ప్రకృతిని కాపాడుకోవడంలో ముందంజ
చాలా చోట్ల కనిపించే వందల ఏళ్ల చెట్లు
ఇతర దేశాల నుంచి కలప దిగుమతి
మనుష్యుల ఆయుర్దాయం వంద సంవత్సరాలకు అటు ఇటు. అంతకు మించి వందలు, వేల సంవత్సరాలు బతికున్న మనుషులే కాదు ఏ ఇతర ప్రాణులు కూడా పురాణ కథల్లో తప్ప ఎక్కడా ఉండవు. కానీ, అలాంటి సజీవ సాక్ష్యాలు, ఇప్పటికీ బతికున్న చెట్లను మాత్రం మనం అమెరికాలో చూడవచ్చు. నా బాల్యంలో మా ఊళ్లో అతి పెద్దవృక్షం ఒక వేపచెట్టు. అది మా ఇంటికి సమీపంలోని ఓ అంగడి బజారులో మా గ్రామానికి నడిబొడ్డులా, బొడ్రాయిలా ఉండేది. పిల్లలు ఆడుకోవాలనుకున్నా.. పెద్దవాళ్లు పంచాయతీకి కూర్చోవాలన్నా.. నలుగురు చేరి ముచ్చట్లు పెట్టుకోవాలనుకున్నా.. కేరాఫ్ వేపచెట్టే. మా ఊళ్లో బస్టాండ్ నిర్మించే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తొలగించడంతో ఆ చెట్టు, మా జ్ఞాపకాలు రెండూ కాలగర్భంలో కలిసిపోయాయి.
ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పైడిమడుగు గ్రామంలో 5 ఎకరాల్లో విస్తరించి వున్న 800 సంవత్సరాల నాటి మర్రిచెట్టు కూడా చాలా కాలం జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఓ అగ్ని ప్రమాదంలో ఆ మహావృక్షం దెబ్బ తిని 2 ఎకరాలకే పరిమితం కావడం చేదుగా అనిపించే విషయం. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని 700 సంవత్సరాల నాటి మర్రిచెట్టు, అనంతపురం జిల్లా కదిరి పట్టణ సమీపంలోనున్న ‘తిమ్మమ్మ మర్రిమాను’ .. ఇవి పేరుకు చెట్లే అయినా.. మనిషి జీవితంలో, జ్ఞాపకాల్లో ఎంతో విస్తరించాయి. రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. చెట్టును కాపాడుకోవాలన్న తాపత్రయం. ఈ విషయంలో అమెరికాను మెచ్చుకోవచ్చు. నేను కుటుంబంతో కలిసి 2012లో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్ ఎంజెల్స్‌లో మా అబ్బాయి మమ్మల్ని ‘ సెకోయా నేషనల్ పార్క్ ’ తీసుకెళ్లాడు.
అక్కడ వేల సంవత్సరాల వయసున్న సెకోయా, షర్మాన్ మహావృక్షాలను చూసే భాగ్యం మాకు కలిగింది. వాటి దగ్గర నిలబడ్డప్పుడు మనమింత అల్పజీవులమా! అనిపించింది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో, సముద్ర మట్టానికి 14 వేలకు పైగా అడుగుల ఎత్తులోనున్న సెకోయా అడవిని, పక్కకే వున్న కింగ్స్ కాన్యన్‌లను యునెస్కో 1976 లో నే బయోస్పియర్ ( జీవావరణం ) రిజర్వులుగా గుర్తించిందట. లాస్ ఎంజెల్స్ నుంచి రాత్రి ఏడున్నరకు బయలుదేరితే, నాలుగున్నర గంటల కారు డ్రైవ్ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు సెకోయా అడవికి చేరుకున్నాము. మేము బుక్ చేసుకున్న గెస్ట్ హౌస్ దగ్గర అప్పుడు ఆ కీకారణ్యంలో మమ్మల్ని పలకరించే నరమానవుడు కనబడలేదు, జంతువుల అరుపులు మాత్రం వినబడ్డాయి. సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే అక్కడున్న మెయిల్ బాక్స్లో మీ పేరుతో తాళం చెవి పెట్టాము, తీసుకొని హాయిగా ఆ చెక్క ఇంటిలో విశ్రమించమన్నారు.
మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అక్కడున్న ‘ ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త ! ’ అన్న హెచ్చరిక బోర్డులను చూసి తుపాకి రాముళ్లలా చేతి కర్రలు పట్టుకొని లంచ్ టైం వరకు ఆ అడవి అంతా కలియ దిరిగాము. ఈపాటి అడవులు మనకూ వున్నాయి కాని అమెరికన్లలా మనం వాటిని కాపాడుకోలేకపోయాం, మన అడవుల్లోని మహా వృక్షాలు అడవి దొంగల పాలు ఆయిపోయాయి కదా! అన్న బాధ కలిగింది. అంతేకాదు అమెరికా వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు, తమ అడవులను సురక్షితంగా ఉంచుకుంటూనే, తమకు కావలసిన కలపను బయటి దేశాల నుండి తెప్పించుకుంటున్నారు. సాయంత్రం వరకు అడవిలో తిరిగి, అందులోని వాగులు వంకలు చూసి అక్కడి స్వచ్ఛమైన నీటిలో జలకాలాడి, అలసి సొలసి వచ్చి ఆ నిర్జనారణ్య అతిథి గృహంలో కూర్చుని తిన్న మామూలు రాత్రి భోజనం కూడా మృష్టాన్నంలా అనిపించింది.
తాగిన ద్రాక్షరసం కూడా అమృతంలా తోచింది. అదే నెలాఖరులో మేమంతా ‘ యోసేమైట్ నేషనల్ పార్క్ ’ కూడా వెళ్ళాము , ఆనాటి అనుభవాలు కూడా దాదాపు ఇలాంటివే. దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల్లోనున్న ఈ నిర్జన అడవి మధ్యలో పర్యాటకులకు ఏర్పాటు చేసిన ఆధునిక వసతులు చాలా బాగున్నాయి. ఇందులోని గ్రానైట్ కొండలు , హిమనీ నదాలు, ఇరుకు లోయలు, పచ్చిక బయళ్లు విశేషమైనవనే చెప్పాలి. 1984 లో ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం విశేషం. యోసేమైట్ లోని పర్వతాన్ని తొలిచి ఏర్పరచిన మార్గం, జలపాతం అద్భుతం. ఈ అడవిలో మూడు రాత్రులు ఉన్నాం.
వేముల ప్రభాకర్
(చదవండి: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!)
Comments
Please login to add a commentAdd a comment