులను అణచివేస్తున్నారనే ఆరోపణలు రావొచ్చనే విషయాన్ని కూడా మేం గమనించాం’అని పేర్కొన్నారు. అయినప్పటికీ.. తాము ఎవరో చేసే విమర్శలకు భయపడమని స్పష్టం చేశారు. ‘మమ్మల్ని గ్యాగ్ చేస్తున్నారని అంటున్నారు, అలా చేస్తున్నారని మేం భయంతో ఉండాలా?’అంటూ ప్రశ్నించారు. కొందరు దురి్వనియోగం చేసి మాయవుతామంటే ఎలా అని పేర్కొన్నారు. ‘ఇటువంటి కేసుల విషయంలో సమాజం అవగాహనతో ఉండాలి, పక్కవారి మౌలిక హక్కుల గురించి కూడా తెలుసుకోవాలి, సోదరభావం పెంపొందించాలి’అంటూ సీజేఐ చెప్పారు. విమర్శల కారణంగా న్యాయవ్యవస్థ దుర్వినియోగాన్ని పట్టించుకోకుండా ఉండబోమని ఈసందర్భంగా స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాలకు సూచనలు విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ‘పోలీసు స్టేషన్లు, కోర్టు ప్రాంగణాలు, పంచాయతీ కార్యాలయాలు, విద్యాసంస్థల వద్ద తప్పుడు కేసులపై శిక్షలకు సంబంధించిన వివరాలతో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు సమయంలో ఆరోపణలు నిజమని అఫడవిట్ లేదా లిఖితపూర్వక హామీ తీసుకోవాలి. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు సమాచారంపై ఉన్న చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. బీఎన్ఎస్–2023లోని సంబంధిత నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వాలి. పిటిషన్ ప్రకారం చట్టాల్లో శిక్షల నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటి దురి్వనియోగాన్ని నిరోధించే పరిపాలనా వ్యవస్థ లోపించడం వల్ల సమస్య కొనసాగుతోంది, దీనిని పరిష్కరించేందుకు సిద్దపడాలి’అంటూ నోటీసుల్లో పేర్కొంది. కేంద్రం, రాష్ట్రాల నుంచి స్పందన వచ్చిన తర్వాత ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఫిర్యాదుదారుడికే తెలియకుండా కేసు? కొన్నిసార్లు అసలు ఫిర్యాదు దారుడికి కూడా తెలియకుండా నకిలీ సంతకాలతో కేసులు నమోదవ్వడం అత్యంత దుర్మార్గమని సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పేద వ్యక్తికి తన పేరుతో కేసు నమోదైందన్న విషయం కూడా తెలియదు. డబ్బు, అధికార ప్రభావంతో దుర్వినియోగం జరుగుతోంది’అంటూ మండిపడ్డారు. ‘ఇటీవల ఓ మహిళ స్వయాన కోర్టుకు వచ్చి ఒక రాజకీయ నాయకుడు తమ కేసులో భాగస్వామి కాదు’’అంటూ చెప్పింది. ఇలాంటి వ్యవహారాలు డబ్బు లేదా శక్తి ప్రభావం లేకుండా జరుగుతాయా?’అంటూ సీజేఐ ప్రశ్నలు సంధించారు. -
న్యాయవ్యవస్థను మసకబార్చే ప్రయత్నం సహించం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో అవినీతి అత్యధికమవుతోందంటూ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’అనే అంశాన్ని జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) చేర్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. న్యాయస్థానాల్లో అవినీతి, పెండింగ్ కేసులు, న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలతో కొత్త పుస్తకం రూపొందించారని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు న్యాయస్థానంలో ప్రస్తావించడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు తక్కువచేసేలా పాఠ్యపుస్తకంలో వ్యాఖ్యానాలు ఉన్నాయని, ఈ అంశాన్ని తక్షణం విచారణకు స్వీకరించాలని లాయర్లు చేసిన అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంఛోలీల ధర్మాసనం పరిశీలించింది. పాఠ్యపుస్తకంలోని ఆ చాప్టర్లో ‘న్యాయమూర్తులు కోర్టులోనేకాదు వాటి వెలుపల సైతం నైతిక నియమావళికి కట్టుబడి ఉండాలి’అని హితబోధ చేస్తూ వ్యాఖ్యానాలు పొందుపరచడంపై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘న్యాయవ్యవస్థను, న్యాయవ్యవస్థ సమగ్రతను మసకబార్చే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా మేం అనుమతించబోం. ఈ విషయాన్ని సుమోటో స్వీకరిస్తాం. న్యాయవ్యవస్థను అపకీర్తిపాలుజేసే చర్యలను అడ్డుకుంటా’’అని వ్యాఖ్యానించారు. చాలా కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి.. ‘‘ఈ పాఠం విషయం తెల్సి నాకు బార్ నుంచి బెంచ్దాకా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదుల నుంచి నాకు అనేక ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. అవినీతి అనేది ఒక్క న్యాయవ్యవస్థలోనే ఉందా? ఇంకా ఏ వ్యవస్థలోనూ లేదా?. ఇటువంటి బోధనల వలన చిన్నారుల్లో న్యాయవ్యవస్థపై గౌరవం పోతుంది’’ అని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూమోటోగా వెంటనే స్వీకరించాలని సిబల్ కోరగా సీజేఐ ‘‘ఈ ఒక్కరోజు ఆగండి. ఈ విషయంలో యావత్ న్యాయవ్యవస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది. న్యాయవ్యవస్థలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈసమస్యను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసని, ఈవ్యవహారంపై ఇప్పటికే సూమోటాగా కేసును నమోదుచేయాలని ఆదేశించా’’అని సీజేఐ తెలిపారు. ‘‘ఉద్దేశపూర్వకంగా పా ఠ్యాంశాన్ని చేర్చినట్లుగా ఉంది. పక్కా ప్రణాళికతో, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇంతకుమించి మేం వ్యాఖ్యానించబోం. ఏదేమైనా ఇలాంటి కీలక అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా’’అని లాయర్లతో సీజేఐ అన్నారు. మేము చాలా బాధపడ్డాం ‘‘న్యాయవ్యవస్థను అవమానక రీతిలో చిత్రించిన కొత్త పాఠ్యాంశాన్ని చూసి మేం చాలా కలత చెందాం’’అని న్యాయవాదులు సింఘ్వీ, సిబల్ ధర్మాసనం ఎదుట చెప్పారు. ‘‘న్యాయవ్యవస్థలో అవి నీతి ఉందంటూ విద్యార్థులకు బోధించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం’’అని సిబల్ అన్నారు. ‘‘పాఠ్యపుస్తకంలోని అంశాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూ త్రాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’అని జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ ఆందోళన వ్యక్తం చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ స్వాగతించారు. యూటర్న్ తీసుకున్న ఎన్సీఈఆర్టీ సర్వోన్నత న్యాయస్థానం సహా పలు హైకోర్టుల జడ్జీలు, న్యాయవాదులు, పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎన్సీఈఆర్టీ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. తమ వెబ్సైట్ నుంచి వివాదాస్పద పాఠ్యపుస్తకాన్ని తొలగించింది. వివాదాస్పద అంశాలను తొలగించాలని భావిస్తోంది. ఇప్పటికే పుస్తకాల ముద్రణ పూర్తయినప్పటికీ వాటిని తొలగించి మళ్లీ కొత్తగా ముద్రించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పాఠ్యాంశాన్ని బోధించాలా వద్దా అనే విషయంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఢిల్లీలోని పలు పాఠశాలల యాజమాన్యాలు బుధవారం వెల్లడించాయి. ఈ పాఠ్యాంశాన్ని రచించిన విషయ నిపుణులను రప్పించి అసలు వీటికి తుది అనుమతులు ఇచ్చిందెవరు అనేది తేల్చేందుకు ఎన్సీఈఆర్టీ అంతర్గత సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేశ్ ప్రసాద్ సాక్లానీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పాఠ్యాంశంపై మోదీ సర్కార్ సైతం అసంతృప్తిగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టులో సుమారు 81 వేలు, హైకోర్టుల్లో 62.40 లక్షలు, జిల్లా, సబార్డినేట్ కోర్టులో ఏకంగా 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, న్యాయవ్యవస్థలో అవినీతి మేటవేసిందని, జడ్జి పోస్టుల భర్తీ సవ్యంగా జరగకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటోందని ఆ పాఠ్యాంశంలో పొందుపరిచిన విషయం విదితమే. -
శబరిమల వివాదంపై విస్తృత ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం కలిగిస్తూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2018లో తీర్పు వెలువరించడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన 67 పిటిషన్లపై విస్తృత ధర్మాసనం తుది విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తుది విచారణకు ఏప్రిల్ 7 నుంచి 22 దాకా రెండు వారాల సమయం కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. 2018 నాటి తీర్పును వ్యతిరేకించే పక్షాల వాదనలను ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ధర్మాసనం ఆలకించనుంది. ఆ తీర్పును సమర్థించే పక్షాలు ఏప్రిల్ 14 నుంచి 16 దాకా వాదనలు వినిపిస్తాయి. ఏప్రిల్ 22 నాటికి విచారణను ధర్మాసనం పూర్తి చేయనుంది. మహిళల మతపరమైన స్వేచ్ఛ, ప్రార్థన స్థలాల్లో వారిపై వివక్షకు సంబంధించి ఇప్పటికే దాఖలైన పలు ఇతర పిటిషన్లను కూడా శబరిమల పిటిషన్లతో పాటే విచారిస్తుంది. మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం, పార్శీయేతర పురుషులను పెళ్లాడే పార్శీ మహిళలకు అగ్ని దేవాలయాల్లోకి ప్రవేశంపై నిషేధం, దావూదీ బోహ్రా సామాజిక వర్గంలో మహిళల్లో అంగవిచ్ఛిత్తి ఆచారం తదితరాలు వీటిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మతాల్లో మహిళలకు మతపరమైన స్వేచ్ఛ, ప్రార్థన స్థలాల్లో వారి ప్రవేశంపై నిషేధం తదితరాలకు సంబంధించిన అంశాలపై కూడా ధర్మాసనం కూలంకషంగా విచారణ జరపనుంది. ‘‘ఈ అంశాలకు సంబంధించి ధర్మాసనం లోతుగా విచారణ జరిపి పూర్తి న్యాయం చేకూరుస్తుంది. ఆ మేరకు వాటిపై న్యాయపరంగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తుంది’’అని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రార్థన స్థలాల నిర్వాహకులు తమ అభిప్రాయాలు, వాదనలతో మార్చి 14 లోపు లిఖితపూర్వక నివేదికలు సమరి్పంచాలని ఆదేశించింది. 2018 నాటి వివాదం... కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమంలో ఉన్న మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా నిషేధం కొనసాగుండటం తెలిసిందే. ఆ మేరకు 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ప్రవేశం లేదు. ఇది చట్టవిరుద్ధమే గాక రాజ్యాంగానికి కూడా విరుద్ధమని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2018 సెపె్టంబర్లో పేర్కొంది. వారి ప్రవేశంపై నిషేధాన్ని తొలగిస్తూ 4:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. దీనిపై కేరళతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. ఆ తీర్పును సవాలు చేస్తూ ఏకంగా 67 పిటిషన్లు దాఖలయ్యాయి. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సారథ్యంలోని మరో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వాటిపై విచారణ జరిపింది. శబరిమలతో పాటు మొత్తంగా ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్ష అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తూ 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది.ఏడు అంశాలపై విచారణ మహిళల మతపరమైన స్వేచ్ఛకు సంబంధించి మొత్తం ఏడు అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ ధర్మాసనం ప్రాథమికంగా పేర్కొంది. అవి... → రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్‌లో పేర్కొన్న ప్రకారం మతపరమైన స్వేచ్ఛకున్న పరిధి ఏ మేరకు? → ఆర్టికల్ 25లో పేర్కొన్న వ్యక్తిగత మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26లో పేర్కొన్న మతపరమైన సంస్థల అధికారాల మధ్య సంబంధాలు ఎలాంటివి? → ఆర్టికల్ 26లో పేర్కొన్న మతపరమైన అంశాలు చట్టపరమైన ఇతర నియమ నిబంధనలకు, నైతిక, ఆరోగ్యపరమైన అంశాలకు లోబడాలా? → ఆర్టికల్ 25, 26లో పేర్కొన్న నైతికత తాలూకు పరిధి ఏమిటి? ఈ విషయంలో రాజ్యాంగపరమైన నైతికతను ఎలా అర్థం చేసుకోవాలి? → ఆర్టికల్ 25లో పేర్కొన్న మతపరమైన పద్ధతులు, ఆచారాలపై న్యాయసమీక్షకు ఉన్న ఆస్కారం ఏ మేరకు? → ఆర్టికల్ 25 (2) (బి)లో పేర్కొన్న హిందూ వర్గాలు అంటే ఎవరు? → ఏదైనా మతపరమైన ఆచరణను వ్యతిరేకిస్తూ ఆ మతంతో సంబంధం లేనివారు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయవచ్చా?’’సమీక్షకే మా ఓటు: కేంద్రం ఆచితూచి నిర్ణయం: కేరళ న్యూఢిల్లీ/త్రివేండ్రం/కొట్టాయం: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత తీర్పుపై సమీక్షను కేంద్రం సమరి్థస్తున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సోమవారం విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనానికి ఈ మేరకు ఆయన నివేదించారు. కేరళ ప్రభత్వం మాత్రం ప్రస్తుతానికి సమీక్షను వ్యతిరేకిస్తోందని సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా ధర్మాసనానికి తెలిపారు. అయితే, ఈ అంశంపై సంబంధిత వర్గాలతో సమగ్రంగా చర్చించిన అనంతరమే ప్రభుత్వ వైఖరిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేరళ న్యాయ శాఖ మంత్రి పి.రాజీవ్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారంం. కనుక దీనిపై అవును, కాదు అని ఇప్పటికిప్పుడు స్పష్టమైన వైఖరికి రావడం సులువు కాదు. హిందూ మత విశ్వాసాలపై లోతైన అవగాహన ఉన్న నిపుణులతో దీనిపై కమిటీ వేయాలని గత అఫిడవిట్లో మేం పేర్కొన్నాం కూడా’’అన్నారు. అయితే ఈ విషయంలో మత విశ్వాసాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. కేరళలో సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో, శబరిమల వివాదంపై ప్రభుత్వం, పార్టీ ఏక వైఖరితో ఉండాల్సిన అవసరం లేదని సీపీఎం పేర్కొంది. ప్రభుత్వ వైఖరి మారాలి రుతుక్రమంలో ఉన్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు వీల్లేదని కేరళకు చెందిన రెండు ప్రధాన హిందూ కుల సంస్థలు నాయర్ సరీ్వస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్), శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎన్ఎన్డీపీ) యోగం పునరుద్ఘాటించాయి. ఈ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని అవి స్పష్టం చేశాయి. -
మానవత్వం లేని చట్టంతో అరాచకమే
పణాజి: మానవత్వం ప్రతిబింబించని చట్టంతో అరాచకమే ప్రబలుతుందని, అదే సమయంలో చట్టంలేని మానవత్వం నిరంకుశానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. ‘చట్టం ఒక సజీవ వ్యవస్థ. అది నిలకడకు, మార్పునకు సమతుల్యతను పాటించాలి. చట్టం మార్పును అడ్డుకోరాదు. అదే సమయంలో, సరైన ఆలోచన లేకుండా కేవలం కొత్తదనం కోసం దేనినీ గుడ్డిగా స్వీకరించకూడదు. లేదంటే నైతిక స్థానాన్ని కోల్పోతుంది’అని ఆయన అభిప్రాయపడ్డారు. మార్పును ఆకళింపు చేసుకోలేని చట్టం శుద్ధంగా ఉండజాలదన్నారు. ఆదివారం ఆయన గోవాలో ఇంటర్నేషనల్ లీగల్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంతోపాటు గోవా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డ్రగ్స్ వ్యసనంపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి చట్ట వ్యవస్థ కూడా శతాబ్దాల తరబడి జరిగిన పోరాటాలు, చర్చలు, రాజీలు, నైతిక ధైర్యం నుంచి అందిన ఒక వారసత్వంగా ఆయన అభివరి్ణంచారు. వారసత్వంగా అందుతూ, అనేక పరీక్షలకు తట్టుకుని నిలబడిన న్యాయ వ్యవస్థకు తాము యజమానులం కాదు, కేవలం తాత్కాలిక సంరక్షకులం మాత్రమే అనే విషయం తన మదిలో ఎప్పుడూ మెదులుతూ ఉంటుందన్నారు. ‘మాదక ద్రవ్యాల వాడకం కేవలం నేరం మాత్రమే కాదు, అది ఒక సామాజిక, మానసిక, వైద్యపరమైన సమస్యగా గుర్తించాలి. అవగాహన ద్వారానే ఇది పరిష్కారం కావాలే తప్ప, శిక్షలు హెచ్చరికల ద్వారా కాదు’అని సీజేఐ అన్నారు. ‘డ్రగ్స్ వ్యసనం నిశ్శబ్దంగా మన ఇళ్లలోకి, తరగతి గదుల్లోకి, సమాజంలోకి ప్రవేశించి, భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇది కేవలం వ్యక్తులనే కాదు, సమాజాన్నే పాడు చేస్తుంది’అని ఆయన హెచ్చరించారు. -
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్‌కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.పూర్వాపరాలు ఇవేప్రైవేట్ సంస్థ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు.టీమిండియా అనకూడదుప్రసార్ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్ కన్సాల్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.మీ సమస్య ఏమిటి?ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్‌లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్‌ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
ఇంకెంత ఎండబెడతారు?
న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని ప్రఖ్యాత సుఖ్నా చెరువు దుస్థితిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వెలిబుచ్చారు. ‘సుఖ్నా లేక్ కో ఔర్ కిత్నా సుఖావొగే? (ఆ చెరువును ఇంకెంత ఎండబెడతారు?)’ అంటూ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ మాఫియా ఆ చెరువును చెరబట్టిందంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. నేతలు, అధికారులు కూడా వారితో చేతులు కలిపి చెరువును సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుఖ్నా చెరువుకు సంబంధించి 1995 నుంచి పెండింగ్లోలో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన సీజేఐ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అడవులు, చెరువులకు సంబంధించిన కేసులు హైకోర్టులకు వెళ్లకుండా నేరుగా ఇలా సుప్రీం గడప తొక్కుతుండటం ఏమిటంటూ విస్మయం వెలిబుచ్చింది. -
స్వార్థం కోసం మౌలిక వసతులను అడ్డుకోవద్దు
గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ జ్యుడీషియల్ కోర్ట్ కాంప్లెక్స్‌ను గౌహతి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ కోర్ట్ కాంప్లెక్స్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..మౌలిక సదుపా యాల కల్పనను వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది అందరికీ మేలు చేస్తుందని, కేవలం కొందరి సౌలభ్యం కోసం ఆధునీకరణను ఆపకూడదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలియకనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. గౌహతిలోని రంగమహల్‌లో రూపుదిద్దుకునే ఈ సముదాయం భవిష్యత్తు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇందులో అత్యాధునిక సాంకేతికత, ఈ–కోర్టులు, లాయర్లు, కక్షిదారుల కోసం మెరుగైన వసతులు ఉంటాయని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయాధికారిగా, ఈ వృత్తిలోకి కొత్తగా వస్తున్న యువ న్యాయవాదుల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని జస్టిస్ సూర్య కాంత్ నొక్కి చెప్పారు. యువ లాయర్లు సమర్థంగా పనిచేయడానికి మెరుగైన లైబ్రరీలు, ఇంటర్నెట్ సదుపాయం, అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కర్తవ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతోపాటు సీఎం హిమంత బిశ్వ శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌహతి నగరం నడిబొడ్డున ఉన్న హైకోర్టును 25 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతానికి తరలించడాన్ని బార్ కౌన్సిల్ వ్యతిరేకిస్తోంది.కాంప్లెక్స్ ప్రత్యేకతలుఅస్సాంలోని గౌహతి ఉత్తర ప్రాంత కామ్ రూప్ జిల్లాలో 49 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశలో రూ.479 కోట్ల ఈ సముదాయం ఏర్పాటు కానుంది. ఇందులో, గౌహతి హైకోర్టుతోపాటు జిల్లా కోర్టు భవనాలు, హైకోర్టు కార్యాలయం, బార్ అసోసియేషన్ భవనం ఉంటాయి. గౌహతి హైకోర్టు అస్సాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగా ల్యాండ్లకు కూడా హైకో ర్టుగా పనిచేస్తుంది. ఈ సముదాయంలో 900 వరకు కార్లు, 400 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ వసతి ఉంది. సముదాయంలోని అన్ని భవనాలను కలుపుతూ వంతెనలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. -
మధ్యవర్తిత్వమే మార్గం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాలతో కంటే.. సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం మేలని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రెండు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం జస్టిస్ జాయ్‌మాల్యా బగ్చితో కూడిన సీజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఏపీ తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఇతర న్యాయవాదులు వాదనలు విన్పించారు. మా నీటిని తరలించుకుపోయే కుట్ర: తెలంగాణ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గోదావరి బేసిన్లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా ఉంది. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా ఏపీ 200 టీఎంసీలను మళ్లిస్తే తెలంగాణ వాటాకు గండి పడుతుంది. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటిని తరలించుకుపోయే కుట్ర ఇది. ఈ ప్రాజెక్టును ఆపాలని ఆదేశించాలి. అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా ఏపీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పోలవరం నుంచి అక్రమంగా 200 టీఎంసీల వరద నీటిని మళ్లించేందుకు వీలుగా టెండర్లు పిలిచింది. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా, కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆమోదం పొందకుండానే ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ చైర్మన్ నేతత్వంలో వేసిన కమిటీకి ప్రాజెక్టు పనులను ఆపే అధికారం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం నియమించిన కమిటీ నివేదిక వచ్చేంత వరకైనా పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోయింది..నీళ్లు కూడా వద్దా?: ఏపీ ముకుల్ రోహత్గీతో పాటు సీనియర్ న్యాయవాదులు బల్బీర్ సింగ్, జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. ‘పోలవరం–నల్లమల సాగర్ విషయంలో ఏపీ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రస్తుతం ప్లానింగ్ దశలోనే ఉన్నాం. ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్), డీపీఆర్ తయారీ కోసమే సర్వేలు, టెండర్ల ప్రక్రియ చేపట్టాం. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేయడం లేదు. గోదావరి నుంచి సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని కరువు ప్రాంతమైన రాయలసీమకు అందించాలన్నదే ఏపీ ఉద్దేశం. ఇది ఆ రాష్ట్ర అంతర్గత అవసరాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు..’ అని వెల్లడించారు. రోహత్గీ వాదిస్తూ.. ’ఇప్పటికే రాష్ట్ర విభజనలో ఏపీ నుంచి హైదరాబాద్‌ను తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లు కూడా వాడుకోకూడదా?..’ అని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ద్వారా ఈ జాతీయ ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి తెలిపినట్టేనని బల్బీర్ సింగ్ అన్నారు. తెలంగాణ పిటిషన్ దురుద్దేశపూర్వకమైనదని జైదీప్ గుప్తా చెప్పారు. ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు కానీ..: సీజేఐ వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ప్రాజెక్టు నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న వాదనలపై స్పందిస్తూ.. ’ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉండొచ్చు. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే.. ప్లానింగ్, డాక్యుమెంటేషన్ కోసం ఖర్చు చేసిన ప్రజల నిధులు వృధా అవుతాయి కదా?’ అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ విచారణార్హతను పరిశీలిస్తున్నామని చెప్పారు. మూడు పరిష్కార మార్గాలు ఈ కేసులో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మూడు ప్రధాన పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ‘మొదటి మార్గంగా.. ఇది రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన జల వివాదం కాబట్టి, ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం ‘సివిల్ సూట్’గా దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుంది. రెండవ మార్గంలో.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదంపై ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసినందున, ఆ కమిటీకి.. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే (స్టే ఇచ్చే) ‘నిర్ణయాధికారాన్ని’ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన మూడవ మార్గంగా.. కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా, ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చుని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు..’ అని చెప్పారు. ఈ ప్రతిపాదనలపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం కావాలని తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ కోరడంతో.. ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది. -
పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌పై మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి అంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సూచించారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. ఈ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌కు సంబంధించి మూడు పరిష్కారాలను సుప్రీంకోర్టు సూచించింది.1. సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయమని సూచన 2. కేంద్ర ప్రభుత్వ కమిటీకి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని ఇస్తాం.3. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుని అవకాశం ఇచ్చారు.జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..అంతకుముందు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది కదా?. ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్‌కి ఏపీ నిధులే వృధా అవుతాయి కదా?. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నాం. సివిల్ సూట్ ఫైల్ చేస్తేనే సమగ్రంగా విచారణ జరపవచ్చు. ప్రాజెక్టు ఆపాలన్న మీ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించేలా చూడమని ఆదేశాలు ఇస్తాం. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అని అన్నారు.ఏకపక్షంగా నిర్మాణం..అనంతరం, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ..‘వరద జలాల పేరుతో మాకు కేటాయించిన నీటి వాటాను తరలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుపై వెంటనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలి. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉంది. పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టుతో మా వాటా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రాజెక్టును ఆపే అధికారం లేదు. సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు.రాష్ట్ర ప్రాజెక్ట్ మాత్రమే.. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ..‘పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టులో మేము నిబంధనలు ఉల్లంఘించలేదు. కేవలం మేము ప్లాన్ రెడీ చేసుకుంటున్నాం. సముద్ర జలాలు వృథా అవుతున్నాయి. వాటిని రాయలసీమకి అందించాలనుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రాజెక్టు మాత్రమే జాతీయ ప్రాజెక్టు కాదు. మా రాష్ట్ర అవసరాలపైన ప్లానింగ్ చేసుకునే అధికారం ఉంది. మేము పీఎఫ్ఆర్, డీపీఆర్‌లను తయారు చేస్తున్నాము అని తెలిపారు.ఈ క్రమంలో సుప్రీంకోర్టు సూచించిన పరిష్కారాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీ కోరారు. అనంతరం, కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా చేశారు. -
అవసరంలో ఉన్నవారికి న్యాయం అందాలి
పట్నా: న్యాయ వ్యవస్థలో సహానుభూతి అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయం కోరి వచ్చినవారి పట్ల దయతో మెలగాలని అన్నారు. సమాజం మెరుగుపడాలంటే అవసరంలో ఉన్నవారికి కచ్చితంగా న్యాయం అందాలని స్పష్టంచేశారు. అవసరార్థుల పట్ల న్యాయ వ్యవస్థ మొగ్గుచూపాలని సూచించారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలోని చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. యువ న్యాయవాదులు కెరీర్‌ను నిర్మించుకొనే క్రమంలో సున్నితత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవద్దని పేర్కొ న్నారు. పూర్తిగా పనికి బానిసగా మారితేనే వృత్తిలో విజయం సాధిస్తామని చాలామంది యువ లాయర్లు నమ్ముతుంటారని తెలిపారు. చేసే పనే జీవితంగా మారిపోతే ఇతరుల సహానుభూతిని కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. న్యాయం కోసం వచ్చిన కక్షిదారులకు దయతో సేవ చేయడమే పరిమావధి కావాలని న్యాయ వాదులకు కావాలని జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు. న్యాయం చేకూర్చడం పవిత్రమైన బాధ్యత ‘‘న్యాయం అనేది న్యాయాన్ని పొందగలిగే ఆర్థిక స్థోమత ఉన్నవారికి మాత్రమే కాకుండా.. న్యాయం తప్పనిసరిగా అవసరమైన వారికి కూడా సులువుగా అందాలి. కక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి న్యాయవాదులు తమ శక్తియుక్తులు, నైపుణ్యాలు ఉపయోగించాలి. అదొక పవిత్రమైన బాధ్యత. ఇక్కడ నేర్చుకున్న న్యాయశాస్త్రాన్ని ప్రజలు మేలు చేసేలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సమాజంలో పేద, అణగారిన వర్గాలకు కొన్ని సందర్భాల్లో న్యాయం దక్కడం లేదు. అలాంటివారి కోసం న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఎవరికి న్యాయం అవసరమో వారికి న్యాయం అందించడం కర్తవ్యం కావాలి. లిటిగేషన్, ప్రజాసేవ, విద్యా రంగం, జ్యుడీషియల్ సర్వీసు.. ఇలా ఏ మార్గంలో నడిచినా సరే న్యాయ వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రజల్లో విశ్వాసం పెంచేలా చిత్తశుద్ధితో పని చేయాలి. గొంతు విప్పలేని అసహా యకులకు గొంతుకగా మారడానికి నైపు ణ్యాలు ఉపయోగిస్తే వారి గౌరవాన్ని కూడా పెంచినట్లు అవుతుంది. చదుకున్న చదు వుకు సార్థకత లభిస్తుంది’’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పట్నా హైకోర్టు ప్రాంగణంలో ఏడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు జస్టిస్సూర్యకాంత్ పునాది రాయి వేశారు. ఇందులో ఆడిటోరియం, ఐటీ బిల్డింగ్, పరిపాలన భవనం, బహుళ అంతస్తుల కారు పార్కింగ్, ఆసుపత్రి వంటివి ఉన్నాయి.సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలి దేశంలో సైబర్‌నేరాలు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు కోట్ల రూపాయలు పోగోట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ శనివారం పట్నా శివారులోని పొతాహీలో బిహార్ జ్యుడీషియల్ అకాడమీ నూతన క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిజిటల్ అరెస్టు గురించి గతంలో ఎప్పుడూ వినలేదని, ప్రస్తుతం అలాంటి చూడాల్సి వస్తోందని అన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరించి, సొమ్ము లూటీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ ఎదుట ఉన్న అతిపెద్ద సవాలు ఇదేనని పేర్కొన్నారు. సైబర్ నేరాల కారణంగా మన దేశంలో జనం వేలాది కోట్ల రూపాయలు కోల్పోవడం తనకు షాక్‌కు గురి చేసిందని చెప్పారు. వృద్ధులకు సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఆధునిక కాలంలో కొత్త కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి, సైబర్ నేరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు నైపుణ్యాలు పెంచుకోవాలని, అందుకోసం శిక్షణ పొందాలని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయని, అందుకు తగ్గట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. -
ఆ టోల్‌ప్లాజాలను మూసేయండి
న్యూఢిల్లీ: టోల్‌ఫీజు కట్టేందుకు తరచూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిల్చిపోతుండటం, వందల వాహనాల నుంచి ఒకేచోట వెలువడుతున్న పొగ, కాలుష్యం కారణంగా ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో కాలుష్యఛాంబర్లుగా తయారైన 9 టోల్‌ప్లాజాలను తక్షణం తాత్కాలికంగానైనా మూసేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. లేదంటే కనీసం ఢిల్లీ–ఎన్సీఆర్ నుంచి సుదూరాలకు తరలించాలని జాతీయరహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ), మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లకు సుప్రీంకోర్టు బుధవారం సూచించింది. వారంలోపు మీ నిర్ణయం తెలపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంఛోలీల ధర్మాసనం ఆదేశించింది. టోల్‌ప్లాజాల తాత్కాలిక మూసివేత లేదా వేరే చోట ఏర్పాటు ద్వారా హస్తిన సరిహద్దుల్లో తీవ్ర వాయుకాలుష్యానికి కళ్లెం వేయొ చ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘చలికాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడం అనేది ఒక వార్షిక తంతుగా తయారైంది. వాయుకాలుష్యానికి ఇకనైనా చెక్‌పెట్టేలే చర్యలు తీసుకోండి. భారత్ స్టేజ్–4 స్థాయిలో తక్కువ ఉద్గారాలను వెదజల్లని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆగ స్ట్ 12న మేం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తాం. ఇక నర్సరీ నుంచి ఐదో తరగతి చిన్నారులు నేరుగా పాఠశాలకు రావొద్దంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోబోం. ఎందుకంటే త్వరలోనే చిన్నారులకు శీతాకాల సెలవు రాబోతున్నాయి. అప్పుడెలాగు పిల్లలు పాఠశాలకు రారు. ఆమాత్రందానికి మేం జోక్యం చేసుకోవడం అనవసరం’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంసీడీకి పరిహారం ఇవ్వండి ‘‘ఢిల్లీలోకి ఎంట్రీ పాయింట్లుగా మారిన ఈ 9 టోల్‌బూత్‌లు ప్రస్తుతం ఎంసీడీ నిర్వహిస్తోంది. వీటిని తాత్కాలికంగా మూసేయండి. మూసివేత కారణంగా ఎంసీడీ చవిచూసే నష్టాలను ఎన్హెచ్ఏఐ భర్తీచేయొచ్చేమో యోచించండి. తాత్కాలికంగా ఆదాయం కోల్పోయేందుకు ఎంసీడీ సిద్ధపడాలి. ఆ మేరకు తోడ్పాటునందించేలా ఎంసీడీ ముందుకురావాలి. ఈ విషయంలో ఎంసీడీ తన నిర్ణయాన్ని వారంలోపు తెలుపుతూ నివేదికను మా ముందు ఉంచండి’’అని ఎంసీడీని ధర్మాసనం ఆదేశించింది. కన్నాట్ ప్లేస్‌లోనూ పెట్టేస్తారా? కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఒకింత అసహనంవ్యక్తంచేశారు. ‘‘గురుగ్రామ్ సరిహద్దులోని ఒక టోల్‌ప్లాజా వద్ద గంటల తరబడివాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వందల వాహనాల నుంచి దట్టమైన పొగ ఒకేచోట పరుచుకుంటోంది. జనవరిదాకా టోల్‌ప్లాజాను తీసేస్తామని అధికారులు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు?. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోనూ టోల్‌ప్లాజా కట్టేస్తారు. ఎందుకంటే మీకు టోల్‌ప్లాజా నగదు వసూళ్లు మాత్రమే ముఖ్యంకదా? టోల్గేట్లు ఆదాయాన్ని కళ్లజూపిస్తాయేమో అంతకంటే ఎక్కువగా కాలుష్యాన్నీ తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో మీరు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో రండి. జనవరి 31వ తేదీదాకా టోల్‌ప్లాజా ఉండబోదని ధీమాగా చెప్పగలిగేలా ఒక ప్లాన్‌తో రండి’’అని మున్సిపల్ కార్పొరేషన్‌కు సీజేఐ సూచించారు. -
దేవుడిని విశ్రాంతి కూడా తీసుకోనివ్వరా..?
న్యూఢిల్లీ: ఆలయాల్లో ధనవంతులిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి దేవుడి విశ్రాంతి వేళలోనూ ప్రత్యేక పూజలకు అనుమతించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి విశ్రాంతికి అంతరాయం కల్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బృందావన్‌లోని ప్రఖ్యాత బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళలతోపాటు సంప్రదాయాల్లో తీసుకువచ్చిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు స్పందించింది. బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారని, దెహ్రి పూజ వంటి పలు ముఖ్యమైన మతాచారాలను నిలిపివేశారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, తన్వి దుబేలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ‘సంప్రదాయం, వేడుకల్లో దర్శన వేళలు కూడా ఒక భాగం. భక్తుల దర్శనాల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచడం ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. ఆలయ వేళలను మార్చితే, లోపల జరిగే పూజలు, వేడుకల వేళలు కూడా మారుతాయి. తదనుగుణంగా దేవుడి ఉదయం మేల్కొనే వేళ, రాత్రి నిద్రించే వేళలూ మారుతాయి. ఇలా జరగరాదు. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని, పవిత్రతను తుచ తప్పక అనుసరించాలి’అని ఈ సందర్భంగా దివాన్ వాదించారు. సెపె్టంబర్లో జారీ అయిన ఆఫీసు మెమోరాండం ప్రకారం ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా సంప్రదాయాల్లో మార్పులు తెచ్చారని ఆయన తెలిపారు. ఆలయంలో దర్శన వేళలు పూర్తయ్యాక, ఒక ప్రత్యేక ప్రదేశంలో చేపట్టే దెహ్రి పూజను సైతం రద్దీని నివారించేందుకంటూ రద్దు చేస్తూ తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టారని పిటిషనర్లు తెలిపారు. గురు–శిష్య పరంపరలో భాగంగా గోస్వామీలు మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని జరపాల్సి ఉంటుందన్నారు. ఈ వాదలనపై సీజేఐ సూర్యకాంత్ మౌఖికంగా.. ‘బంకీ బిహారీ జీ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని నామమాత్రంగా మూసివేస్తున్నారు. అయితే, ఆ వెంటనే దేవుడికి ఒక్క సెకను కాలం కూడా విశ్రాంతినివ్వకుండా, ఇతర విషయాల మాదిరిగానే దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపే ధనవంతుల కోసం ప్రత్యేక పూజలకు అనుమతిస్తున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమాధానమివ్వాలని ఆలయ నిర్వహణ కమిటీతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. వాస్తవానికి ఈ ఆలయంలో వేడుకలు, పూజలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ 1939 నాటి నిబంధనల ప్రకారం జరుగుతోంది. అయితే, 2025లో తీసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ శ్రీ బంకీ బిహారీ జీ ఆలయ ట్రస్ట్ ఆర్డినెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశ మేర్పడింది. తద్వారా అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్ట్‌లో దాఖలైన పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టుకే విడిచిపెట్టింది. అదే సమయంలో, హైకోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఆర్డినెన్స్‌పై స్టే విధించింది. ఆలయ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ సారథ్యంలో కమిటీని నియమించింది. -
తీర్పును టెక్నాలజీ మెరుగుపర్చగలగాలి
కటక్(ఒడిశా): నూతన సాంకేతికత అనేది న్యాయస్థానాల తీర్పును మరింత మెరుగుపర్చాలిగానీ తీర్పును అధిగమించేదిగా ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. పెండింగ్ కేసుల భారం దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు న్యాయ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోనూ ఇబ్బందులను సృష్టిస్తున్నాయన్నారు. పైస్థాయిలో తలెత్తిన అడ్డంకులు దిగువ స్థాయిపై ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయని చెప్పారు. పెండింగ్ సమస్యను అధిగమించేందుకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సీజేఐ తెలిపారు. అవసరానికి తగినన్ని న్యాయస్థానాలు లేకుంటే, ఎంత చిత్తశుద్ధి కలిగిన న్యాయవ్యవస్థ అయినా కుప్పకూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతతో ఎన్నో సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ దు్రష్పభావాలు కూడా ఉన్న విషయం మరువరాదన్నారు. నేటి డీప్ ఫేక్‌లు, డిజిటల్ అరెస్ట్‌ల కాలంలో న్యాయస్థానాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పేదలు, వృద్ధులను పట్టించుకోని సంస్కరణ అస్సలు సంస్కరణే కాదు, అది తిరోగమనం కూడా అని తెలిపారు. -
జస్టిస్ సూర్యకాంత్ అనే నేను..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీ భాషలో భగవంతుడి పేరిట ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన అక్కడే ఉన్న తన సోదరితోపాటు సోదరుడి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌ని ఆతీ్మయంగా ఆలింగనం చేసుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్తోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ సూర్యకాంత్ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి భూ టాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక, బ్రెజిల్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావడం విశేషం. ప్రధాని మోదీ అభినందనలు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్, మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ కలిసి ఫొటో దిగారు. కొలీజియం చీఫ్‌గా జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇకపై సుప్రీంకోర్టు కొలీజియం అధినేతగానూ వ్యవహరించబోతున్నారు. ఇన్నాళ్లూ ఈ పదవిలో ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో పూర్తయ్యింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ సహా మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కొలీజియంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎంఎం సుందరేశ్ సభ్యులు.సీజేఐల గురించి ఐదు విశేషాలు!భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 52 మంది ప్రధాన న్యాయమూర్తులు ఈ దేశ న్యాయవ్యవస్థ కాపు కాసినవారే. అయితే మనలో చాలామందికి గత సీజేఐల విశేషాలు తెలిసింది తక్కువే. మహిళ న్యాయమూర్తి ఇప్పటివరకూ ఈ అత్యున్నత పదవిని చేపట్టకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇది 62 ఏళ్లు మాత్రమే. సుప్రీంకోర్టు సీజేఐకి మాస్టర్ ఆఫ్ ద రోస్టర్‌గా పేరు. ఏ న్యాయమూర్తి ఏ రకమైన కేసుల విచారణ చేపడతారన్న విషయంపై సీజేఐదే తుది నిర్ణయం. అధికారిక హోదాల ప్రకారం... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతుల తరువాతి స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులది. ఇలాంటివే మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి.1. జస్టిస్ హరిలాల్ జెకిసన్‌దాస్ కానియాదేశ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటు తరువాత నియమితులయ్యారు.2. జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. 2007-2010 మధ్యకాలంలో పనిచేశారు.3. జస్టిస్ బి.ఆర్.గవాయి52వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. బౌద్ధ మతాన్ని అనుసరించిన తొలి సీజేఐ. ఈ అత్యున్నత పదవిని అధిష్టించిన రెండో దళితుడు కూడా.4.జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్1978 - 19875 మధ్య దేశ అత్యున్నత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏడేళ్లకాలం ఈ పదవిలో ఉన్న తొలి జస్టిస్.5. జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్1991లో కేవలం పదిహేడు రోజులు మాత్రమే సీజేఐగా పనిచేశారు. అతితక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా ఇదో రికార్డు. -
53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టబోతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపరి సీజేఐగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సంబంధించిన డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 15 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో రా ష్ట్రపతి ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌ను సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ సూర్యకాంత్‌కు అభినందనలు తెలియజేశారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లా పెటా్వర్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జని్మంచారు. 1981లో హిసార్‌లోని ప్రభుత్వ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ లా అభ్యసించారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్ ఆఫ్ లా’లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 2000 జూలై 7 నుంచి 2004 జనవరి 8 దాకా హరియాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. 2004 జనవరి 9 నుంచి 2018 అక్టోబర్ 4 దాకా పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2018 అక్టోబర్ 5 నుంచి 2019 మే 23 దాకా హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆరేళ్లుగా సుప్రీంకోర్టులో సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరం కంటే ముందే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జస్టిస్ సూర్యకాంత్ 2011లో మాస్టర్ ఆఫ్ లా పూర్తిచేయడం విశేషం.కీలక తీర్పుల్లో భాగస్వామి సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం కూడా ఉంది. పలు ధర్మాసనాల్లో ఆయన పనిచేశారు. జమ్మూకశీ్మర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటి కీలక అంశాల్లో ఆయన తీర్పులిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ తీర్పు ఇచి్చన బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడే. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా ఇతర బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించి చరిత్ర సృష్టించారు. రక్షణ దళాల్లో వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకాన్ని సమరి్థంచారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో సభ్యుడిగా పనిచేశారు. జాతీయ భద్రత పేరిట ప్రముఖుల గోప్యతకు భంగం కలిగించడం సరైంది కాదని తేలి్చచెప్పారు. 2022లో మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా పరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్న ధర్మాసనం విచారించింది. -
53వ సీజేఐగా ఆయనే!
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ఎంపిక కానున్నారు. సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(BR Gavai) కేంద్రానికి ప్రతిపాదన పంపారు. అన్నీ సక్రమంగా జరిగితే నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్య కాంత్ భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.52వ ప్రధాన న్యాయమూర్తి అయిన బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. జస్టిస్ సూర్యకాంత్ గతంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చారు, ముఖ్యంగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP) పథకాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది.సూర్యకాంత్.. 1962 ఫిబ్రవరి 10వ తేదీన జన్మించారు. హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1984లో న్యాయవాదిగా హర్యానా & పంజాబ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా.. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. NALSA (National Legal Services Authority) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఇటీవల ఈయన నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున.. ప్రస్తుత CJI జస్టిస్ బీఆర్ గవాయి పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. సీజేఐగా సూర్యకాంత్ పదవీ కాలం 2027 ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనుంది.


