దీపావళి వరకుమళ్లొస్తా..
దేవరకొండ/చింతపల్లి : అనుకున్న సమయం కంటే మంత్రి రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా... 8 గంటల పాటు దేవరకొండ నియోజకవర్గంలో గడిపారు. పొలిటికల్ లీడర్ గెటప్‌లో కాకుండా టీ షర్ట్, ఫార్మల్ పాయింట్లో గ్రామసభకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ గ్రామస్తులతో ఉల్లాసంగా గడిపారు. మాట్లాడుతామన్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించి వారు చెప్పుకున్న ప్రతి కష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులు అడిగిన సమస్యల పరిష్కారంతోపాటు వరాల జల్లు కురిపించారు. తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. శుక్రవారం జిల్లాలోని చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామం, చందంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో పాల్గొనడంతోపాటు దేవరకొండలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నాయకులను, కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
టీఆర్ఎస్ ఇన్చార్జ్, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన మంత్రి కేటీఆర్ 8 గంటల పాటు నియోజకవర్గంలో గడిపారు. 11 గంటలకు రావాల్సిన ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చి రాత్రి 8 గంటల వరకు నియోజకవర్గంలోనే గడిపారు. చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామంలో సుమారు గంటన్నరపాటు కాలి నడకన ప్రతి వీధిని తిరిగి పరిశీలించారు. పాఠశాల, వైద్యశాల, మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువు పనులతో పాటు గ్రామంలోని పలు కుటుంబాల ఇళ్లలోకి వెళ్లి మరీ పరిశీలించారు. వారి ఆర్థిక పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామసభలో కూర్చున్న ఆయన గ్రామస్తులు తెలిపిన పలు సమస్యలను ప్రశాంతంగా విన్నారు. వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపించారు. నెల్వలపల్లి గ్రామానికి సంబంధించి రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో 4 కోట్ల 79 లక్షల రూపాయలు గ్రామజ్యోతి కార్యక్రమం కింద వెచ్చించనున్నట్లు తెలిపారు.
గ్రామంలో మిగిలి ఉన్న 310 మరుగుదొడ్లను 2 నెలల్లో పూర్తి చేయాలని సర్పంచ్ అంగిరేకుల నాగభూషణం నుంచి మాట తీసుకున్నారు. గ్రామంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించిన గ్రామానికి చెందిన బూరుగు రవిని ఆయన అభినందించారు. సభలో ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. చందంపేటలోనూ పెండింగ్‌లో ఉన్న 620 మరుగుదొడ్లను పూర్తి చేయాలని వీటిని పరిశీలించడానికి రెండు నెలల తర్వాత మళ్ళీ దీపావళి వరకు మళ్లి నియోజకవర్గానికి వస్తానన్నారు. అప్పటిలోగా మార్పు తీసుకురావాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలో దేవరకొండ నియోజకవర్గాన్ని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సహకారంతో సిరిసిల్ల నియోజకవర్గంతో సమానంగా ముందుకు తీసుకెళ్తానన్నారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం శివన్నగూడెంలో నక్కలగండి ఎత్తిపోతలకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలోనే శంకుస్థాపన చేశారని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ రవి, జెడ్పీటీసీ హరినాయక్ తదిరులున్నారు.
మంత్రి హామీలివే :
ఙ్ట్చఛగ్రామ అభివృద్ధికి సహకరించాలని నెల్వలపల్లి సర్పంచ్ అంగిరేకుల నాగభూషణంతో పాటు పలువురు అడిగిన హామీలను మంత్రి పరిష్కార మార్గాలు సూచించారు. గ్రామంలో ఇప్పటికే కొం త మేరకు పూర్తయిన సీసీ రోడ్ల పొడవు వెంటనే పెంచాలని అడగటంతో వెంటనే ఒకే చెప్పారు.
పస్నూరు వాగు కింద 2 చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధిత శాఖల అధికారులతో అక్కడే మాట్లాడారు.
నెల్వలపల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలాయపాలెంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఏఈని ఆదేశించారు.
…లో 250 ఎకరాల మేర దళితులు కాస్తులో ఉన్నప్పటికీ పట్టాలు ఇవ్వలేదని ఓ యువకుడి ఆరోపణ మేరకు కాస్తులో ఉన్న వారికి క్షేత్ర పర్యటన చేసి నిబంధనల ప్రకారం వెంటనే 3 ఎకరాల చొప్పున పట్టాలివ్వాలని ఆదేశించారు.
తిరుమలాపురంలో 11కెవి విద్యుత్ లైన్ షిఫ్టింగ్ కోసం గ్రామస్థులు అడగగా లైన్ షిఫ్ట్ చేయడానికి విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే అది తొలగించాలన్నారు.