దేవుని భూములను కొందరు కబ్జా.. చట్టారీత్యా నేరం..
కరీంనగర్: ధూప..దీప.. నైవేద్యం.. ఆలయాల పరిరక్షణకు దాతలు వితరణ చేసిన భూములను పర్యవేక్షించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో ఆలయ భూములు పరాధీనమవుతున్నాయి. ‘రాజుల సొమ్ము రాళ్లపాలు.. దేవుడి సొమ్ము దేశదిమ్మరుల పాలు’ అన్న చందంగా మారింది. దేవుడి సొమ్మే కదా అని తేరగా కబ్జాలకు పాల్పడుతుండడంతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి.
అధికారుల అలసత్వంతో ఇప్పటికే కొన్నిచోట్ల లీజుదారుల కబంధహస్తాల్లో భూమి చిక్కుకుపోయింది. భూములపై నిర్దిష్ట సమాచారం లేకపోవడం, సర్వే చేపట్టకపోవడంతో భూబకాసురుల చెర నుంచి విముక్తి చేయలేక కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 85 ఆలయాల పరిధిలో 1,089.34 ఎకరాలు ఉండగా.. అందులో 15 నుంచి 20 శాతం భూములు ఆక్రమణలో ఉన్నట్లు సమాచారం.
దేవాదాయ భూములకు సంబంధించి ఎక్కడికక్కడ హెచ్చరికబోర్డులు లేకపోవడం, వందల ఏళ్ల కిందటి భూములు కావడంతో రక్షణ కరువైంది. కాలక్రమేణా వీటి ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెద్దపల్లి నుంచి ఓ ప్రజాప్రతినిధే అక్రమంగా దేవాదాయ భూములు పట్టా చేయించుకున్నాడని హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో జిల్లాలో దేవాదాయ భూముల పరిరక్షణపై చర్చ నడుస్తోంది.
నేత, బంధువుల పేరిట పట్టాలు..
దేవుడి భూములు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే వాటికి ఎసరు పెడుతున్నారు. పెద్దపల్లి మండలంలోని పాలితం, బొంపల్లి, కనగర్తి, కాసులపల్లి, ధర్మాబాద్ గ్రామాల్లో 462.33 ఎకరాలు రంగనాయకుల స్వామి భూములు ఉన్నాయి. ఈ భూములను లీజుకు తీసుకొని ఏళ్లుగా పేదరైతులు సాగు చేసుకుంటూ.. ప్రభుత్వానికి కాస్తు(లీజు) డబ్బులు చెల్లించేవారు.
తాజాగా ధరణి పోర్టల్ వచ్చాక రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరుకు బదులు కొందరు రైతులు పేర్లు ఎక్కించుకున్నారు. అందులో ప్రజాప్రతినిధి, వారి కుటుంబసభ్యులు సైతం ఉన్నారు. ధరణి పోర్టల్లో పలువురు రైతులతోపాటు ఆ నాయకుడి కుటుంబ సభ్యుల పేరిట పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అయినా వాటిని ఇంకా దేవాదాయశాఖ భూములుగానే చూపెడుతుండడం గమనార్హం.
పాసుపుస్తకాలు జారీకావడంతో సదరు ఆక్రమణదారులు రైతుబంధు పొందుతున్నారు. ఆ ఆలయ భూములను పరిరక్షించాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్షక్ జాపతి రాజేశ్పటేల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సదరు నాయకుడితో సహా పలువురు రైతులకు, ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీచేసింది.
ఎన్నికల అఫిడవిట్లో
వ్యవసాయ భూములుగా..
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సదరు నాయకుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన పేరిట ఉన్న భూముల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో కాసులపల్లిలో తనకు వ్యవసాయ భూమి ఉన్నట్లు చూపించారు. సదరు భూమి ధరణి పోర్టల్లో చూస్తే ఆ నేత పేరు చూపుతూనే.. అవి దేవాదాయశాఖ భూములుగా చూపుతుండడం గమనార్హం.
ఇంకా ఆ సర్వే నంబర్లలోని భూములకు నాయకుడు రైతుబంధు తీసుకుంటుండగా, ప్రస్తుతం పొజిషన్లో ఆ సర్వేనంబర్లలో నాయకుడికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాల కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీంతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించడంతోపాటు అర్హత లేకున్నా రైతుబంధు పొందుతుండడంపై వివిధ రాజకీయ పక్షాల నేతలు మండిపడుతున్నారు. స్థానిక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతోనే చర్యలు చేపట్టడం లేదని కోర్టుల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.
పేర్లు ఎక్కిస్తామని డబ్బుల వసూలు..
రంగనాయకులస్వామి పరిధిలోని భూములను కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వారిలో చిన్న, సన్నకారు రైతులు, భూస్వాములు, రాజకీయనేతలు ఉన్నారు. ధరణి పోర్టల్ వచ్చాక పలువురు నేతలు భూములను రైతుల పేరిట ఎక్కిస్తామని ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. ఆ సొమ్ముతో కొందరు మాత్రమే తమ పేరిట భూములను ధరణిలో ఎక్కించుకోగా.. మిగతా సాధారణ చిన్న, సన్నకారు రైతులు మోసపోయారు.
స్థానిక బడా నేత, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు విజయవంతంగా ధరణిలో పేరు ఎక్కించుకోవడంతో వారికి రైతుబంధు అందుతుండడం విశేషం. ధరణిలో ఎండోమెంట్ భూములు అని చూపుతున్నా ప్రభుత్వం రైతుబంధు చెల్లిస్తుండడం గమనించాల్సిన విషయం.
రెండేళ్ల కిందే ప్రభుత్వానికి నివేదించాం..
పాలితం గ్రామంలోని రంగనాయకుల స్వామికి చెందిన దాదాపు 400 ఎకరాలకుపైగా భూములు అన్యాక్రాంతమయ్యాయని గతంలోనే నివేదిక ఇచ్చాం. చాలా ఏళ్ల కింద స్థానికులు దేవుని మాన్యం భూములను సాగుపేరిట లీజుకు తీసుకున్నారు. వారిలో కొందరు అక్రమార్గంలో పట్టాలు పొందారు. అక్రమంగా రైతుబంధు కూడా పొందుతున్నారు. ఈ విషయాన్ని 2021లోనే పెద్దపల్లి కలెక్టర్కు, ప్రభుత్వానికి నివేదిక పంపాం. మా దేవాదాయశాఖ కమిషనర్ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. వారికి వెంటనే రైతుబంధు నిలిపివేయాలని నివేదికలో పొందుపరిచాం. – ఏసీ చంద్రశేఖర్
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి..
దేవాదాయ భూములను ఇతరులకు విక్రయించడం, వాటిని కొనుగోలు చేయటం చట్టరీత్యా నేరం. రాజకీయ పలుకుబడి కలిగిన నేత, అతని బంధువులు మాత్రమే పట్టాలు చేయించుకున్నారు. నిజంగా సాగు చేసుకునే పేద, సన్నకారు రైతుల పేర్ల మీద పట్టాలు జారీకాలేదు. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సాగుచేసుకోకుండా అందులో వ్యాపారాలు చేసుకునే వారి భూములను ప్రభుత్వం స్వాఽధీనం చేసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. దీనిపై పలుసార్లు అధికారులను కలిసినా రాజకీయ ఒత్తిళ్లతో ఎవరూ పట్టించుకోవడం లేదు. – సత్యనారాయణరెడ్డి, న్యాయవాది