పార్టీల్లో ‘ఎమ్మెల్సీ’ కోలాహలం | mlc issue in trs party | Sakshi
Sakshi News home page

పార్టీల్లో ‘ఎమ్మెల్సీ’ కోలాహలం

Published Sat, May 9 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

పార్టీల్లో ‘ఎమ్మెల్సీ’ కోలాహలం

పార్టీల్లో ‘ఎమ్మెల్సీ’ కోలాహలం

ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు టీఆర్‌ఎస్‌లో భారీగా ఆశావహులు
కడియం, తుమ్మలకు అవకాశం
మరో రెండింటి కోసం నేతల్లో పోటీ
ఐదోస్థానానికీ టీఆర్‌ఎస్ వ్యూహాలు
ఓ సీటు కావాలంటున్న మజ్లిస్  
కాంగ్రెస్‌కు ఒకటి ఖాయం,
పోటీ చేస్తామంటున్న టీడీపీ

 
హైదరాబాద్: శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్సీ ఆశావహుల్లో సందడి నెలకొంది. పదవులపై ఆశలు పెట్టుకున్న ఆయా పార్టీల్లోని నేతలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ ఒకటిన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. శాసనసభలోని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాలుగు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో స్థానం కోసం టీడీపీ బరిలో నిలవనుంది. ఈ స్థానానికి పోటీకి దిగాలని టీఆర్‌ఎస్ చూస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌తో స్నేహపూర్వక సంబంధాలున్న ఎంఐఎం కూడా తమకు ఓ సీటు కావాలని ఆశిస్తోంది.

టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ
అధికార టీఆర్‌ఎస్‌లో ‘మండలి’ కోలాహలం మొదలైంది. ఎమ్మెల్సీ ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీకి నాలుగు స్థానాలు ఖాయంగా వచ్చే అవకాశం ఉండటంతో ఈ పదవులకు తీవ్రమైన పోటీ ఏర్పడింది. రాష్ర్ట విభజన తర్వాత మండలిని సొంతం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకొని మండలి చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. ఇందుకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి మరోమారు అవకాశమివ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.

అయితే టీడీపీ నుంచి పార్టీలో చేరిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు, వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. వీరికి అనివార్యంగా మండలి సభ్యత్వం ఇవ్వాల్సిన పరిస్థితి. దీంతో వీరిద్దరినీ ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయడం ఖాయం. ఇక మిగిలిన రెండు స్థానాలకు అధినేత మదిలో ఎవరున్నారో అంచనా వేయడం కష్టమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, గతంలో ఎమ్మెల్యే కోటాలోనే ఎన్నికై కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన కేఆర్ ఆమోస్, నాగపురి రాజలింగం, కె.యాదవరెడ్డి వంటి వారు రేసులో ఉన్నారు. అలాగే టీడీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై గులాబీ తీర్థం పుచ్చుకున్న బోడకుంటి వెంకటేశ్వర్లు పేరు కూడా బలంగానే వినిపిస్తోంది.

కాగా, నాగపురి రాజలింగానికి మరోరకంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చి రేసు నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా రెండు స్థానాలకు ఇద్దరి పేర్లు ఖాయం కాగా, మరో రెండు స్థానాలకు ఎవరని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఐదో స్థానం కోసమూ అభ్యర్థిని పోటీకి పెట్టే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్న ఎం ఐఎం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోందని, ఐదో స్థానానికి ఆ పార్టీ తర ఫున ఎవరినైనా బరిలోకి దిం పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోటీ చేయనున్న టీడీపీ
మిత్రపక్షమైన బీజేపీతో కలిసి 16 మంది మద్దతు కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దింపనుంది. వరంగల్ జిల్లాకు చెందిన వేమిరెడ్డి నరేందర్‌రెడ్డికి అవకాశమిస్తారని ప్రచారంలో ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌కుమార్ గౌడ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మొన్నటిదాకా ఎమ్మెల్సీగా పనిచేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన అరికెల నర్సారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
 
కాంగ్రెస్ ఒక్క సీటుకు.. ఢిల్లీ నిర్ణయం?
కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఆ పార్టీకి శాసనసభలో 21 మంది సభ్యుల బలమున్నా, నలుగురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ సంఖ్య 17కి తగ్గింది. అయితే నర్సంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతు కూడా ఉన్నందున ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాయంగా దక్కుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి జగన్నాథరావు కుటుంబంలో ఒకరికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వారెవ్వరికీ అవకాశం ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ పేరు కూడా ప్రచారంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement