అవి నోళ్లేనా?!
మీరింకో రెండు అనొచ్చు. తప్పేం లేదు. ప్రజా ప్రతినిధులై ఉండీ, పార్టీ పేరులో ‘సమాజవాదం’ ఉండీ ఏం మాటలండీ అవి! ‘‘అబ్బాయిలు కదా, రేప్ చెయ్యడంలో వింతేముందీ, ఆ మాత్రానికే ఉరిశిక్ష వేస్తారా?’’ అని ములాయం అంటాడా! అది నోరా ఇంకేదైనానా? రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు వాళ్లబ్బాయి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తండ్రీకొడుకులు ఏం చెబుతున్నారు? రేపులు చేస్తే ఉత్తరప్రదేశ్‌లో శిక్షలుండవనా?
ఇంకొకాయన అబూ అజ్మీ.
ఆయనదీ సమాజవాదమే! ములాయం అక్కడ పార్టీ అధ్యక్షుడైతే, అజ్మీ ఇక్కడ మహారాష్ట్రలో అదే పార్టీకి చీఫ్. ఈయన ఏమంటాడంటే మగాళ్లతో ఇష్టంగానైనా, బలవంతంగానైనా వెళ్లిన ఆడాళ్లందరినీ ఉరి తియ్యాలట! నయం ఉరితో పోనిచ్చాడు, దానికి ముందు రేప్ సీన్ పెట్టకుండా.
పెద్దపెద్ద వాళ్లంతా ఆడవాళ్ల విషయంలో ఎందుకిలా అమర్యాదగా మాట్లాడతారు?!
ఒకాయన ‘డ్రెస్’ అంటాడు. ఒకాయన ‘రాత్రిళ్లు తిరగడం ఏమిటి?’ అంటాడు? ఒకాయన ‘బాయ్‌ఫ్రెండ్ ఎందుకు?’ అంటాడు. పోనీ ఎలా ఉంటే రేపులు ఆగుతాయి సర్! ఐబ్రో పెన్సిల్‌తో మీసాలు, గడ్డాలు దిద్దుకుంటే ఆగుతాయా? ట్రాఫిక్‌లో కూడా కళ్లు తిప్పకుండా నడుస్తుంటే ఆగుతాయా? అమ్మానాన్న కూడా వచ్చి కాలేజ్ క్లాస్‌రూమ్‌లో అటొకరు, ఇటొకరు కూర్చుంటే ఆగుతాయా? నాసా వ్యోమగామిలా ఒళ్లంతా స్పేస్‌సూట్ వేసుకుని, తలపై హెల్మెట్ పెట్టుకుంటే ఆగుతాయా? కనిపించిన వాళ్లందరినీ ‘భయ్యా, భాయి’ అనుకుంటూ పోతుంటే ఆగుతాయా? లేక, స్వామి అగ్నివేష్ ప్రవచించినట్లు మానవులంతా మాంసం, మద్యం మానేస్తే తగ్గుతాయా? ఇంకొకాయన ఫరూక్ అబ్దుల్లా! కేంద్రమంత్రి గారు. ఆడవాళ్లను సెక్రటరీలుగా పెట్టుకోవాలంటేనే ఈయనకు భయంగా ఉందట, కేసుపెట్టి ఎక్కడ జైల్లో వేయిస్తారోనని!
పాపం ఎంత గడగడలాడి పోతున్నారో ఆడవాళ్లంటే, అంత చల్లని కాశ్మీర్‌లో ఉండి కూడా! ఏం సార్, కంప్లైంట్ ఎవరైనా ఊరికే ఇస్తారా? ఏదో వేషం వేస్తేనో, చూడకూడని చూపు చూస్తేనో కదా ఆడకూతుళ్లు కళ్లు తుడుచుకుని కంప్లైంట్ వరకు వెళ్లేది! కొడుకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. అయినా మీ ఒళ్లు మీ దగ్గర లేదు.
ఇక సత్యదేవ్ కటారే!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్. ఆయన ఎలా నోరు చేసుకున్నారో చూడండి. ‘‘జబ్ తక్ కోయీ మహిళా తేడీ నజర్ సే హసేగీ నహీ తబ్ తక్ కోయీ ఆద్మీ ఉస్సే ఛెడేగా న హీ’’. దీనికి లోతైన అనువాదం... ఆడమనిషి చనువివ్వకుండా మగాడు మీద చెయ్యి వేయలేడని!
ఓహో! అలాగా?! అయితే నాలుగేళ్ల పిల్ల ఏం చనువు ఇచ్చి ఉంటుంది బాస్? జబల్‌పూర్‌లో ఎవరో ఆ చిన్నారిపై అఘాయిత్యం చేస్తే, బ్రెయిన్ దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది. ఇది తెలిసి మీ రాష్ట్రంలోని ఆడవాళ్లంతా గుండెలు బాదుకుంటున్నప్పుడే కదా ఇంగిత జ్ఞానం లేకుండా ‘భింద్’ మీటింగ్‌లో మీరు ఆ మాట అన్నది! జబ్ తక్ కోయీ... అంటూ!
కటారేకి తోడుబోయినవాడు కె.సి.గోస్వామి.
ఏఎస్పీ. ఆయనదీ ఇదే కేటగిరీ. దేవ్‌రా (యు.పి)లో అత్యాచారం జరిగిన మహిళ తనవాళ్లతో కలసి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్‌స్టేషన్‌కి వస్తే ఏమన్నాడో మీరు చదివే ఉంటారు. పద్నాలుగేళ్ల బిడ్డ ఉన్న తల్లిని ఎవరైనా రేప్ చేస్తారాని అతడి ఆశ్చర్యం!
ఇలాంటి మరొక జెంటిల్మన్నే కె.సుధాకర న్.
కేరళ కాంగ్రెస్ ఎం.పి. సూర్యనెల్లి కేసులో నలభైరోజుల పాటు, నలభైమంది అత్యాచారం చేసిన మైనర్ బాలిక గురించి చెబుతూ. ‘‘తనేం బాధితురాలు కాదు, బాలవేశ్య’’ అనేశాడు! దేవుడా!
ఎందుకని ఆడవాళ్ల మీద ఇలా పడిపోతున్నాం? ఢిల్లీ బస్సులో పడిందానికన్నా, శక్తిమిల్స్‌లో పడిందానికన్నా ఇదేం తక్కువ? నిర్భయ మీద నలుగురు పడ్డారు. ఫొటో జర్నలిస్టు మీద ముగ్గురు పడ్డారు. సూర్యనెల్లి చిన్నపిల్ల మీద నలభై మంది పడ్డారు. మన ములాయంలు, అజ్మీలు, అబ్దుల్లాలు, కటారేలు, పోలీస్ గోస్వాములు, సుధాకరన్‌లు మొత్తం స్త్రీజాతి
గౌరవమర్యాదలపైనే పడిపోతున్నారు!
అమ్మ ఉండి, అక్క ఉండి, చెల్లి ఉండి, భార్య ఉండి, కూతురు ఉండి, ఇంతమంది ఉండీ ప్రతిచోటా ఆడవాళ్లను తొక్కుకుంటూ, తోసుకుంటూ, రుద్దుకుంటూ, రాసుకుంటూ పోయే మామూలు మగాళ్లకూ... చదువుండీ, సంస్కారం ఉండీ, పదవులుండీ, ఉద్యోగాలు ఉండీ, ఇన్ని ఉండీ, మొత్తం స్త్రీలందరి మనోభావాలను ఒక్క ‘కామెంట్’తో కించపరిచే ఈ మహానుభావులకూ తేడా ఏంటి? ఉంది. వీళ్లకన్నా మామూలు మగాళ్లు నయం. ఇంకా చెప్పాలంటే వీళ్ల కన్నా రేపిస్టులు నయం.