రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఒప్పంద పత్రాలపై సంతకాలు
కోలారు, న్యూస్‌లైన్ : జిల్లాలోని శ్రీనివాసపురం తాలూకాలో కేంద్ర ప్రభుత్వం స్థాపించనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతకాలు చేసింది. బెంగళూరులోని విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ర్ట ప్రభుత్వం తరుఫున ప్రిన్సిపల్ సెక్రటరీ వందితాశర్మ, కేంద్ర రైల్వే శాఖ తరుఫున రైల్వే బోర్డు సభ్యుడు (మెకానికల్, ఇంజినీరింగ్ బోర్డు) కె.స్వామినాథన్ సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మంత్రి కె.హెచ్.మునియప్ప, జిల్లా ఇన్చార్జి మంత్రి యు.టి.ఖాదర్ పాల్గొన్నారు. కాగా, రూ. 1460 కోట్ల వ్యయంతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 1100 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసింది.