‘మజ్లిస్ మత రాజకీయాలకు కేసీఆర్ వత్తాసు’
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ మత రాజకీయాలకు సీఎం కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని, దేశహితం కోసం తీసుకున్న నిర్ణయాలకు మతం రంగు పులుముతారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దేశహితాన్ని కాంక్షిస్తారా లేక దోహద్రోహం తలపెడతారో సీఎం కేసీఆర్ తేల్చుకోవాలని స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి వ్యతిరేకంగా నిజామాబాద్లో నిర్వహించనున్న ఒవైసీ సభకు కేసీఆర్ మద్దతు తెలుపడాన్ని, టీఆర్ఎస్ ప్రతినిధిని పంపించడంతోపాటు కాంగ్రెస్, కమ్యూనిస్టులను కూడా ఆహ్వానించాలని కోరడాన్ని తప్పుబట్టారు.
వాటిపై చర్చకు సిద్ధం
ప్రజలు, ప్రతిపక్షాలకే కాదు.. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సమయమివ్వని కేసీఆర్ మతోన్మాద రాజకీయాలు నెరిపే ఎంఐఎం అధినేత అసదుద్దీన్తో 3 గంటల పాటు సమావేశం కావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సీఏఏపై కొన్ని పారీ్టలు ప్రజల్లో గందరగోళం çసృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇప్పుడు తాజాగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్పై పెడ»ొబ్బలు పెడుతున్నాయన్నారు. ఎన్పీఆర్ మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఎవరికి వారే తమ సాధారణ విషయాలు నమోదు చేయొచ్చని కూడా చెప్పిందన్నారు. అయినా టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ కలసి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్పీఆర్ అమలు చేస్తే ముస్లింలంతా భారత పౌరసత్వాన్ని కోల్పోతారన్నట్లు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఏఏ భారత ముస్లింలకు వ్యతిరేకమని నిరూపిస్తే తాము ముక్కును నేలకు రాస్తామని, లేకపోతే కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ కలసి చారి్మనార్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తారా? దీనిపై చర్చకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలపై చర్చించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని, ఎవరిని పంపుతారో చర్చకు పంపాలన్నారు.