ప్రాణ భయంతో తప్పించుకునే యత్నంలో...
కాబూల్ : హోటల్ ఉగ్ర దాడి ఘటనకు సంబంధించి ఓ వీడియో ఫుటేజీ అఫ్ఘన్ వార్త ఛానెళ్లలో చక్కర్లు కొడుతోంది. ఓ పక్క ఉగ్రవాదులు మారణహోమం కొనసాగిస్తుంటే.. మరోపక్క ప్రాణ భయంతో కొందరు తప్పించుకోవాలని ప్రయత్నించటం అందులో నమోదు అయ్యింది.
బాంబు దాడితో హోటల్లోని పై అంతస్థులో మంటలు ఎగిసిపడుతుండగా.. పక్క పోర్షన్ నుంచి కొందరు తప్పించుకునే ప్రయత్నం చేశారు. బెడ్ షీట్ల సాయంతో బాల్కనీ నుంచి దూకేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ఓ వ్యక్తి కింద పడిపోగా.. మరొకరిని కింది ఫ్లోర్లో ఉన్న వ్యక్తి కాపాడాడు. దూరం నుంచి ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి మీడియాకు అందించాడు. గ్రెనేడ్లతో తుపాకులతో దూసుకొచ్చిన ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్లు కాల్చుకుంటూ పోయారని.. తాము మాత్రం ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నామని తప్పించుకున్న అహ్రుద్దీన్ తెలిపాడు. తన స్నేహితుడు మాత్రం కిందపడి గాయాల పాలైనట్లు అతను వివరించాడు.
కాగా, శనివారం అర్ధరాత్రి ఇంటర్కాంటినెంటల్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా.. ఘటనలో ఓ విదేశీయుడు సహా ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. హోటల్‌ను ఇంకా పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకోలేదన్న అధికారులు.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.