Jyothi Reddy
-
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హర ఓం హర’
కనిక, ఆమని, రవిశర్మ, జ్యోతిరెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హర ఓం హర’. షేర్ దర్శకత్వంలో దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మించారు. ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసిన సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మంచి విజయం సాధించాలి. దర్శకుడు షేర్ కెరీర్ ఈ చిత్రంతో మరో స్థాయికి వెళ్లాలి’’ అన్నారు. ‘‘మాది సినిమా కుటుంబం కాకపోవడంతో కెరీర్ స్టార్టింగ్‌లో కష్టాలు పడ్డాను. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర కూడా చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు షేర్. ఈ సినిమాలో జబర్దస్త్ రాకేష్, జబర్దస్త్ కట్టప్ప, వైజాగ్ షరీఫ్, షెల్జా, నేహా బెన్, సంగీత, విలన్‌గా ప్రకాష్ నాగ్, షేర్ వంటి వారు నటిస్తున్నారు. -
చదువులో గోల్డ్ మెడలిస్ట్.. ఈ నటి మాజీ సీఎం మనవరాలని తెలుసా?
బుల్లితెరపై 30 ఏళ్లకు పైగా రాణిస్తున్న గొప్ప నటీమణి జ్యోతి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలే జ్యోతి. తొమ్మిదవ ఏటనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఇప్పటికీ నటిగా రాణిస్తుండటం విశేషం. ఎక్కువగా నెగెటివ్ పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. కుటుంబానికి ఎంతో విలువిచ్చే ఆమె అమ్మానాన్న, భర్త, పిల్లల గుర్తుగా చేతినిండా పచ్చబొట్లు వేయించుకుంది. తాజాగా జ్యోతి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నేను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలిని. చదువులో నేను ముందుడేదాన్ని. డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్.. వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సంపాదించాను. నాకు ఉద్యోగం చేయాలని ఉండేది. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు తమ ప్రాజెక్టుల్లో నటించమని వారి పీఏలను మా ఇంటికి పంపించేవారు. అది చూసి మా అమ్మ అంత గొప్పవాళ్లు నటించమని అడిగితే వద్దంటావేంటని బ్రెయిన్‌వాష్ చేసింది. తన వల్లే యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాను. ఇప్పటికీ కొనసాగుతున్నాను. షూటింగ్ లొకేషన్లో ఉన్నంతవరకు అందరూ మంచి ఫ్రెండ్సే. కానీ ఇంటికెళ్లిపోయాక ఎవరితోనూ టచ్‌లో ఉండను. ఓ సంఘటన నాకు బాగా గుర్తుంది. అప్పుడు నాకు మూడేళ్లుంటాయి. ఇంటి గడప మీద కూర్చుని పడుకున్నాను. అమ్మ బిందెడు నీళ్లు నా మీద గుమ్మరించింది. అప్పటినుంచి అమ్మ పిలవకముందే నిద్ర లేచేదాన్ని. కాలేజీకి లేట్ అవుతుంది, షూటింగ్‌కు లేటవుతుంది.. అని ఏనాడూ అమ్మతో అనిపించుకోలేదు. అంత క్రమశిక్షణగా ఉంటాను. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఇద్దరబ్బాయిలు. వాళ్లను అమ్మ చూసుకుంటుంది' అని చెప్పుకొచ్చింది జ్యోతి రెడ్డి. -
లక్ష మొక్కల నోము
‘రోజూ ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత నువ్వు ఒక గ్లాసు నీళ్లు తాగు, ఒక గ్లాసు మొక్కకు తాగించు’ ఈ మాట పిల్లల మెదళ్ల మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో... ఆ మాట చెప్పినప్పుడు ఊహించలేం. కానీ పిల్లలు తప్పకుండా ప్రభావితం అయి తీరుతారు. ‘నువ్వు నాటేది ఒక్క మొక్క అయినా చాలు, దానిని బతికించి తీరాలి’ అని చెబితే పిల్లలు చాలెంజ్‌గా తీసుకుని తీరతారు. తోటి పిల్లల మొక్కల కంటే తన మొక్కను ఇంకా బాగా పెంచాలని తాపత్రయపడతారు. పిల్లలను ఈ రకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి స్వయంగా మొక్కలు నాటుతుంటే, నాటిన మొక్కల బాగోగులు స్వయంగా పట్టించుకుంటూ ఉంటే పిల్లలు రోల్‌మోడల్‌గా తీసుకోకుండా ఉంటారా? అలా పిల్లలకు మొక్కల రోల్ మోడల్‌గా మారారు బొల్లంపల్లి జ్యోతిరెడ్డి. పదివేలకు పైగా మొక్కలు నాటి పుడమిని పచ్చగా మార్చడంలో తనవంతు భాగస్వామ్యం అందిస్తున్న ఈ పర్యావరణ కార్యకర్త సాక్షితో పంచుకున్న అనుభవాలివి. బొల్లంపల్లి జ్యోతిరెడ్డి పూర్వీకులది రంగారెడ్డి జిల్లా పడకల్. యాభై ఐదేళ్ల కిందట తాతగారు హైదరాబాద్ ఓల్డ్‌సిటీకి వచ్చి స్థిరపడడంతో జ్యోతిరెడ్డి తన పుట్టిల్లు ‘పాతబస్తీ’ అంటారు. పర్యావరణ కార్యకర్తగా మారడానికి ముందు తన జీవితాన్ని క్లుప్తంగా వివరించారామె. ‘‘పుట్టింది, పెరిగింది హైదరాబాద్ పాతబస్తీలో. అక్కడి ఆర్య హైస్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత మలక్‌పేటలోని శ్రీవాణి కాలేజ్. ఇంటర్ తర్వాత పెళ్లి, మెడిసిన్‌లో సీటు వచ్చింది. కానీ కుటుంబ బాధ్యతల రీత్యా సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను. ముగ్గురు పిల్లలతో రామంతపూర్‌లో అత్తగారింట్లో గృహిణిగా జీవితం సాఫీగానే సాగుతూ ఉండేది. కానీ ఏదో వెలితి మాత్రం ఉండేది. అయితే మనిషిని సామాజిక జీవిగా మలచడంలో నేను చదువుకున్న ఆర్య స్కూల్‌ది చాలా కీలకమైన పాత్ర. నా సోషల్ యాక్టివిటీస్‌కి మూలం కూడా అదే. మేము ఉప్పల్‌కి మారాం. అక్కడ కూడా కాలనీలో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేయడం, క్రాఫ్ట్ క్లాసులు నిర్వహించడం వంటి ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నమయ్యేదాన్ని. వీటితోపాటు బ్యూటీపార్లర్లు నిర్వహిస్తూ కొంతకాలం నన్ను నేను బిజీగా ఉంచుకున్నాను. అప్పుడు ఉప్పల్ మెయిన్‌రోడ్ పొల్యూషన్ ఎంత తీవ్రంగా ఉందనేది నాకు అనుభవంలోకి వచ్చింది.ఒకసారి బయటకు వెళ్తే చాలు వాహనాల కాలుష్యం కారణంగా ముక్కు కారడం, దగ్గు, రకరకాల అలర్జీలు వచ్చేవి. భూమాత ఎదుర్కొంటున్న పరీక్షలు అర్థమయ్యాయి. పచ్చదనం లోపించిన పుడమి చల్లగా ఉండాలంటే ఎలా ఉంటుంది? అనిపించింది. నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటున్నాను, ఆ చేసే పని భూమాతకు పనికి వచ్చేదే అయితే బావుంటుంది కదా... అనుకున్నాను. అలా రూపుదిద్దుకున్నదే ‘గ్రీన్ ఇండియన్ సొసైటీ’ నారు... నీరు! ‘మొక్కలు నాటడం’ అనే మాట వినగానే ‘మరి వాటిని బతికించడం?’ అనే కౌంటర్ కూడా వినిపిస్తుంటుంది. నేను మొక్కలు నాటుతున్నాను, అలాగే వాటిని బతికించే బాధ్యత కూడా తీసుకున్నాను. నేను చేస్తున్నది మొక్కుబడిగా మొక్కలు నాటడం కాదు, బాధ్యతగా పచ్చదనాన్ని పెంపొందించడం. నేను మొక్క నాటుతున్నది భూమాతకు చల్లదనాన్నివ్వడం కోసం, కాబట్టి మొక్కను బతికించి చిగురు తొడిగితే మురిసిపోవడం కూడా నా సంతోషాల్లో భాగమే. అందుకే ఎవరి ఇంటి ముందు నాటుతున్నానో ఆ ఇంటి వాళ్ల నుంచి ‘మొక్కను బతికిస్తాం’ అనే మాట తీసుకుంటాను. పబ్లిక్ ప్రదేశాల్లో నాటే మొక్కలకు మనుషులను పెట్టి నీళ్లు పోయిస్తున్నాను. నా బాధ్యతలో స్కూల్ టీచర్లు బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని స్కూళ్లతోపాటు జిల్లాల్లో విశాలమైన ఆవరణ ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుంటున్నాను. మొక్క నాటి ట్రీ గార్డు పెట్టిన తర్వాత ఆ ట్రీ గార్డుకు నంబరు ఇస్తాం. పెద్ద క్లాసుల పిల్లలకు ఒక్కో చెట్టు బాధ్యత ఒక్కొక్కరికి అప్పగిస్తాం. ఆ మొక్కలు చిగురించినప్పుడు ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తారు టీచర్లు. స్కూళ్లలో మొక్కలు నాటడానికంటే ముందు పిల్లలకు చెట్లు ఎంత అవసరమో, చెట్లు లేకపోతే ఎదురయ్యే పరిణామాలెలా ఉంటాయో... వివరించి చెబుతాను. అలాగే ఇంట్లో మొక్కలు నాటి పెంచమని కూడా చెబుతాను. ‘మనకు దాహమైతే గ్లాసుతో నీళ్లు తీసుకుని తాగుతాం. మొక్కలకు దాహమైతే మరి? అవి కదలలేవు కాబట్టి వాటికి మనమే నీళ్లు తాగించాలి. మీరు అన్నం తినే ముందు మొక్కకు నీళ్లు పోస్తారా లేక నీళ్లు తాగిన తర్వాత మొక్క దాహం తీరుస్తారా? అదేదీ కాకపోతే ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు పోస్తారా? అని పిల్లల డైలీ రొటీన్లో మొక్కకు నీళ్లు పోయడాన్ని ఒక తప్పనిసరి పనిగా చెప్తాను. బాల్యంలో మెదడు మీద పడిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. అందుకే నా గ్రీన్ ఇండియన్ సొసైటీ నిర్మాణానికి బాలయోధులను తయారు చేసుకుంటున్నాను. లక్ష మొక్కలు నాటాలనే నా లక్ష్యసాధనకు బ్రాండ్ అంబాసిడర్లు పిల్లలే అవుతారు’’ అని చెప్పారామె. కరోనా కారణంగా ఆమె మొక్కల నోముకు కొంత విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదలవుతోంది. లక్ష మొక్కల టార్గెట్‌ని చేరే వరకు ఇక విరామం తీసుకునేది లేదంటున్నారు జ్యోతిరెడ్డి. తొలి మొక్క వేప! మొక్కల ఎంపికలో కొన్ని నియమాలు పాటిస్తున్నాను. నిమ్మ, కలబంద, వేప, సపోట, నారింజ, తులసి, యూకలిప్టస్, గన్నేరు మొక్కలు ప్రధానంగా ఉంటాయి. నా తొలి మొక్క వేప. ఆలయాల్లో పండ్లు, పూల మొక్కలు. పబ్లిక్ ప్రదేశాల్లో గాలిని శుద్ధి చేయడమే ప్రధానమైన ఔషధ మొక్కలు, త్వరగా పెరిగే వృక్షజాతులను ఎంచుకుంటున్నాను. మొదట్లో అన్ని మొక్కలనూ నర్సరీ నుంచి కొనేదాన్ని. తర్వాత ప్రభుత్వ అధికారులు సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి కొన్ని రకాల మొక్కలు ఇచ్చి సహకరిస్తున్నారు. – జ్యోతిరెడ్డి, పర్యావరణ కార్యకర్త – వాకా మంజులారెడ్డి -
జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి.. నిద్రమత్తులో..
Junior Artist Jyothi Reddy Death News: రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ స్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి (26) హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన జ్యోతిరెడ్డి.. సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరింది. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్‌నగర్ స్టేషన్లో దిగింది. చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్) వెంటనే తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. అప్పటికే రైలు కదులుతుండటంతో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆందోళన.. చాదర్‌ఘాట్: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతితో మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. షాద్‌నగర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జ్యోతిరెడ్డి తీవ్ర గాయాల పాలైంది. చికిత్స నిమిత్తం ఆమెను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. చదవండి: (Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం) -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతిపై రగడ
Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్‌నగర్ రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
భవిష్యత్ హాకీ స్టార్ జ్యోతిరెడ్డి
హైదరాబాద్: జాతీయ క్రీడ హాకీలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి ఈదుల జ్యోతిరెడ్డి అదరగొడుతోంది. ఆటతో పాటు చదువుల్లోనూ సత్తా చాటుతూ తన ప్రతిభను కనబరుస్తోంది. ఈదుల శివనాగిరెడ్డి, వెంకటలక్ష్మీ దంపతుల కుమార్తె జ్యోతిరెడ్డి చిన్నతనం నుంచే అన్ని రకాల ఆటల్లో ఉత్సాహంతో పాల్గొనేది. ఊహ తెలిసిన నాటి నుంచి హాకీపై మక్కువ పెంచుకున్న ఆమెను కోచ్ రాంబాబు ప్రోత్సహించారు. కోచ్‌తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో జ్యోతి జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. హాకీలో ఆమె ప్రతిభను గుర్తించిన భోపాల్ ‘సాయ్’ ప్రతినిధులు ఆమెను భారత స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో చేర్చుకొని మెరుగైన శిక్షణను అందిస్తున్నారు. హాకీలో ఎదిగిన తీరు... జ్యోతి తల్లిదండ్రులు మూడు దశాబ్దాల క్రితమే కడప నుంచి ఇక్కడికి వలస వచ్చారు. గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో స్థిరపడ్డారు. ఇక్కడే జన్మించిన జ్యోతి పాఠశాల స్థాయి నుంచి హాకీలో రాణించింది. 2012 నుంచి 2014 వరకు రంగారెడ్డి జిల్లా హాకీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె రాష్ట్ర స్థాయిలో ఎన్నో విజయాలను అందించింది. 2015లో రాంచీలో జరిగిన జాతీయ స్థాయి హాకీ టోర్నీలో జ్యోతి తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. 2016లో భోపాల్ ‘సాయ్’ సెంటర్‌కు ఎంపికైన ఆమె ఇప్పటికీ అక్కడే ఉంటూ మెరుగైన శిక్షణను పొందుతోంది. ఇక్కడ శిక్షణ పొందుతోన్న సమయంలోనే సబ్ జూనియర్ స్థాయిలో ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డును అందుకుంది. తర్వాత పలు జాతీయ స్థాయి టోర్నీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె... 2018 భోపాల్‌లో జరిగిన ఆలిండియా రాజమాత సింధియా గోల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరిన జట్టులో సభ్యురాలు కూడా. ఈ ఏడాది జనవరిలో కేరళ వేదికగా జరిగిన జూనియర్ నేషనల్ హాకీ టోర్నీలో పాల్గొన్న జ్యోతి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. చదువుల్లోనూ మేటి... ఓ వైపు హాకీలో రాణిస్తున్న జ్యోతిరెడ్డి చదువుల్లోనూ గొప్ప ప్రతిభ కనబరుస్తోంది. గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌లోని కేంద్రీయ విద్యాలయలో పదో తరగతి వరకు చదివిన ఆమె 9.8 జీపీఏ సాధించడం విశేషం. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ జ్యోతి సత్తా చాటింది. గచ్చిబౌలి డివిజన్ మధురానగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన జ్యోతి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 891 మార్కులు సాధించి ఔరా అనిపించింది. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రత్యేక చొరవతోనే తాను చదువుల్లో రాణిస్తున్నానని జ్యోతి పేర్కొంది. భారత హాకీ జట్టుకు ఆడటమే లక్ష్యం... ‘చిన్నప్పటి నుంచి హాకీని శ్రద్ధగా నేర్చుకున్నాను. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగాను. ప్రస్తుతం నా లక్ష్యం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం. భోపాల్‌లోని ‘సాయ్’లో చేరడంతో ఆటలో నాణ్యత పెరిగింది. కోచ్ రాంబాబు కారణంగానే ఈ స్థాయికి రాగలిగాను. కేవీ ఉపాధ్యాయులు, రాయదుర్గం జూనియర్ కాలేజి లెక్చరర్ల ప్రోత్సాహంతో చదువులోనే రాణించగలుగుతున్నా. నచ్చిన క్రీడను ఎంపిక చేసుకుంటే ఆటతో పాటు చదువుల్లోనూ రాణించగలం’. –జ్యోతిరెడ్డి, హాకీ క్రీడాకారిణి