kadium sri hari
-
నాలుగంచెల్లో జోనల్!
-
నాలుగంచెల్లో జోనల్!
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థలో మార్పుచేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ముందుగా జోన్లను రద్దు చేసి ప్రస్తుతమున్న పోస్టులన్నీ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోస్టులుగా వర్గీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త జోన్ల ఏర్పాటు దిశగా ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అదే దిశగా కార్యాచరణను చేపట్టాలని, అందుకు వీలుగా రాష్ట్ర పతి ఉత్తర్వుల సవరణలకు అవసరమైన నివేదికను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రతిపాదనలు, వివిధ సమస్యలపై కమిటీ చర్చించినట్లు తెలిసింది. ప్రాథమికంగా జరిగిన కసరత్తు మేరకు రాష్ట్రంలో జోన్ల వ్యవస్థ కొత్త రూపును సంతరించుకోనుంది. ప్రస్తుతమున్న 2 జోన్ల స్థానంలో మొత్తం 5 జోన్లు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో మూడంచెల జోనల్ వ్యవస్థ అమల్లో ఉంది. రాష్ట్రస్థాయి, జోనల్, జిల్లా స్థాయిగా పరిగణించే ఈ విధానానికి తగినట్లుగా పోస్టులు, ఉద్యోగులున్నారు. కొత్త వ్యవస్థలో ఈ మూడంచెల విధానాన్ని నాలుగంచెలుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రస్థాయి, జోనల్, జిల్లా స్థాయితోపాటు కొత్తగా మల్టీ జోన్లను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన సమావేశంలోనే తన ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్, హెచ్వోడీలు, సొసైటీలు, కార్పొరేషన్లు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేవు. కొత్త వ్యవస్థలో తీసుకునే నిర్ణయంతో ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి చేరతాయి. తద్వారా సొసైటీలు, కార్పొరేషన్ల నియామకాలు సైతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరిధిలోకి తీసుకువచ్చే వీలుంటుంది. బదిలీలు, పోస్టింగ్‌లకు వెసులుబాటు కొత్త వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇకపై ఒకచోటి నుంచి మరొకచోటికి బదిలీలకు, పోస్టింగ్‌లకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే మల్టీ జోనల్ పరిధిలో ఏయే ప్రాంతాలుంచాలి, కొత్తగా ఏర్పడే జోన్లలో ఏయే జిల్లాలను దేని పరిధిలో ఉంచాలనే అంశంపై రకరకాల ప్రతిపాదనలున్నాయి. వీటన్నింటినీ కమిటీ పరిశీలనకు స్వీకరించింది. ఈ కసరత్తులో భాగంగా హైదరాబాద్, రాష్ట్ర సచివాలయం, ఇతర హెచ్వోడీలను ఒక మల్టీజోన్‌గా పరిగణించే అవకాశాలున్నాయి. మిగతా జిల్లాలను మరో రెండు లేదా ఒక మల్టీ జోన్‌గా చేసే ప్రతిపాదనలున్నాయి. తొలి భేటీలో ప్రాథమిక చర్చలు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం సచివాలయంలో తొలిసారి సమావేశమైంది. పరిపాలన సౌలభ్యానికి వీలుగా 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కొత్త జోనల్ విధానం, స్థానికతను నిర్వచించడం, రాష్ట్రపతి నిబంధనల సవరణ, కొత్త రాష్ట్రపతి నిబంధనల రూపకల్పనపైనే ఇందులో చర్చించారు. సీఎం సూచనల మేరకు జిల్లాల్లోని స్థానికులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర, మల్టీ జోనల్, జోనల్, జిల్లాస్థాయి పోస్టుల విభజన ఎలా జరగాలి, జిల్లా క్యాడర్ ఎలా ఉండాలి.. అనే దానిపై అధికారుల నుంచి కమిటీ ప్రాథమిక సమాచారం తీసుకుంది. త్వరలోనే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలని తీర్మానించింది. మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్.కె.జోషి, సురేశ్ చందా, బి.ఆర్.మీనా, అజయ్ మిశ్రా, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్ రావు, సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగులతో పాటు ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన అంశం కావటంతో మరిన్ని చర్చ లు, సమావేశాల తర్వాతే నిర్ణయానికి రానున్నారు. ఈ నెల 21న మరోసారి కమిటీ సమావేశం కానుంది. -
తెలంగాణను అడ్డుకున్న వారే.. ప్రగతినీ
హన్మకొండ కల్చరల్ (వరంగల్ జిల్లా): తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నవారే ప్రగతిని కూడా అడ్డుకుంటున్నారని.. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి ఇలాంటి వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి ఆమర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా మాట్లాడారు. దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందరెందరో వివిధ రకాలుగా కృషిచేశారని, తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారన్నారు. తీరా తెలంగాణ వచ్చే సమయానికి పక్కకు పోయినవారు కూడా ఉన్నారని అన్నారు. 15 ఏళ్లుగా ప్రభుత్వాలు అనుసరించిన అనాలోచిత చర్యల వల్ల విశ్వవిద్యాలయాలు కోలుకొలేనంతంగా దెబ్బతిన్నాయన్నారు. కేవలం 8మంది ప్రొఫెసర్లతో పాలమూరు విశ్వవిద్యాలయం కొనసాగడం బాధకరమని.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నియూమకాలు జరిగాయన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు భవిష్యత్‌లో న్యాక్ గుర్తింపు కష్టంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో మన విశ్వవిద్యాలయాలు ఉన్నత స్థానంలో ఉండాలంటే మంచి స్టాఫ్‌ను నియమించుకోవాలని, అప్పుడే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. చాన్స్‌లర్, వైస్ చాన్సలర్లను నియమించడానికి కొత్తచట్టాలను తేవడంలో కొంత అలస్యం జరుగుతోందన్నారు. త్వరలో విద్యావేత్తలతో ఈ విషయమై సమావేశమవుతానన్నారు. -
పార్టీల్లో ‘ఎమ్మెల్సీ’ కోలాహలం
ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు టీఆర్ఎస్లో భారీగా ఆశావహులు కడియం, తుమ్మలకు అవకాశం మరో రెండింటి కోసం నేతల్లో పోటీ ఐదోస్థానానికీ టీఆర్ఎస్ వ్యూహాలు ఓ సీటు కావాలంటున్న మజ్లిస్ కాంగ్రెస్‌కు ఒకటి ఖాయం, పోటీ చేస్తామంటున్న టీడీపీ హైదరాబాద్: శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్సీ ఆశావహుల్లో సందడి నెలకొంది. పదవులపై ఆశలు పెట్టుకున్న ఆయా పార్టీల్లోని నేతలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ ఒకటిన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. శాసనసభలోని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాలుగు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో స్థానం కోసం టీడీపీ బరిలో నిలవనుంది. ఈ స్థానానికి పోటీకి దిగాలని టీఆర్ఎస్ చూస్తోంది. మరోవైపు టీఆర్ఎస్తో స్నేహపూర్వక సంబంధాలున్న ఎంఐఎం కూడా తమకు ఓ సీటు కావాలని ఆశిస్తోంది. టీఆర్ఎస్లో తీవ్ర పోటీ అధికార టీఆర్ఎస్లో ‘మండలి’ కోలాహలం మొదలైంది. ఎమ్మెల్సీ ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీకి నాలుగు స్థానాలు ఖాయంగా వచ్చే అవకాశం ఉండటంతో ఈ పదవులకు తీవ్రమైన పోటీ ఏర్పడింది. రాష్ర్ట విభజన తర్వాత మండలిని సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకొని మండలి చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. ఇందుకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి మరోమారు అవకాశమివ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే టీడీపీ నుంచి పార్టీలో చేరిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్రావు, వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని కేబినెట్లోకి తీసుకున్నారు. వీరికి అనివార్యంగా మండలి సభ్యత్వం ఇవ్వాల్సిన పరిస్థితి. దీంతో వీరిద్దరినీ ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయడం ఖాయం. ఇక మిగిలిన రెండు స్థానాలకు అధినేత మదిలో ఎవరున్నారో అంచనా వేయడం కష్టమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, గతంలో ఎమ్మెల్యే కోటాలోనే ఎన్నికై కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన కేఆర్ ఆమోస్, నాగపురి రాజలింగం, కె.యాదవరెడ్డి వంటి వారు రేసులో ఉన్నారు. అలాగే టీడీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై గులాబీ తీర్థం పుచ్చుకున్న బోడకుంటి వెంకటేశ్వర్లు పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. కాగా, నాగపురి రాజలింగానికి మరోరకంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చి రేసు నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా రెండు స్థానాలకు ఇద్దరి పేర్లు ఖాయం కాగా, మరో రెండు స్థానాలకు ఎవరని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఐదో స్థానం కోసమూ అభ్యర్థిని పోటీకి పెట్టే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్న ఎం ఐఎం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోందని, ఐదో స్థానానికి ఆ పార్టీ తర ఫున ఎవరినైనా బరిలోకి దిం పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోటీ చేయనున్న టీడీపీ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి 16 మంది మద్దతు కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దింపనుంది. వరంగల్ జిల్లాకు చెందిన వేమిరెడ్డి నరేందర్‌రెడ్డికి అవకాశమిస్తారని ప్రచారంలో ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌కుమార్ గౌడ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మొన్నటిదాకా ఎమ్మెల్సీగా పనిచేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన అరికెల నర్సారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఒక్క సీటుకు.. ఢిల్లీ నిర్ణయం? కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఆ పార్టీకి శాసనసభలో 21 మంది సభ్యుల బలమున్నా, నలుగురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ సంఖ్య 17కి తగ్గింది. అయితే నర్సంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు కూడా ఉన్నందున ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాయంగా దక్కుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి జగన్నాథరావు కుటుంబంలో ఒకరికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వారెవ్వరికీ అవకాశం ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ పేరు కూడా ప్రచారంలో ఉంది.