భళా.. నల్ల బంగారం!
- కడక్‌నాథ్ కోడి మాంసంలో విశిష్టమైన ఔషధ గుణాలు
- వంద కోళ్లు పెంచితే 5 నెలల్లో రూ. 50 వేల నికరాదాయం
- వినియోగదారునికి ఆరోగ్యం.. రైతుకు అధికాదాయం..
- ప్రోత్సహిస్తున్న వైరా కృషి విజ్ఞాన కేంద్రం
కడక్‌నాథ్.. మధ్యప్రదేశ్ లోని దేశవాళీ కోళ్ల జాతి ఇది. నిలువెల్లా కారు నలుపులో ఉండటం వల్ల దీన్ని స్థానికులు కలిమసి (నల్లటి మాంసం కలిగిన పక్షి) అని పిలుస్తారు. దీని మాంసం కూడా నల్లగానే ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని దుర్భిక్ష ప్రాంతాలైన జబువా, ధార్ జిల్లాల్లో భిల్లులు, బిలాలా తదితర గిరిజనులు కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసుకొని కడక్‌నాథ్ కోళ్లను పెంచుతూ పేదరికాన్ని అధిగమిస్తున్నారు.
కడక్‌నాథ్ కోడి మాంసంలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మధ్యప్రదేశ్‌లోనే గాక హైదరాబాద్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ వంటి ప్రాంతాల్లోను కడక్‌నాథ్ కోడి మాంసానికి మంచి గిరాకీ ఏర్పడింది. నరాల వ్యాధులను తగ్గించే హోమియో మందుల తయారీకి అవసరమైన ఔషధ గుణాలు కడక్‌నాథ్ మాంసంలో ఉన్నాయి. ఈ మాంసంలో ఇనుము పాళ్లు ఎక్కువగా, కొవ్వు పాళ్లు తక్కువగా ఉన్నాయని బెంగళూరుకు చెందిన కేంద్రీయ ఆహార పరిశోధనా సంస్థ తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్త్మాతో బాధపడే వారికి కడక్‌నాథ్ మాంసాన్ని మేలైన ఆహారంగా సిఫారసు చేస్తున్నారు. ఈ కారణాల వల్ల కడక్‌నాథ్ మాంసానికి విపరీతమైన గిరాకీ ఏర్పడి మంచి ధర పలుకుతోంది.
అయితే, పెరటి కోళ్లలా సంప్రదాయ పద్ధతుల్లో పెంచటం, సరైన వ్యాధి నివారణ చర్యలు పాటించకపోవటం, వినియోగం పెరిగి ఉత్పత్తి తగ్గటం వంటి కారణాలతో ఈ మధ్యకాలంలో కడక్‌నాథ్ కోళ్ల సంఖ్య భారీగా పడిపోయింది. మంచి గిరాకీ ఉండటాన్ని గుర్తించిన జబువా కృషి విజ్ఞాన కేంద్రం ఈ దేశవాళి కోడి జాతి అంతరించిపోకుండా కాపాడేందుకు నడుం బిగించింది.
ముందుగా జబువా జిల్లాలోని జయదా ప్రాంతంలో శాస్త్రవేత్తలు పర్యటించి సమస్యను అధ్యయనం చేశారు. పెంపకంలో సంప్రదాయ పద్ధతులను అనుసరించటం వల్ల కోళ్ల బరువు పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉంది. వ్యాధి చికిత్స, నియంత్రణలో శాస్త్రీయ పద్ధతులను పాటించకపోవటం వల్లే సగం కోళ్లు చనిపోతున్నట్టు వారు గుర్తించారు. రైతులకు కడక్‌నాథ్ కోళ్ల పెంపకంతో కలిగే లాభాలపై అవగాహన క ల్పించారు.
స్థిరమైన ఆదాయంతో వలసలకు చెక్..
ముందుగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.)కి చెందిన జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ ప్రణాళికా సంస్థ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చులోనే కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసింది. కోడి పిల్లల ఉత్పత్తి కోసం జబువాలోని కృషి విజ్ఞాన కేంద్రానికి ఐ.సి.ఎ.ఆర్. రూ. 50 లక్షలు మంజూరు చేసింది. కృషి విజ్ఞాన కేంద్రం ప్రతి నెలా 5 వేల కడక్‌నాథ్ కోడి పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తోంది. ఎంపిక చేసిన 500 మంది రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. నాణ్యమైన మేత తయారీ, వ్యాధి నిరోధక టీకాలు వేయటంలో శిక్షణనిచ్చారు. కాలానుగుణంగా టీకాలు వేయటం వల్ల కోళ్ల మరణాలు 50 నుంచి 10 శాతానికి తగ్గాయి.
5 నెలల్లో అమ్మకానికి వస్తాయి..
ధాన్యం, ఊక వంటి స్థానికంగా లభించే వనరులతో రైతులే స్వయంగా దాణాను తయారు చేసుకుంటున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గటంతో పాటు కోళ్లకు పోషకాలతో కూడిన ఆహారం లభించి వేగంగా బరువు పెరిగాయి. 5 నెలల్లో పుంజులు 3 కిలోలు, పెట్టలు 2 కిలోల బరువు పెరుగుతున్నాయి. ఒక్కో కోడి పిల్ల కొనుగోలు ధర రూ. 60., మేత, టీకాలు వంటివాటికి మరో రూ. 200 ఖర్చవుతుంది. కడక్‌నాథ్ కోళ్లు ఐదు నెలల్లో అమ్మకానికి వస్తాయి.. కిలో రూ. 350 చొప్పున.. కోడిని ఏకమొత్తంగా అయితే రూ. 800 కు విక్రయిస్తున్నారని జబువా కృషి విజ్జాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఐ. ఎస్. తోమర్ (09425 188028, 07392-244367) ‘సాగుబడి’కి తెలిపారు. అయితే, ఈ జాతి కోడిపెట్టలు గుడ్లను పొదగవు. వీటి గుడ్లను నాటుకోళ్ల కింద వేసి పొదిగించుకోవాలి. లేదా ఇంక్యుబేటర్ వాడాల్సి ఉంటుంది.
కనీసం వంద కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్న రైతు ఐదు నెలల్లో రూ. 50 వేల నికరాదాయం పొందుతున్నారు. విడతకు 500 వరకు కడక్‌నాథ్ కోళ్లను పెంచే రైతులు ఉన్నారు. అంటే ఒక్కో రైతు తక్కువలో తక్కువ ఏడాదికి రూ. లక్షపైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కోళ్ల విక్రయానికి అవసరమైన విపణి వ్యవస్థ అభివృద్ధి చెందటంతో కడక్‌నాథ్ కోళ్లను పెంచే ఫారాల సంఖ్య 300 కు చేరింది. క్రమంగా మరికొందరు రైతులు అదేబాటలో పయనిస్తూ.. స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి జీవనోపాధి కోసం జరిగే వలసలు నిలిచిపోయాయి. జిల్లా పరిపాలనా సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జయదాకు చెందిన కడక్‌నాథ్ కోళ్ల పెంపకందారుల సంఘాన్ని, అవార్డ్, నగదు పురస్కారంతో సన్మానించింది. కడక్‌నాథ్ కోళ్ల పెంపకంలో జబువా జిల్లా వాసులు సాధించిన విజయం దేశంలోని ఇతర వెనుకబడిన కరవు ప్రాంతాల కు స్ఫూర్తిదాయకం.
కడక్‌నాథ్ కోడి పిల్ల ధర రూ. వంద!
ఖమ్మం జిల్లా వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. జూన్ ఆఖరు నాటికి కడక్‌నాథ్ కోడి పిల్లలను రైతులకు అందుబాటులోకి తెస్తామని, పిల్ల ధర రూ. వంద ఉంటుందని వైరా కేవీకే సమన్వయకర్త డా. జె. హేమంత్‌కుమార్ (99896 23831) ‘సాగుబడి’తో చెప్పారు. సజ్జలు, జొన్నలు వంటి స్థానికంగా అందుబాటులో ఉండే చిరుధాన్యాలతో తయారు చేసుకున్న దాణాతోపాటు అజొల్లాను సైతం మేపవచ్చని ఆయన అన్నారు.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్