పర్యాటక ప్రాంతాల్లో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కొన్ని చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం హాయిని కొల్పితే, మరికొన్ని చోట్ల అందమైన పక్షులు, అబ్బుర పరిచే జంతువులు ఆసక్తికి కలిగిస్తాయి. ఇంకొన్ని చోట్ల ఎత్తై కొండల నుంచి జాలువారే జలపాతాలు ప్రకృతి సోయగాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇలాంటి ప్రత్యేకతలన్నీ ఒకేచోట, అదీ మనకు అందుబాటు దూరంలో కొలువుదీరితే అంతకు మించిన పర్యాటక ప్రదేశం ఏముంటుంది చెప్పండి. అలాంటిదే కర్ణాటకలోని కాబిని అటవీ ప్రాంతం. రోజు ఆ విశేషాల గురించి తెలుసుకుందాం..!
వర్షపాతం..
కాబిని డ్యామ్ కోసం ఇక్కడ ఒక పెద్ద సరస్సును ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్న ఒక గ్రామం పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా ఆ గ్రామం పేరుతో ఆ సరస్సుకు 'మస్తగుడి సరస్సు' అని నామకరణం చేశారు. నాగర్ హూల్ అటవీ ప్రాంతాన్ని, బండిపుర అటవీ ప్రాంతాన్ని ఈ డ్యామ్ వేరుచేస్తోంది. ఇక్కడ పడే వర్షపాతంలో వైవిధ్యాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో వృక్షాలు చిన్నవిగాను, మరికొన్ని ప్రాంతాల్లో వృక్షాలు పెద్దవిగాను ఉంటాయి. ఏటా ఇక్కడ 1000 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది.
ఆహ్లాదకర వాతావరణం..
అడవుల్లో నడక, ట్రెక్కింగ్, బోట్ విహారం, సైకిలింగ్, పక్షుల గమనం, రాత్రుల్లో చలిమంటలు, స్థానిక గ్రామాల సందర్శనలతో ఎంతో ఆనందం పొందొచ్చు. కాబిని దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందుతోంది. కర్నాటకలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఇదీ ఒకటి.
జంతు వీక్షణం..
అడవిలో సఫారీపై వెళితే అనేక జంతువులను దగ్గర నుంచి చూడొచ్చు. కాబినిలో 300 రకాలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం పక్షి ప్రేమికులకు స్వర్గధామంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏనుగుల సఫారి. సరస్సుల్లో బోట్ షికారు చేస్తూ అక్కడి మొసళ్లు, నీరు తాగే జింకలను చూసి ఆనందించొచ్చు.
లెక్కకు మించిన జలపాతాలు..
ఈ ప్రాంతంలో లెక్కలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుంచి భూమి మీదకు పడుతుంటాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి దగ్గరలోని నదిలో కలుస్తుంది. ఈ వాటర్‌ఫాల్స్ నీరు అంత ఎత్తు నుంచి కిందపడే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తున లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటాయి. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్టు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం, ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం గొప్ప అనుభూతిని మిగిల్చే సాహసం.
ఎక్కడ ఉంది..?
కర్నాటకలోని కాబిని ప్రాంతం వన్య జీవులకు ప్రసిద్ధి చెందింది. ఇది నాగర్ హూలే అటవీ ప్రాంతంలోని భాగం. బెంగళూరుకు సుమారు 160 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్యాటక స్థలాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఇది నాగర్‌హూల్ అటవీ ప్రాంతానికి ఆగ్నేయంగా ఉంది. సుమారు 55 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం దట్టమైన అడవులు, సరస్సులు, ప్రవాహాలతో నిండి ఉంది.