
అంతా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే
టీఆర్‌ఎస్ రెండేళ్ల పాలనపై కె.లక్ష్మణ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే ఎజెండాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన మహాసమ్మేళన్‌లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. కేసీఆర్ వారసులకు అధికారాన్ని అప్పగించడం కోసం రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. న్యాయస్థానాలు తప్పని చెప్పినా వినకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
119 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 30 శాతం మంది సభ్యులు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించినవారేనని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎంసెట్ 1, 2, 3 అంటూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా బాధ్యులైన మంత్రి కూడా రాజీనామా చేయకపోవడమంటే అవినీతిని సమర్థించడమేనని విమర్శించారు. సెప్టెంబర్ 17న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారంలోకి వచ్చేదాకా చెప్పిన టీఆర్‌ఎస్... ఇప్పుడా అంశాన్ని తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ పాలనపై విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.