చెరువులకు మహర్దశ
- అమల్లోకి ‘సరోవర సంరక్షణ, అభివృద్ధి చట్టం’
- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
సాక్షి, బెంగళూరు: కబ్జాదారుల చేతుల్లో బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రముఖ చెరువులకు మహర్దశ పట్టనుంది. కనుమరుగవుతున్న చెరువులు, సరస్సులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. చెరువుల రక్షణ, అభివృద్ధికి రూపొందించిన సరోవర సంరక్షణ, అభివృద్ధి చట్టం శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఇదే సందర్భంలో చెరువుల సంరక్షణ, అభివృద్ధికి నూతనంగా ఏర్పాటు చేసిన ‘లేక్ డెవలప్‌మెంట్ అథారిటీ’ సైతం శుక్రవారం నుంచే తన పనులను ప్రారంభించిందని వెల్లడించారు.
శుక్రవారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో నిర్వహించిన విశ్వ పర్యావరణ దినోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎక్కడ చెరువుల కబ్జా జరిగినా, వాటిని అడ్డుకొని చెరువులను సంరక్షించే దిశగా ఈ అథారిటీ విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. గతంలో బెంగళూరులో వందలాది చెరువులు ఉండేవని, అయితే నగరంలో జనాభా పెరుగుదల, పరిశ్రమల ఏర్పాటు కారణంగా అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు. ఈ కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణల నడుమ సమతుల్యం తప్పనిసరని ఈ సందర్భంగా సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.
ఇక పర్యావరణ రక్షణ, నగరాన్ని శుభ్రంగా ఉంచడం కేవలం బీబీఎంపీ విధులు మాత్రమే కావని, ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని సూచించారు. కోటికి పైగా జనసంఖ్య ఉన్న బెంగళూరు నగరంలో రోజుకు 3.5 నుంచి 4.5 వేల టన్నుల చెత్త ఏర్పడుతోందని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడే చెత్తను పడేయడం, నీటిని శుద్ధి చేయకుండా చెరువుల్లోకి వదిలేయడం తదితర పనులతో గార్డెన్ సిటీ కాస్తా గార్బేజ్ సిటీ అనే అపఖ్యాతిని మూటగట్టుకుందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో నగరంలోని చెత్తను శుద్ధి చేసేందుకు నగరంలో ఆరు ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం విశ్వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కంఠీరవ ప్రాంగణంలో సిద్ధరామయ్య మొక్కలను నాటారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి రామనాథ్ రై, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు వామనాచార్య తదితరులు పాల్గొన్నారు.