కూటమి పాలనలో అప్పు రోజుగా ‘మంగళవారం’: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇదే సమయంలో బీసీలుకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని చెప్పారు. రాజ్యసభ పదవుల్లో బీసీలకు అవకాశం ఇచ్చారని తెలిపారు.మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు వైఎస్సార్సీపీ నేతలు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘వెనుక బడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారు. బీసీలకు సముచితమైన మార్గం చూపించారు. అలాగే, బీసీలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవుల్లో అగ్రస్థానం కల్పించారు. రాజ్య సభ పదవుల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించారు.పేద వానికి సంక్షేమాన్ని కూటమి పాలన దూరం చేసింది. కూటమి పాలనలో మంగళవారం అప్పు రోజుగా మారింది. ఆరు నెలల పాలనలో 60 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో 2.5 లక్షల వాలంటీర్లను తొలగించారు. చంద్రబాబు తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అతీగతీ లేదు. ఒక్క హామీని కూడా ఆరు నెలల కాలంలో నిలబెట్టుకోలేదు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాల ఉసే లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.