తిరుమలగిరి కేవీదే హవా
ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) క్లస్టర్ స్థాయి క్రీడల్లో తిరుమలగిరి కేవీ స్కూల్ క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల బొల్లారం, తిరుమలగిరి, హకీంపేట్ కేవీఎస్ క్లస్టర్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో తిరుమలగిరి కేవీ జట్టు అండర్-19 బాలుర హాకీ, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ టైటిల్స్‌ను గెలుచుకుంది. అండర్-19 బాలికల విభాగం కబడ్డీ టైటిల్‌ను గెలుచుకోగా, త్రోబాల్‌లో రన్నరప్‌గా నిలిచింది.
అండర్-19 బాలుర జట్టు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ టైటిల్స్‌ను దక్కించుకున్నాయి. అండర్-14 బాలికల ఖోఖో టైటిల్‌ను గెలుచుకోగా, అండర్-14 బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్-16 బాలుర క్రికెట్ జట్టు టైటిల్‌ను గెలిచింది. పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి, క్రీడాకారులను తిరుమలగిరి కేవీ స్కూల్ ప్రిన్సిపల్ వి.మృదుల అభినందించారు. క్రీడాకారుల విజయాన్ని కృషి చేసిన పీఈటీలు రమేష్, వీరేంద్ర సింగ్, జి.బి.పద్మారావులపై ప్రశంసలు కురిపించారు.