కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- 13న కలెక్టరేట్ వద్ద ధర్నా
- ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్
టెక్కలి
రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ అన్నారు. ఆదివారం టెక్కలి అంబేడ్కర్ భవన్లో కౌలు రైతుల సంఘం జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలతోనే కౌలు రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. రుణాల మంజూరులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలను వ్యవసాయ రుణాలతో ముడిపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, మిగిలిన వ్యవసాయ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయాల వద్ద జరగనున్న ధర్నాలో కౌలు రైతులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభలో రాష్ట్ర కన్వీనర్ సిహెచ్.కేశవశెట్టి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అప్పలనాయుడు, కె.రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక
కౌలు రైతుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా కె.రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శిగా జి.శివకుమార్, సభ్యులుగా బి.తిరుమలరావు, డి.అప్పన్న, జి.దశరథ, ఆర్.మల్లేష్, బి.లక్షు్మనాయుడు, బి.అప్పలనాయుడు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.