K. Sudhakaran
-
ఆ నటుడితో కాంగ్రెస్‌కు గొడవ ఎందుకు?
మలయాళ నటుడు జోజు జార్జ్.. ఇప్పుడు కేరళ కాంగ్రెస్ పార్టీకి లక్ష్యంగా మారారు. అతడు బహిరంగ క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. తాను ఏ తప్పు చేయలేదని జార్జ్ చెబుతున్నాడు. అసలు హస్తం పార్టీ అతడిని ఎందుకు టార్గెట్ చేసింది? జార్జ్ చేసిన తప్పేంటి? అసలు కథ ఇక్కడి నుంచే.. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా నవంబర్ 1న కొచ్చిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. వైట్టిల-ఎడపల్లి జాతీయ రహదారిపై నిరసనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు దాదాపు గంటల పాటు యాతన అనుభవించారు. జోజు జార్జ్.. కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో కూతురిని కీమోథెరపికి తీసుకెళుతున్న ఓ మహిళ పక్షాన కాంగ్రెస్ కార్యకర్తలతో అతడు వాగ్వాదానికి దిగాడు. గట్టిగా నిలదీయడంతో కోపోద్రిక్తులయిన కాంగీయులు జార్జ్ కారు అద్దాలను పగులగొట్టారు. దీంతో బాధ్యులపై పోలీసులు పలు సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. తలపొగరు తగ్గాలి జోజు జార్జ్.. తమ పార్టీ మహిళా కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించాడని కాంగ్రెస్ ఆరోపించింది. వీధి రౌడీలా ప్రవర్తించాడని, అతడి తలపొగరు తగ్గాలంటే చట్టప్రకారం శిక్షించాలని పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జోజు జార్జ్‌ను నిందించే ప్రయత్నంలో సినీ పరిశ్రమను కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. సినిమా షూటింగ్స్ వద్ద హడావుడి చేస్తూ శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాష్ట్రంలో సినిమా షూటింగులను అడ్డుకుంటే సహించేది లేదని అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చారు. (చదవండి: కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం..) సోషల్ మీడియాకు దూరం కాంగ్రెస్ పార్టీతో కలహం నేపథ్యంలో గత రెండు వారాల నుంచి జోజు జార్జ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సన్నిహితులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. త్రిసూర్ జిల్లాలోని మాలా గ్రామంలో ఉన్న తన ఇంటి ముందు స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంతో కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు. (చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!!) జీరో టు హీరో! త్రిస్సూర్ జిల్లాలోని కూజూర్ గ్రామంలో జన్మించిన జోజు జార్జ్.. సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నటుడిగా ఎదిగారు. 1995లో ‘మజవిల్కూడారం’ సినిమాలో చిన్న వేషంతో కెరీర్ మొదలు పెట్టిన ఆయనకు 2000లో ‘దాదా సాహెబ్’ సినిమాలో తొలిసారిగా డైలాగ్ చెప్పే అవకాశం లభించింది. అప్పటి నుంచి హాస్య పాత్రలు చేస్తూ వచ్చిన జార్జ్‌కు 2018లో వచ్చిన ‘జోసఫ్’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో జోజు జార్జ్‌కు హీరో ఇమేజ్ ఇచ్చింది. (Jai Bhim: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది) టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఎంతో కష్టపడి కిందిస్థాయి నుంచి సినిమా పరిశ్రమలో ఎదిగిన జోజు జార్జ్‌ను రాజకీయ నేతలు టార్గెట్ చేయడం సరికాదని అతడి సన్నిహితులు అంటున్నారు. కెరీర్లో ఎన్ని విజయాలు అందుకున్నా ఇప్పటికీ మూలాలు మరిచిపోలేదని, సాధారణ గ్రామస్తుడిలానే జీవిస్తారని వెల్లడించారు. బెదిరింపులతో జార్జ్‌ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం ఏమీ బాలేదని చెబుతున్నారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ప్రముఖ నిర్మాత, కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. ఉన్నికృష్ణన్ కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత సతీషన్‌కు లేఖ కూడా రాశారు. (Jai Bhim: హీరో సూర్యకు బెదిరింపులు.. దాడి చేస్తే రూ. లక్ష బహుమతి!) క్షమాపణ చెప్పాల్సిందే అయితే జోజు జార్జ్ బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు వెనక్కు తగ్గేది లేదని ఎర్నాకులం జిల్లా కమిటీ చీఫ్, పీసీసీ అధ్యక్షుడు భీష్మించుకుని కూర్చున్నారు. అటు జార్జ్.. కూడా క్షమాపణ చెప్పేందుకు ససేమీరా అనడంతో వివాదం సద్దుమణగలేదు. కాగా, చమురు ధరల పెరుగుదలకు నిరసనగా తాము చేపట్టిన ఆందోళనల లక్ష్యం నెరవేరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కేంద్రం, కేరళ ప్రభుత్వాలను ఆత్మరక్షణలో పడేసే గొప్ప అవకాశాన్ని పార్టీ చేజార్చకుందన్నారు. జోజుపై దాడి, అతనిపై దురుద్దేశపూరిత ప్రచారం నిరసనల గమనాన్ని మార్చిందని విశ్లేషించారు. (చదవండి: ప్రకాశ్‌రాజ్ మౌనవ్రతం..దానికోసమే అంటూ ట్వీట్) -
అవి నోళ్లేనా?!
మీరింకో రెండు అనొచ్చు. తప్పేం లేదు. ప్రజా ప్రతినిధులై ఉండీ, పార్టీ పేరులో ‘సమాజవాదం’ ఉండీ ఏం మాటలండీ అవి! ‘‘అబ్బాయిలు కదా, రేప్ చెయ్యడంలో వింతేముందీ, ఆ మాత్రానికే ఉరిశిక్ష వేస్తారా?’’ అని ములాయం అంటాడా! అది నోరా ఇంకేదైనానా? రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు వాళ్లబ్బాయి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తండ్రీకొడుకులు ఏం చెబుతున్నారు? రేపులు చేస్తే ఉత్తరప్రదేశ్‌లో శిక్షలుండవనా? ఇంకొకాయన అబూ అజ్మీ. ఆయనదీ సమాజవాదమే! ములాయం అక్కడ పార్టీ అధ్యక్షుడైతే, అజ్మీ ఇక్కడ మహారాష్ట్రలో అదే పార్టీకి చీఫ్. ఈయన ఏమంటాడంటే మగాళ్లతో ఇష్టంగానైనా, బలవంతంగానైనా వెళ్లిన ఆడాళ్లందరినీ ఉరి తియ్యాలట! నయం ఉరితో పోనిచ్చాడు, దానికి ముందు రేప్ సీన్ పెట్టకుండా. పెద్దపెద్ద వాళ్లంతా ఆడవాళ్ల విషయంలో ఎందుకిలా అమర్యాదగా మాట్లాడతారు?! ఒకాయన ‘డ్రెస్’ అంటాడు. ఒకాయన ‘రాత్రిళ్లు తిరగడం ఏమిటి?’ అంటాడు? ఒకాయన ‘బాయ్‌ఫ్రెండ్ ఎందుకు?’ అంటాడు. పోనీ ఎలా ఉంటే రేపులు ఆగుతాయి సర్! ఐబ్రో పెన్సిల్‌తో మీసాలు, గడ్డాలు దిద్దుకుంటే ఆగుతాయా? ట్రాఫిక్‌లో కూడా కళ్లు తిప్పకుండా నడుస్తుంటే ఆగుతాయా? అమ్మానాన్న కూడా వచ్చి కాలేజ్ క్లాస్‌రూమ్‌లో అటొకరు, ఇటొకరు కూర్చుంటే ఆగుతాయా? నాసా వ్యోమగామిలా ఒళ్లంతా స్పేస్‌సూట్ వేసుకుని, తలపై హెల్మెట్ పెట్టుకుంటే ఆగుతాయా? కనిపించిన వాళ్లందరినీ ‘భయ్యా, భాయి’ అనుకుంటూ పోతుంటే ఆగుతాయా? లేక, స్వామి అగ్నివేష్ ప్రవచించినట్లు మానవులంతా మాంసం, మద్యం మానేస్తే తగ్గుతాయా? ఇంకొకాయన ఫరూక్ అబ్దుల్లా! కేంద్రమంత్రి గారు. ఆడవాళ్లను సెక్రటరీలుగా పెట్టుకోవాలంటేనే ఈయనకు భయంగా ఉందట, కేసుపెట్టి ఎక్కడ జైల్లో వేయిస్తారోనని! పాపం ఎంత గడగడలాడి పోతున్నారో ఆడవాళ్లంటే, అంత చల్లని కాశ్మీర్లో ఉండి కూడా! ఏం సార్, కంప్లైంట్ ఎవరైనా ఊరికే ఇస్తారా? ఏదో వేషం వేస్తేనో, చూడకూడని చూపు చూస్తేనో కదా ఆడకూతుళ్లు కళ్లు తుడుచుకుని కంప్లైంట్ వరకు వెళ్లేది! కొడుకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. అయినా మీ ఒళ్లు మీ దగ్గర లేదు. ఇక సత్యదేవ్ కటారే! మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్. ఆయన ఎలా నోరు చేసుకున్నారో చూడండి. ‘‘జబ్ తక్ కోయీ మహిళా తేడీ నజర్ సే హసేగీ నహీ తబ్ తక్ కోయీ ఆద్మీ ఉస్సే ఛెడేగా న హీ’’. దీనికి లోతైన అనువాదం... ఆడమనిషి చనువివ్వకుండా మగాడు మీద చెయ్యి వేయలేడని! ఓహో! అలాగా?! అయితే నాలుగేళ్ల పిల్ల ఏం చనువు ఇచ్చి ఉంటుంది బాస్? జబల్పూర్లో ఎవరో ఆ చిన్నారిపై అఘాయిత్యం చేస్తే, బ్రెయిన్ దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది. ఇది తెలిసి మీ రాష్ట్రంలోని ఆడవాళ్లంతా గుండెలు బాదుకుంటున్నప్పుడే కదా ఇంగిత జ్ఞానం లేకుండా ‘భింద్’ మీటింగ్‌లో మీరు ఆ మాట అన్నది! జబ్ తక్ కోయీ... అంటూ! కటారేకి తోడుబోయినవాడు కె.సి.గోస్వామి. ఏఎస్పీ. ఆయనదీ ఇదే కేటగిరీ. దేవ్రా (యు.పి)లో అత్యాచారం జరిగిన మహిళ తనవాళ్లతో కలసి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్‌స్టేషన్‌కి వస్తే ఏమన్నాడో మీరు చదివే ఉంటారు. పద్నాలుగేళ్ల బిడ్డ ఉన్న తల్లిని ఎవరైనా రేప్ చేస్తారాని అతడి ఆశ్చర్యం! ఇలాంటి మరొక జెంటిల్మన్‌నే కె.సుధాకర న్. కేరళ కాంగ్రెస్ ఎం.పి. సూర్యనెల్లి కేసులో నలభైరోజుల పాటు, నలభైమంది అత్యాచారం చేసిన మైనర్ బాలిక గురించి చెబుతూ. ‘‘తనేం బాధితురాలు కాదు, బాలవేశ్య’’ అనేశాడు! దేవుడా! ఎందుకని ఆడవాళ్ల మీద ఇలా పడిపోతున్నాం? ఢిల్లీ బస్సులో పడిందానికన్నా, శక్తిమిల్స్‌లో పడిందానికన్నా ఇదేం తక్కువ? నిర్భయ మీద నలుగురు పడ్డారు. ఫొటో జర్నలిస్టు మీద ముగ్గురు పడ్డారు. సూర్యనెల్లి చిన్నపిల్ల మీద నలభై మంది పడ్డారు. మన ములాయంలు, అజ్మీలు, అబ్దుల్లాలు, కటారేలు, పోలీస్ గోస్వాములు, సుధాకరన్‌లు మొత్తం స్త్రీజాతి గౌరవమర్యాదలపైనే పడిపోతున్నారు! అమ్మ ఉండి, అక్క ఉండి, చెల్లి ఉండి, భార్య ఉండి, కూతురు ఉండి, ఇంతమంది ఉండీ ప్రతిచోటా ఆడవాళ్లను తొక్కుకుంటూ, తోసుకుంటూ, రుద్దుకుంటూ, రాసుకుంటూ పోయే మామూలు మగాళ్లకూ... చదువుండీ, సంస్కారం ఉండీ, పదవులుండీ, ఉద్యోగాలు ఉండీ, ఇన్ని ఉండీ, మొత్తం స్త్రీలందరి మనోభావాలను ఒక్క ‘కామెంట్’తో కించపరిచే ఈ మహానుభావులకూ తేడా ఏంటి? ఉంది. వీళ్లకన్నా మామూలు మగాళ్లు నయం. ఇంకా చెప్పాలంటే వీళ్ల కన్నా రేపిస్టులు నయం.