Jyothi Surekha couple
-
జ్యోతి సురేఖ జంటకు రజతం
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ చేసింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రజత పతకం సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) ద్వయం 153–157తో సో చెవన్–కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. రెండు జంటలకు నాలుగు రౌండ్లలో నాలుగేసి బాణాల చొప్పున సంధించే అవకాశం ఇచ్చారు. తొలిరౌండ్లో స్కోరు 39–39తో సమంగా నిలువగా... రెండో రౌండ్లో కొరియా ద్వయం 39–38తో... మూడో రౌండ్లో 39–37తో... నాలుగో రౌండ్లో 40–39తో పైచేయి సాధించి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖతోపాటు భారత్‌కే చెందిన త్రిషా దేబ్, పర్వీనా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో జ్యోతి సురేఖ 148–142తో డయానా మకర్చుక్ (కజకిస్తాన్)పై, త్రిషా దేబ్ 147–142తో లె పువోంగ్ థా (వియత్నాం)పై, పర్వీనా 147–144తో కిమ్ యున్హీ (కొరియా)పై గెలిచారు. -
‘మిక్స్డ్’ ఫైనల్లో జ్యోతి సురేఖ జంట
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మిక్స్డ్ కాంపౌండ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జంట 154–153తో చెన్ లి జు–పాన్ యు పింగ్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్లో సో చెవన్–కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) ద్వయంతో జ్యోతి సురేఖ–అభిషేక్ జంట తలపడుతుంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ ద్వయం 157–151తో పరీసా బరాచి–ఇస్మాయిల్ ఇబాది (ఇరాన్) జోడీపై గెలిచింది. క్వాలిఫయింగ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కొరియా (1419 పాయింట్లు), భారత్ (1412 పాయింట్లు) జోడీలకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది. -
క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ జంట ఓటమి
బెర్లిన్: ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నమెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో తెలుగు అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జంట 149–156 పాయింట్లతో లిండా అండర్సన్–జూలియో ఫిరో (మెక్సికో) ద్వయం చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో సురేఖ–అభిషేక్ జోడీ 154–149తో లూసీ మేసన్–కార్ల్ రిచర్డ్స్ (బ్రిటన్) జంటపై విజయం సాధించింది. మహిళల టీమ్ కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, స్నేహల్లతో కూడిన భారత జట్టు 2,069 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో భారత్ తలపడుతుంది. క్వాలిఫయింగ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ ఐదో ర్యాంక్‌లో నిలిచి నేరుగా మూడో రౌండ్‌కు అర్హత పొందింది.