ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ చేసింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రజత పతకం సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) ద్వయం 153–157తో సో చెవన్–కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. రెండు జంటలకు నాలుగు రౌండ్‌లలో నాలుగేసి బాణాల చొప్పున సంధించే అవకాశం ఇచ్చారు. తొలిరౌండ్‌లో స్కోరు 39–39తో సమంగా నిలువగా... రెండో రౌండ్‌లో కొరియా ద్వయం 39–38తో... మూడో రౌండ్‌లో 39–37తో... నాలుగో రౌండ్‌లో 40–39తో పైచేయి సాధించి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖతోపాటు భారత్‌కే చెందిన త్రిషా దేబ్, పర్వీనా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో జ్యోతి సురేఖ 148–142తో డయానా మకర్‌చుక్ (కజకిస్తాన్)పై, త్రిషా దేబ్ 147–142తో లె పువోంగ్ థా (వియత్నాం)పై, పర్వీనా 147–144తో కిమ్ యున్‌హీ (కొరియా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment