కబంధ హస్తాలు...
నానుడి
కబంధుడు అనేవాడు రాక్షసుడు. పూర్వాశ్రమంలో అతడు విశ్వావసువు అనే గంధర్వుడు. తపస్సు చేసి, మరణం లేకుండా బ్రహ్మ ద్వారా వరం పొందుతాడు. వరగర్వం తలకెక్కడంతో ఏకంగా ఇంద్రుడితోనే తలపడతాడు. ఇంద్రుడి శాప ఫలితంగా తల, కాళ్లు లేని రాక్షస రూపం దాలుస్తాడు. మొండెం, చేతులు మాత్రమే మిగులుతాయి. మొండేనికి ఒక కన్ను, ముక్కు, నోరు ఉంటాయి. క్రౌంచ పర్వతం దగ్గర అడవిలో పడి ఉంటాడు. కాళ్లులేక ఎక్కడికీ కదల్లేకపోయినా, అతడి చేతులు ఎంత దూరమైనా సాగుతాయి.
జంతువులను, ఒక్కోసారి మనుషులను ఆ చేతుల్లోనే చిక్కించుకుని, శుభ్రంగా భోంచేసేవాడు. వనవాస కాలంలో రామలక్ష్మణులను కూడా అలాగే చేతుల్లో చిక్కించుకుంటాడు. రామలక్ష్మణులు అతడి చేతులు నరికేయడంతో శాప విమోచనం పొందుతాడు. అప్పటి వరకు ఎంత దూరమైనా సాగే కబంధుడి హస్తాల్లో చిక్కుకున్న వారు తప్పించుకోవడం అసాధ్యంగా ఉండేది. పరపతి గల పెద్దలు కనుచూపు మేరలోని ఆస్తులను కబ్జా చేసేస్తుంటే, అలాంటి ఆస్తులు కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయనడం వాడుకగా మారింది.