ఆమె వల్లే సమస్యలన్నీ.. ఏదో ఒకటి చేయాలి
శోభను కట్టడి చేయాలి
మురళీధర్రావ్కు అసంతృప్తుల ఫిర్యాదు!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీలో ఇటీవల ఏర్పడిన అనైక్యతకు సీనియర్ నాయకురాలు, ఎంపీ శోభా కరంద్లాజే కారణమని అసంతృప్త నాయకులు పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మురళీధర్రావ్కు ఫిర్యాదు చేశారు. ఆమెను కట్టడి చేస్తే అంతా సర్దుకుంటుందని చెప్పినట్లు సమాచారం. బీజేపీ సీనియర్ నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప నాయకత్వంలో కొంతమంది యడ్యూరప్ప పై తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హై కమాండ్ సూచన మేరకు మురళీధర్‌రావు సదరు అసంతృప్త నేతలతో శనివారం ఉదయం ఏడుగంటల నుంచి దాదాపు మూడు గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కే.ఎస్ ఈశ్వరప్ప, మాజీ మంత్రి సొగడు శివణ్ణ, మాజీ ఎమ్మెల్సీ భానుప్రకాశ్‌తో సహా 24 మంది అసంతృప్తులు పాల్గొన్నారు. ‘యడ్యూరప్పే మా నాయకుడు. ఆయన మార్గదర్శంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లడానికి మాకు ఎటుంవంటి అభ్యంతరం లేదు. అయితే పార్టీ కార్యక్రమాలు, ముఖ్యమైన నిర్ణయాల్లో శోభ కరంద్లాజే అనవసర జోక్యం చేసుకుంటున్నారు. యడ్యూరప్ప కూడా ఆమెకే పెద్దపీట వేయడం వల్ల పార్టీ పటిష్టత కోసం మొదటి నుంచి కృషి చేసిన వారికి సరైన స్థానం దక్కడం లేదు. ఆమెను అదుపు చేస్తే పార్టీలో సమస్యలు సర్దుకుంటాయి’ అని చెప్పడమే కాకుండా ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా అందజేసినట్లు తెలుస్తోంది.
బహిరంగ విమర్శలు వద్దన్న రావ్
అందరి మాటలు విన్న మురళీధర్‌రావ్ త్వరలోనే తాను అటు వైపు నాయకులతో కూడా మాట్లాడతానని అయితే ఇక పై ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ వేదికపై యడ్యూరప్పకు, పార్టీకి విరుద్ధంగా విమర్శలు చేయకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే కఠిన చర్యలకు పార్టీ వెనుకాడబోదని తేల్చిచెప్పారు. 2018 ఎన్నికలయ్యే వరకూ ఏ విషయాలనైనా పార్టీ లోపలే చర్చించాలని బీజేపీ అధినేత అమిత్‌షా హెచ్చరికగా మురళీధర్‌రావ్ అసంతృప్తులకు తెలిపారు. తాము ఇక పై బహిరంగంగా విమర్శలు చేయబోమని అసంతృప్తులు ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.