వేశ్యావాటికలో పుట్టిన నటుడు
మురికికూపాల్లో కూడా మాటలు పూస్తాయి.కష్టాలు చితక్కొట్టిన వేళ్లు కలాన్ని దృఢంగా పట్టుకోవడానికి చూస్తాయి.‘జిస్కా కోయీ నహీ ఉస్కాతో ఖుదా హై యారో’ (ఎవరూ లేనివారికి భగవంతుడే తోడు) అని‘మొకద్దర్ కా సికిందర్’లో ఒక డైలాగ్.ఖాదర్ ఖాన్‌కి దేవుని తోడు తప్ప మరేతోడూ లేదు. మాటను ఊతంగా చేసుకుని అతడు ఎక్కిన ఎత్తు తలెత్తి చూడతగ్గది!
చెట్టు మీద కాయకూ సముద్రంలో ఉప్పుకూ సంబంధం ఉందో లేదో కాని ఖాదర్ ఖాన్‌కూ మన అల్లు రామలింగయ్యకు మాత్రం సంబంధం ఉంది. నిజానికి ఖాదర్ ఖాన్ తన ఇంట్లో ఫొటో పెట్టుకోదగ్గ మేలు అల్లు రామలింగయ్య చేశారనే చెప్పాలి. కథ ఇది. తెలుగులో ‘ఊరికి మొనగాడు’ (1981) సినిమా చాలా పెద్ద హిట్. హిందీలో దానిని ‘హిమ్మత్ వాలా’ (1983)గా రీమేక్ చేశారు. దర్శకుడు తెలుగును తీర్చిదిద్దిన రాఘవేంద్రరావే. అప్పటికి హిందీలో ఖాదర్‌ఖాన్ నటుడుగా, రచయితగా గుర్తింపు పొందాడు. నటుడుగా నెగెటివ్ రోల్స్, అప్రధానమైన రోల్స్ చేస్తున్నాడు. రచయితగా హిట్ సినిమాలు ఇస్తున్నాడు.
దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయితే కొత్తగా రాస్తున్న రచయితవైపు చూడటం సహజం. అలా రాఘవేంద్రరావు దృష్టి ఖాదర్ ఖాన్ మీద పడింది. తెలుగు సినిమా చూసి సంభాషణల సారం అర్థం చేసుకొని హిందీ వెర్షన్‌కు డైలాగ్స్ రాశాడు ఖాదర్ ఖాన్. ఆ డైలాగ్స్‌ను క్యాసెట్లో రీడింగ్ ఇచ్చి మద్రాసు పంపాడు. వాటిని విన్న రాఘవేంద్రరావు వెంటనే బాంబేకి (అప్పట్లో అలానే పిలిచేవారు) ఫ్లయిట్ కట్టుకుని వెళ్లి ఖాదర్‌ఖాన్‌ని కలిశారు. ‘డైలాగ్స్ చాలా బాగా రాశావు. హీరో జితేంద్ర కాబట్టి, విలన్ అంజాద్‌ఖాన్ కాబట్టి దిగుల్లేదు. కాని అల్లు రామలింగయ్య పాత్రకు నువ్వు రాసిన డైలాగులు చెప్పే యాక్టర్ హిందీలో ఎవరు? ఆ ఫ్లో, ఆ టైమింగ్ నువ్వు చదువుతుంటే ఆ పాత్ర నీదే అనిపించింది. నువ్వు చెయ్ దానిని’ అన్నారు. ‘నేనా... కామెడీయా’ అన్నాడు ఖాదర్ ఖాన్. ‘నువ్వే... కామెడీవే. నువ్వు చేస్తే హిందీలో అల్లు రామలింగయ్య అంతటివాడివవుతావు’ అన్నారు రాఘవేంద్రరావు. ‘హిమ్మత్వాలా’లో ఖాదర్ ఖాన్ ఆ పాత్ర చేశాడు. ఏ ముహూర్తాన చేశాడో చనిపోయేనాటి వరకు కామెడీ కింగ్‌గానే బతికాడు. అతడికి ఆ హాస్యకిరీటం పెట్టిన చేతులు తెలుగు వారివి అయినందుకు మనం సంతోషపడాలి.
ఖాదర్ ఖాన్ తెర జీవితం నవ్వులతో పండింది కాని అతడి బాల్యం కన్నీటి ఉప్పదనంతో బిరుసెక్కిపోయింది. అప్ఘనిస్తాన్‌లో కొండగాలికి పుట్టిన ముగ్గురు కొడుకులు చనిపోతే మిగిలిన నాలుగో కొడుకైనా బతకాలి అని చెప్పి ఆరేడేళ్ల ఖాదర్‌ఖాన్‌ను వెంటబెట్టుకుని అతని తల్లిదండ్రులు కాబూల్ నుంచి బాంబేకి వచ్చిపడ్డారు బిడారుతో కలిసి. చేతిలో చిల్లిగవ్వ లేదు. చిల్లి లేని గవ్వ కూడా ఆ నగరంలో ఊరికే రాదు. అందుకు కష్టపడాలి. కష్టపడాల్సిన తండ్రి భార్యను, బిడ్డను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. తల్లీకొడుకులకు వేరే దారి లేక వేశ్యవాటికకు ఆసియా ఖండంలోనే పేరుపడ్డ కామాటిపుర మొదటి వీథిలో చిన్నగదిలోకి వచ్చి చేరారు. చుట్టూ వేశ్యలు, విటులు, తార్పుడుగాళ్లు, తాగుబోతులు, తగాదాలు, అల్లర్లు, అలగా జనాల బతుకు ఆక్రందనలు వీటిని వింటూ ఖాదర్ ఖాన్ పెరిగాడు. పెద్దలు తల్లికి మరో పెళ్లి చేస్తే మారుతండ్రి చేతిలో బాధలు పడ్డాడు. చదువు మానేద్దామనుకుంటే తల్లి ఒట్టు వేయించుకుంది– చదవాల్సిందేనని. ఒక పఠాన్ కంఠాన్ని తెగ్గోసుకోగలడుకాని మాట తప్పలేడు. తల్లి మాట కోసం టెక్నికల్ విద్యను పూర్తి చేసిన ఖాదర్‌ఖాన్ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలేజీలో పాఠాలు చెప్తూ ఖాళీ సమయాల్లో నాటకాలు వేస్తూ ముంబై మహానగరంలో ఉనికికి ప్రయత్నించాడు. అతడి దర్శకత్వంలో అప్పటికి పైకి రాని రాజేశ్ ఖన్నా నటించాడు. ఆ పరిచయంతో దర్శకుడు మన్మోహన్ దేశాయ్‌కు పరిచయం చేశాడు. అలా ‘రోటీ’ (1974) రచయితగా ఖాదర్ ఖాన్‌కు గుర్తింపు తెచ్చిన తొలి సినిమా అయ్యింది.
అయితే అసలు కథ ఇంకా మొదలుకావాల్సి ఉంది. ఆ వెంటనే మన్మోహన్ దేశాయ్ ‘అమర్ అక్బర్ ఆంటోని’ తలపెట్టాడు. అందులో ఒక మాస్ క్యారెక్టర్ అమితాబ్ చేయాలని ఖాదర్ ఖాన్‌కు చెప్పాడు. అప్పటి వరకు హిందీలో మాస్ క్యారెక్టర్లు వేరే తరహాగా ఉండేవి. ఖాదర్ ఖాన్ ఆ పాత్రను, భాషను మార్చాడు. కామటిపురాలో అలగా జనం మాట్లాడే ‘అపున్’, ‘దారు’, ‘బేవ్డా’ వంటి మాటలు పెట్టాడు. ఆ దిగువ భాష జనానికి పట్టింది. ఒక ట్రెండ్‌గా సెటిల్ అయ్యింది. యాంగ్రి యంగ్‌మేన్ అమితాబ్‌ను మాస్ హీరో అమితాబ్‌గా మార్చిన పెన్ ఖాదర్ ఖాన్‌దే. ఆ తర్వాత వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ల కాంబినేషన్లో ‘మొకద్దర్ కా సికిందర్’, ‘మిస్టర్ నట్వర్లాల్’, ‘యారానా’, ‘కూలీ’ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. ‘లావారిస్’ సినిమాలో అమితాబ్ ఒక ఫైట్‌లో సకల భాషల రౌడీలను కొడతాడు– ఆ భాషలు మాట్లాడుతూ. తెలుగు కూడా మాట్లాడటం తమాషాగా ఉంటుంది. జనం కేరింతలు కొట్టే ఈ తమాషాలు ఖాదర్ ఖాన్‌వే. ఖాదర్ ఖాన్ తెలుగు నుంచి రీమేక్ అయిన చాలా సినిమాలకు రాశాడు. తెలుగు నటులు పోషించిన పాత్రలను పోషించాడు. ‘జస్టిస్ చౌదరి’ (జస్టిస్ చౌదరి), ‘జాని దోస్త్’ (అడవి సింహాలు), ‘మవ్వాలి’ (చుట్టాలున్నారు జాగ్రత్త), ‘తోఫా’ (దేవత), ‘మక్సద్’ (ముందడుగు), ‘హైసియత్’ (సీతారాములు), ‘ఖైదీ’ (ఖైదీ), ‘సింఘాసన్’ (సింహాసనం) ఇవన్నీ ఖాదర్ ఖాన్ రాసి, నటించిన సినిమాలు.
ఖాదర్ ఖాన్ హిందీ సినిమా రంగంలో చాలామందికి సుదీర్ఘమైన కెరీర్ ఇచ్చాడు. డేవిడ్ ధావన్ వంటి దర్శకుడు తయారవడంలో ఖాదర్ ఖాన్ పాత్ర ఉంది. కథల వరుస ఎలా ఉండాలో అని అగమ్యంగా ఉన్న నటుడు గోవిందాని కామెడీ బాట పట్టించినవాడు ఖాదర్ ఖాన్. గోవిందా, ఖాదర్ ఖాన్, శక్తికపూర్లు కలిసి 1990లలో ఒక పదేళ్ల పాటు తెర మీద చాలా సందడి చేశారు. అది టేస్ట్ ఉన్న కామెడీ కాకపోవచ్చు కాని నవ్వొచ్చే కామెడీయే. ఖాదర్ ఖాన్ కోపం మనిషి. పటాటోపాలు నచ్చని మనిషి. అమితాబ్ తన స్టేటస్‌ను పెంచుకోవడంలో భాగంగా తనను అందరూ ‘సర్జీ’ అని పిలవాలని బాలీవుడ్లో ఆదేశాలు జారీ చేసినప్పుడు ‘అతన్ని నేను అమిత్ అని పిలవడం అలవాటు. నా అలవాటును మార్చుకోను. అతనితో పని చేయను’ అని తెగేసి చెప్పి అలాగే ఉన్న నటుడు ఖాదర్ ఖాన్.
‘నా చేతి వాచీ లక్ష రూపాయలు తెలుసా’ అని గోవిందా ఫోజు కొడితే ‘నా చేతివాచీ నూట యాభయ్యే. అది కూడా కరెక్ట్ టైమే చూపిస్తుంది’ అని వాత వేసినవాడు అతను. కాలం మారాక ఖాదర్‌ఖాన్ మెల్లగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఉర్దూ, అరబ్బీలు నేర్పే ఇన్స్టిట్యూషన్ నడిపాడు. పేద ముస్లింలు హజ్ యాత్ర చేయడానికి సాయపడే సంస్థను నిర్వహించాడు. ఆయన పిల్లలు కెనడాలో స్థిరపడ్డారు. అక్కడే ఆయన డిసెంబర్ 31, 2018న 81వ ఏట కన్ను మూశాడు. గట్టి ఎదురుదెబ్బలను, గొప్ప జీవితానుభవాలను సిరా చుక్కలుగా మార్చుకోగలిగినవాడు రచయితగా రాణించగలడని, సులువు తెలిసినవాడు నటుడుగా వెలగగలడని చెప్పినవాడు ఖాదర్ ఖాన్. రాసి రాసి అలసిపోయిన ఆ నట రచయితకు వీడ్కోలు చెప్పి అతడు పూయించిన నవ్వులను పెదాల మీదకు తెచ్చుకోవడమే అతనికి మనం అర్పించగలిగిన నివాళి.
– కె.