Kabini
-
నేచర్ లవర్స్‌కి గుడ్‌న్యూస్! కబిని, కూర్గ్‌లకు హెలికాప్టర్ సర్వీసులు
Helicopter Ride From Bangalore To Coorg: హెలికాప్టర్ సేవల సంస్థ బ్లేడ్ ఇండియా కొత్తగా బెంగళూరు–కూర్గ్, బెంగళూరు–కబిని రూట్లలో సర్వీసులను ప్రారంభించింది. బెంగళూరు నుంచి ఈ రెండు ప్రాంతాలకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు సుమారు 6–7 గంటల సమయం పడుతుంది. కర్ణాటకలో అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాలకు చేరుకోవడం ప్రయాసతో కూడుకున్నదని సంస్థ ఎండీ అమిత్ దత్తా తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల సమయమంతా ప్రయాణంలో వృధా కాకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుని, అక్కడ సరదాగా గడిపేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్‌తో జట్టు కట్టినట్లు వివరించారు. అమెరికాకు చెందిన బ్లేడ్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ, దేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థ హంచ్ వెంచర్స్ కలిసి 2019లో బ్లేడ్ ఇండియాను ప్రారంభించాయి. వారాంతాల్లో ప్రైవేట్ చార్టర్ సేవలు అందించడం ద్వారా 2020 డిసెంబర్లో బ్లేడ్ ఇండియా.. కర్ణాటక రాష్ట్రంలో సర్వీసులు మొదలుపెట్టింది. దేశంలోనే ప్రముఖ హిల్ స్టేషన్‌గా కూర్గ్ ప్రకృతి అందాలకు కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇక కబిని టైగర్ రిజర్వ్ ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా కబిని ఫారెస్ట్‌లో కనిపించే బ్లాక్ చీతాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. చదవండి: ఎల్జీ సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..! -
రంగులు మార్చే సూర్యుడు
కబిని నది కేరళలో పుట్టి కర్నాటకలో ప్రవహిస్తూ కావేరి నదిలో సంగమిస్తుంది. నాగర్హోల్ నేషనల్పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్‌లకు మధ్యగా సాగుతుంది ఈ నది ప్రయాణం. పశ్చిమ కనుమల ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ. ఏనుగులు గుంపులు గుంపులుగా పోతుంటాయి. మైసూర్‌ను పాలించిన వడయార్ల వేట వినోదానికి వేదిక నాగర్హోల్, ఇది బ్రిటిష్ పాలకుల వేసవి విహారకేంద్రం కూడ. ప్రకృతిమాత... కబిని తీరాన్ని సమతులంగా డిజైన్ చేస్తే, కర్నాటక టూరిజం పర్యాటకులకు సౌకర్యాలతో ముంచెత్తుతోంది. నది తీరాన వందలాది ఎకరాల్లో విస్తరించిన ఇసుల తిన్నెలు... నీటికి– నేలకు మధ్య అత్యాధునికమైన రిసార్టులతో పరస్పర వైవిధ్యభరితమైన కబిని తీరం మైసూర్ నగరానికి 80 కి.మీల దూరాన ఉంది. లాంతరు వెలుగులో గూడు పడవ విహారం జానపద సినిమాల్లో ఉన్నట్లు గూడు పడవలు, వెలుతురు కోసం గాజు చిమ్నీ బుడ్డిదీపాలు. కేన్ కుర్చీలు, అరోమాటిక్ క్యాండిల్ వెదజల్లే మంద్రమైన కాంతితోపాటు సువాసనలు. పురాతన నేపథ్యంలో అధునాతనమైన క్యాండిల్‌లైట్ డిన్నర్ చేస్తూ గూడు పడవలో విహారం... దీనికి దీటుగా స్వచ్ఛమైన నీటితో స్విమ్మింగ్‌పూల్, కనుచూపు మేరలో ఉన్నదంతా స్విమ్మింగ్ పూలేనేమో అని భ్రమకు లోను చేసే ఫ్లోర్... చూపు తిప్పుకోనివ్వవు. కబిని తీరంలో పర్యాటకుల కోసం ఏర్పాటైన రిసార్టులు రెల్లు గడ్డి, ఎర్ర పెంకు పై కప్పుతో పొదరింటిని పోలి ఉంటాయి. బయటకు గ్రామీణ వాతావరణాన్ని తలపించే ఈ రిసార్టులు లోపల అటాచ్డ్ బాత్రూములతో విశాలమైన ఏసీ గదులు, రూమ్ హీటర్లు, ఫ్రెంచ్ కాఫీ మేకర్లతో అత్యంత ఆధునికంగా ఉంటాయి. రంగులు మార్చే సూర్యుడు ఉదయాన్నే నిద్రలేచి ఒళ్లు విరుచుకుంటూ కాఫీ మగ్గు చేత్తో పట్టుకుని కాటేజ్ బయట అడుగుపెడితే మరో ప్రపంచంలోకి ఊడిపడినట్లు ఉంటుంది. ఉదయాన్నే ఏనుగు నోటికి ఒక చెరకు గడ అందించి, పక్షుల కిలకిలరవాల ప్రతిధ్వనుల కోసం చెవి ఒగ్గి నేషనల్ పార్కులో ఎడ్ల బండిలో సవారీ చేయడం ఆధునిక జీవితానికి దొరికే అరుదైన సంతోషం. సూర్యుడు అస్తమించే క్షణాలు ఇక్కడ అత్యంత అపురూపం. క్షణక్షణానికీ రంగులు మారే సూర్యుడిని ఓపిగ్గా ప్రతిబింబిస్తుంది నది. ఆ విచిత్రాన్ని చూస్తున్న పిల్లలు ఆ రంగుల్లో షేడ్లకు పేర్లు పెడుతుంటే సూర్యుడు చెప్పా పెట్టకుండా నిశ్శబ్దంగా అస్తమిస్తాడు. నది మాత్రం అన్ని రంగులనూ తనలో శోషించుకుని ఇక ఏ రంగూ లేని తిమిరాన్ని ఆశ్రయిస్తుంది. ప్రకృతి సౌందర్యారాధనలో సాచురేషన్కెళ్లిన తర్వాత ట్రైబల్ డ్యాన్సులు ఆహ్వానిస్తాయి. వీటితోపాటు వైల్డ్‌లైఫ్ అంటే ఇదీ అని చూపించే డాక్యుమెంటరీ చిత్రం. పిల్లలతో వెళ్తే మాత్రం కబిని తీరాన ఏనుగు సవారీ చేయడం మర్చిపోకూడదు. నదిలో కోరాకిల్ రైడ్(వలయాకారమైన పుట్టి లాంటి పడవ) అన్ని వయసుల వారినీ అలరిస్తుంది. ఎక్కువ సమయం కేటాయించగలిగితే నేచర్ వాక్‌ను మిస్ కాకూడదు. కావేరమ్మ ఒడి చేరే కబిని కబిని నది కేరళ రాష్ట్రం, వయనాడు జిల్లాలోని పక్రమ్ తాలమ్ కొండల్లో పుట్టింది. కరోమి, వాలాడ్లలో మక్కియాద్, పెరియ నదులు కబినిలో కలుస్తాయి. తర్వాత పెయ్యంపల్లి దగ్గర పనమారమ్ నది కలుస్తుంది. వీటి సంయుక్త ప్రవాహం కొంతదూరం సాగాక కబిని నది పాయగా చీలుతుంది. ఈ పాయల మధ్య ఎత్తుగా ఉన్న నేల కురువ దీవి. వందల రకాల పక్షులకు, పూలకు నిలయం ఈ దీవి. ఇంతలో తిరెనెల్లి దగ్గర కబినిలో బ్రహ్మగిరి కొండల్లో పుట్టిన కాళింది నది కలుస్తుంది. వీటితోపాటుగా పాపనాశిని, తారక, నాగు వంటి చిన్న చిన్న నదులు కలుస్తాయి. ఈ ప్రవాహం మొత్తం కావేరి నదిలో కలుస్తుంది. చదవండి: దుబాయ్ టూర్: అది అరబిక్ కడలందం.. వరల్డ్ హెరిటేజ్ సైట్; హుమయూన్ సమాధి -
బ్లాక్ పాంథర్-చిరుత ఫొటోలు వైరల్
సాక్షి, కర్ణాటక: గత కొద్ది రోజులుగా కర్ణాటక అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) సంచరిస్తున్న వార్త సోషల్ మీడియా హల్చల్ చేసింది. దాని ఫొటోలు కూడా విపరీతంగా వైరల్ అవ్వడంతో అందరూ సినిమాల్లోని కల్పిత జంతువు బ్లాక్ పాంథర్లు నిజంగా కూడా ఉన్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్లాక్ పాంథర్, చిరుత పులి జతకట్టిన ఫొటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. వీటిని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ మిథున్ హెచ్ తన కెమెరాలో బంధించి షేర్ చేశాడు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ ఫొటోల క్రెడిట్‌కు సంబంధించి వివాదానికి దారితీసింది. కానీ ఈ వివాదం త్వరగానే పరిష్కారించబడింది.ఈ ఫొటోలను గత ఏడాది మిథున్ హెచ్ కర్ణాటకలోని కబిని ఫారెస్ట్‌లో చిత్రీకరించాడు. కర్నాటకలో అంత్యంత ప్రాచుర్యం పొందిన వన్యప్రాణుల అడవుల్లో ఇది ఒకటి, ఇది నాగరహైల్ నేషన్ పార్క్‌కు ఆగ్నేయంలో ఉంది. (చదవండి: వైరల్ : నల్ల చిరుతను చూశారా?) ‘ది ఎటర్నల్ కపుల్.. సాయా(బ్లాక్ పాంథర్), క్లియోపాత్ర(చిరుత పులి) చూడండి’ అనే క్యాప్షన్‌తో మిథున్ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్టుకు వేలల్లో లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ అరుదైనా దృశ్యాన్ని మిథున్ ఇలా వివరించాడు. ‘‘సయా, క్లియోపాత్రా 4 సంవత్సరాల నుండి ఈ అడవిలో కలిసి నివసిస్తున్నాయి. కల్పిత రాజ్యంలో వారు అనాలోచితంగా వ్యవహరించడంతో అడవి సజీవంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి జంటలలో మగవాడు బాధ్యత వహిస్తూ తన స్త్రీని అనుసరిస్తాడు. కానీ ఇక్కడ క్లియో బాధ్యత వహిస్తే పాంథర్ తనని అనుసరిస్తాడు’’ అంటూ రాసుకొచ్చాడు. ఓ ఇంటర్యూలో మిథున్ మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్లో ఈ చిత్రాలకు విశేష స్పందన వచ్చింది. నేను ఇది ఊహించలేదు. అలాగే దీనిపై వచ్చిన విమర్శలను కూడా నేను ఊహించలేదు. పాంథర్-చిరుతల ఫొటోలు తీసేందుకు నాకు 6 రోజుల సమయంలో పట్టింది’’ అని వెల్లడించాడు. View this post on Instagram The Eternal Couple . Saaya and Cleopatra have been courting since 4 years now and whenever they are together it’s a sight to behold. The forest comes alive as they trot nonchalantly in his fabled kingdom. Usually in the courting pairs generally it is the Male who takes charge and moves around with the female following close behind. But with this couple it was definitely Cleo who was in charge while the Panther followed. . This was shot on a surreal winter morning when a single Deer alarm led me to this breathtaking sight. . #kabini #love #leopard #nikon #wild #Natgeo #mithunhphotography #instagood #instadaily #jungle #bigcat #forest #wildlifephotography #nature #wildlife #blackpanther #melanistic #therealblackpanther #thebisonresort A post shared by Mithun H (@mithunhphotography) on Jul 19, 2020 at 7:52am PDT -
వైరల్ : నల్ల చిరుతను చూశారా?
బెంగళూరు : సినిమాల్లో చూపించే కొన్ని కల్పిత జంతువులు నిజంగా ఉంటాయా అనే సందేహం చాలా సార్లు కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా జంగిల్ బుక్ చిత్రంలో భగీరా పేరిట చూపెట్టిన నల్ల చిరుత నిజంగా ఉంటుందా లేదా అనే చర్చ అయితే తీవ్రంగానే జరిగింది. అయితే ఆ సినిమాలో చూపెట్టిన నల్ల చిరుత పులులు నిజంగానే ఉన్నాయి. అది కూడా మన భారతదేశంలోనే. కర్ణాటకలోని నాగర్హోల్ నేషనల్ పార్క్‌లో కాబిని నది పరిసరాల్లో నల్ల చిరుత పులులు ఉన్న సంగతి తెలిసిందే. వైల్డ్‌లైఫ్ ఫొటోలు ప్రచురించే ‘ఎర్త్’ తమ ట్విటర్ ఖాతాలో వీటిని షేర్ చేసింది. దీంతో అవి కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారాయి.(చదవండి : సైకిల్ గర్ల్‌పై అత్యాచారం, హత్య: నిజమెంత?) వాస్తవానికి ఈ ఫొటోలను 2019లో ప్రముఖ వైల్డ్‌లైఫ్ పొటోగ్రాఫర్ షాజ్ జంగ్ తీశారు. కాబిని నది పరిహహాక ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉన్న వైల్డ్క్యాట్స్కు సంబంధించి జంగ్ అనేక ఫొటోలు తన ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం వైరల్‌గా మారిన ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది ప్రకృతి చాలా గొప్పదని అర్థం వచ్చేలా కామెంట్లు పెడుతున్నారు. కొందరు మాత్రం.. ‘జంగిల్ బుక్ చిత్రంలోని భగీరా నువ్వేనా’అని పోస్ట్‌లు చేస్తున్నారు. మరికొందరు తాము గతంలో తీసిన బ్లాక్ పాంథర్ చిత్రాలను కూడా షేర్ చేస్తున్నారు. A black panther roaming in the jungles of Kabini, India. pic.twitter.com/UT8zodvv0m — Earth (@earth) July 4, 2020 -
అడవి కుక్క వింత శబ్దం.. భయపడిన పులి
న్యూఢిల్లీ : తనను వెంటాడుతూ వచ్చిన పులిని వింత శబ్దం చేస్తూ బెదిరించి తప్పించుకుంది ఓ అడవి కుక్క(వైల్డ్ డాగ్). ఈ అద్భుత దృశ్యం కర్ణాటకలోని కబిని ప్రాంతంలో చోటు చేసుకుంది. పులి నుంచి తప్పించుకునేందుకు ఆ వైల్డ్‌డాగ్ చేసిన శబ్ధానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదో వింత శబ్దం అని, ఇలాంటి అరుపులను ఇంతవరకు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మొదటగా ఫైవ్జీరో సఫారీస్ షేర్ చేశారు. తర్వాత ఆ వీడియోని వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : ఈ పాము పాకదు.. నడుస్తోంది!) వీడియో ప్రకారం.. ఒక పులి అడవి కుక్కను వెంటాడుతూ పరుగెత్తింది. పులిని చూసిన అడవి కుక్క వేగంగా పరుగులు తీసింది. కొంత దూరం పరుగెత్తకగా అడవి కుక్క ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. పెద్దశబ్ధం చేస్తూ పులిని బెదిరించింది. కుక్క చేసిన వింత శబ్దానికి పులి కూడా భయపడి అక్కడే ఆగిపోయింది. కాసేపటికి మళ్లీ వెంటాడుతూ పరుగెత్తింది.ఆ అడవి కుక్క శబ్ధం విని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సౌండ్‌ను ఇంతవరకు ఎక్కడ వినలేదని, సహజంగా అడవి కుక్కలు ఈ రకంగా శబ్దం చేయవని, విచిత్రమైన శబ్దం. అమేజింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
కావేరీ ఇష్యూ: కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
మధురై, తమిళనాడు : కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడుల మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందంటూ కర్ణాటక సీఎం కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మధురైలోని శ్రీ మీనాక్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవుడి దయతో ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు కురిస్తే.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయంటూ వ్యాఖ్యానించారు. కాబినీ డ్యామ్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటని విడుదల చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించానని కుమారస్వామి తెలిపారు. తద్వారా రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం కర్ణాటక డ్యామ్‌లలో ఇన్‌ఫ్లో పెరిగిందని పేర్కొన్నారు. ఇకపై కావేరి జలాల పంపకం విషయంలో అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వరుణుడు కరుణిస్తే.. కావేరీ జలాల యాజమాన్య సంస్థ, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ చివరి నాటికి తమిళనాడుకు 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కాగా కాబినీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలన్న కుమారస్వామి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ‘మక్కల్ నీది మయ్యం పార్టీ’ వ్యవస్థాపకుడు కమల్ హసన్ తెలిపారు. ఈ మేరకు.. ‘ కాబినీ నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉంది. కావేరీ జలాల యాజమాన్య సంస్థ తన పనిని మొదలు పెట్టింది. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాల ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవుతాయి అంటూ కమల్ ట్వీట్ చేశారు. -
వన్యప్రాణుల నిలయం..కాబిని
పర్యాటక ప్రాంతాల్లో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కొన్ని చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం హాయిని కొల్పితే, మరికొన్ని చోట్ల అందమైన పక్షులు, అబ్బుర పరిచే జంతువులు ఆసక్తికి కలిగిస్తాయి. ఇంకొన్ని చోట్ల ఎత్తై కొండల నుంచి జాలువారే జలపాతాలు ప్రకృతి సోయగాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇలాంటి ప్రత్యేకతలన్నీ ఒకేచోట, అదీ మనకు అందుబాటు దూరంలో కొలువుదీరితే అంతకు మించిన పర్యాటక ప్రదేశం ఏముంటుంది చెప్పండి. అలాంటిదే కర్ణాటకలోని కాబిని అటవీ ప్రాంతం. రోజు ఆ విశేషాల గురించి తెలుసుకుందాం..! వర్షపాతం.. కాబిని డ్యామ్ కోసం ఇక్కడ ఒక పెద్ద సరస్సును ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్న ఒక గ్రామం పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా ఆ గ్రామం పేరుతో ఆ సరస్సుకు 'మస్తగుడి సరస్సు' అని నామకరణం చేశారు. నాగర్ హూల్ అటవీ ప్రాంతాన్ని, బండిపుర అటవీ ప్రాంతాన్ని ఈ డ్యామ్ వేరుచేస్తోంది. ఇక్కడ పడే వర్షపాతంలో వైవిధ్యాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో వృక్షాలు చిన్నవిగాను, మరికొన్ని ప్రాంతాల్లో వృక్షాలు పెద్దవిగాను ఉంటాయి. ఏటా ఇక్కడ 1000 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది. ఆహ్లాదకర వాతావరణం.. అడవుల్లో నడక, ట్రెక్కింగ్, బోట్ విహారం, సైకిలింగ్, పక్షుల గమనం, రాత్రుల్లో చలిమంటలు, స్థానిక గ్రామాల సందర్శనలతో ఎంతో ఆనందం పొందొచ్చు. కాబిని దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందుతోంది. కర్నాటకలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. జంతు వీక్షణం.. అడవిలో సఫారీపై వెళితే అనేక జంతువులను దగ్గర నుంచి చూడొచ్చు. కాబినిలో 300 రకాలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం పక్షి ప్రేమికులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏనుగుల సఫారి. సరస్సుల్లో బోట్ షికారు చేస్తూ అక్కడి మొసళ్లు, నీరు తాగే జింకలను చూసి ఆనందించొచ్చు. లెక్కకు మించిన జలపాతాలు.. ఈ ప్రాంతంలో లెక్కలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుంచి భూమి మీదకు పడుతుంటాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి దగ్గరలోని నదిలో కలుస్తుంది. ఈ వాటర్‌ఫాల్స్ నీరు అంత ఎత్తు నుంచి కిందపడే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తున లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటాయి. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్టు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం, ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం గొప్ప అనుభూతిని మిగిల్చే సాహసం. ఎక్కడ ఉంది..? కర్నాటకలోని కాబిని ప్రాంతం వన్య జీవులకు ప్రసిద్ధి చెందింది. ఇది నాగర్ హూలే అటవీ ప్రాంతంలోని భాగం. బెంగళూరుకు సుమారు 160 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్యాటక స్థలాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇది నాగర్హూల్ అటవీ ప్రాంతానికి ఆగ్నేయంగా ఉంది. సుమారు 55 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం దట్టమైన అడవులు, సరస్సులు, ప్రవాహాలతో నిండి ఉంది.