Kakatiya Vaibhava Sapthaham
-
మురిసిపోయిన కాకతీయులు నడయాడిన నేల (ఫొటోలు)
-
కాకతీయ ఉత్సవాలు అద్భుతం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘‘మా పూర్వీకులు పరిపాలించిన గడ్డ మీదకు రావడం సంతోషంగా ఉంది. 700 ఏళ్ల కిందటి మా వంశస్థుల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను నిర్వహించడం గర్వంగా ఉంది. నన్ను ఆహ్వానించిన ప్రభుత్వానికి, నాయకులకు నా ధన్యవాదాలు. ఓరుగల్లు ప్రజలు మా పట్ల చూపిన ఆదరణ అమోఘం. త్వరలో కుటుంబ సమేతంగా వస్తా..’’ అని కాకతీయుల 22వ వారసుడు, బస్తర్ రాజు రాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్ సంతోషం వ్యక్తం చేశారు. కాకతీయ వైభవ సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం వరంగల్‌కు వచ్చిన కమల్ చంద్ర భంజ్‌దేవ్‌కు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘జనరంజక పాలన అందించి, ప్రజాసేవకు అంకితమైన పూర్వీకుల స్ఫూర్తితో బస్తర్‌లో సమాజ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. కాకతీయుల స్ఫూర్తి, ఉత్సాహం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సప్తాహం వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉంది. దేశ చరిత్రలో ఇదొక మరపురాని రోజు..’’ అని భంజ్‌దేవ్ పేర్కొన్నారు. కాకతీయులు రోల్ మోడల్‌గా తెలంగాణలో అనేక పథకాలు నడుస్తున్నాయని, మిషన్ కాకతీయ పథకం అద్భుతమని కొనియాడారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాకతీయులు ఆదర్శంగానే పాలన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాకతీయుల చరిత్రను భావి తరాలకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాకతీయుల చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని.. వారి వారసుడిని పిలిచి ఉత్సవాలు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ అంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువన్నారు. కాకతీయుల ఆదర్శంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆలయాలను, చెరువులను అభివృద్ధి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు కాకతీయ ఘన చరిత్రను మరుగునపడేలా చేశాయని, కేసీఆర్ పట్టుదలతో నేడు ఆ చరిత్ర ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. ఇక తాను కాకతీయ గడ్డపై పుట్టినందుకు సంతోషంగా ఉందని మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు. కాకతీయుల పాలన ప్రభుత్వాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఓరుగల్లు కోటలో సప్తాహం షురూ.. భద్రకాళి ఆలయంలో పూజల అనంతరం కమల్‌చంద్ర భంజ్‌దేవ్.. రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత వరంగల్ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రపు బండిపై భంజ్‌దేవ్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, చీఫ్‌విప్ వినయభాస్కర్, ఎమ్మెల్యే నరేందర్ ఊరేగారు. వరంగల్ కోట, కళా తోరణాలు, సాంస్కృతిక వైభవాన్ని పరిశీలించిన భంజ్‌దేవ్ భావోద్వేగానికి గురయ్యారు. వరంగల్ కోటలో బెలూన్లను ఎగురవేసి ‘కాకతీయ వైభవ సప్తాహం’ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వేయి స్తంభాల గుడిలో అభిషేకం నిర్వహించారు. అగ్గిలయ్య గుట్టను సందర్శించి మొక్కలు నాటారు. అక్కడి నుంచి కాకతీయ హరిత హోటల్‌కు చేరుకుని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, వినయభాస్కర్, కలెక్టర్లకు బస్తర్ పరిపాలన జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. (క్లిక్: ఆ ఇద్దరి నేతల మధ్య.. బస్తీ మే సవాల్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాకతీయుల చరిత్ర మరుగున పడినందుకు సిగ్గుపడుతున్నా..
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల చరిత్రను సవివరంగా తెలుసుకుంటుంటే సంతోషంతో పాటు బాధగా ఉందని, ఆ చరిత్ర ఇంకా మరుగున పడి ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వైభవ సప్తాహంలో భాగంగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో టార్చ్ సంస్థ గురువారం ఏర్పాటు చేసిన కాకతీయ ఫొటో ఎగ్జిబిషన్‌ను కాకతీయ వంశానికి చెందిన 22వ మహారాజు కమల్ చంద్ర బంజ్‌దేవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ కాకతీయ వారసత్వ సంపద మన రాష్ట్రంలో ఉందని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు కాకతీయ సంపదను పరిరక్షించలేకపోయాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించిందని, సంరక్షించాల్సింది ఇంకా ఉందని ఈరోజే తెలిసిందని చెప్పారు. మన పూర్వీకులైన కాకతీయ రాజు ఈరోజు మళ్లీ ఓరుగుల్లుకు రావడంతో సంతోషకర విషయమన్నారు. మైనింగ్ పేరుతో ఈ సంపదను నాశనం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అరవింద్ ఆధ్వర్యంలోని టార్చ్ సంస్థ చేసిన కృషిని ప్రశంసించారు. అదృష్టంగా భావిస్తున్నా... కమల్ చంద్ర భంజ్‌దేవ్ మాట్లాడుతూ.. తన పూర్వీ కుల నేలకు రావడం అదృష్టంగా భావిస్తున్నాన న్నా రు. కాకతీయులకు చెందిన విలువైన చారిత్రా త్మక సంపద ఇప్పటికీ తెలంగాణలో ఉందని, దానిని పరిరక్షించుకోవాలని సూచించారు. ఏడేళ్లు గా అరవింద్‌తో చర్చిస్తున్నానని, ఆయన పరిశోధ నతో కాకతీయులకు సంబంధించిన ఎన్నో విషయా లను తెలుసుకున్నానని చెప్పారు. తన వంశానికి చెందిన రాజుల పేర్ల చివర ఇప్పటికీ కాకతీయ ఉంటుంద న్నారు. ఆ పూర్వవెభవాన్ని కాపాడేందుకు ఏం చేయ డానికైనా తాను సిద్ధమని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కేటీఆర్‌తో చర్చించానని, కాకతీయుల సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. -
ఒక ఆలయం... ముగ్గురు దేవుళ్లు
ఒక ఆలయం... ముగ్గురు దేవుళ్లుసాధారణంగా దేవాలయంలో ఒక్కరే ప్రధాన దేవుడు ఉంటాడు. కానీ కొన్ని దేవాలయాల్లో ముగ్గురు దేవుళ్లు మూడు వేరు వేరు గర్భగృహాల్లో ఉంటారు. ఇటువంటి ఆలయాలను త్రికూటాలయాలు అని వ్యవహరిస్తారు. అయితే ఇవి చాలా తక్కువ సంఖ్యలో నిర్మితమయ్యాయి. హన్మకొండలోని వేయి స్తంభాల గుడి త్రికూటాలయమే. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, మంథనిలోని గౌతమేశ్వరాలయం, సంగారెడ్డికి సమీపంలోని కల్పగూరు కాశీ విశ్వేశ్వరాలయాలు ఇలాంటివే. హన్మకొండ వేయిస్తంభాల ఆలయం కాకతీయ శిల్ప కళారీతికి అద్దంపట్టే అద్భుతమైన ఆలయం. క్రీ.శ. 1163లో రుద్రదేవ మహారాజు కట్టించిన ఆలయమిది. ఆయన పేరుతోనే ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అనీ, దీనిలోని లింగాన్ని రుద్రేశ్వర లింగం అనీ వ్యవహరిస్తారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ త్రికూటాలయంలో శివుడు, విష్ణువు, సూర్య దేవుళ్లకు గర్భాలయాలు ఉన్నాయి. స్తంభాలు ఒకదాని తరువాత ఒకటి వరుసలు దీరినట్లు చెక్కబడి కనిపిస్తాయి. మంథనిలోని గౌతమేశ్వరాలయం కూడా త్రికూటాలయమే. దీనిని కూడా 1000 స్తంభాల ఆలయం అని వ్యవహరిస్తారు. ఈ ఆలయం హన్మకొండ ఆలయం కన్నా ముందుగానే నిర్మించారని భావిస్తున్నారు. ఇక్కడి శివలింగం అచ్చంగా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలోని శివలింగం లాగే ఉంటుంది. ఆదిగురువు శంకరాచార్యులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారట. అయితే, దీన్ని రాష్ట్ర కూటులు నిర్మించారా, లేదా చాళుక్యులా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, కాకతీయులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు. మరో త్రికూటాలయం పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం. నల్లగొండ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుందూరు చోళులు నిర్మించిన ఈ దేవాలయానికి రెండు ప్రత్యేక తలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్భ గుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలోకి అది ఉబికిరావడం. 11వ శతాబ్దంలో చాళుక్య శైలిలో నిర్మిచిన ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా, మరొకటి ఖాళీగా కనిపిస్తోంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శన మిస్తారు. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్థానాన్ని మార్చు కోదు అనేది ఆశ్చర్యపరుస్తుంది. భౌతిక శాస్త్రంలోని పరిక్షేపణ కాంతి ఆధారంగా ఈ త్రికూట ఆలయాన్ని నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో కల్పగూరు గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. హన్మకొండ వేయిస్తంభాల ఆలయ నిర్మాణశైలిలోనే ఇదీ ఉంది. ఈ ఆలయంలో దక్షిణాన కాశీ విశ్వేశ్వరుడు, ఉత్తరాన వేణుగోపాల స్వామి, పశ్చిమాన అనంత పద్మనాభ స్వామి గర్భాలయాలు ఉన్నాయి. (క్లిక్: స్ఫూర్తినిచ్చే ‘కాకతీయ వైభవం’) కాకతీయ ఆలయాలు నిర్మాణ శైలి, శిల్ప సౌందర్యాలకు ప్రసిద్ధి చెందినా... నాటి ఇంజినీర్లు వాడిన సాంకేతిక విజ్ఞానం కొంత వివాదాస్పదంగా మారింది. భూకంపాల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకోవడానికి పునాదుల్లో ఇసుకను వాడటం నాటి ఆలయాల నిర్మాణంలో కనిపించే సాధారణ దృశ్యం. అయితే అదే ఈ ఆలయాల మనుగడకు శాపంగా మారింది. కాలక్రమంలో పునాదులు కుంగి ఆలయాలు కూలిపోవడానికి కారణమయింది. హన్మకొండ ఆలయంలోని కొంత భాగం ఇందువల్లనే దెబ్బతిన్నదని అంటున్నారు. - కన్నెకంటి వెంకటరమణ సంయుక్త సంచాలకులు, ఐ అండ్ పీఆర్, హైదరాబాద్ (‘కాకతీయ వైభవ సప్తాహం’ జూలై 7–13 వరకు) -
స్ఫూర్తినిచ్చే ‘కాకతీయ వైభవం’
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7 నుండి 13 తేదీ వరకు వారం రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహిస్తుండటం ముదావహం. మధ్యయుగం (12–14 శతాబ్దాలు)లో విలసిల్లిన కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. కాకతీయుల నిర్మాణాలైన దేవాలయాలు, కోటలు; తవ్వించిన చెరువులు, వారి కళాపోషణ వంటివాటి గురించి ఈ తరానికి స్ఫూర్తినందించే విధంగా కార్యక్రమాలు రూపొందాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా చందుపట్లలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే కాకతీయ సామ్రాజ్యానికి గొప్ప పేరు తెచ్చిన రుద్రమదేవి మరణాన్ని తెలియజేసే శాసనం ఉంది. వరంగల్ జిల్లాలో ఉన్న అనేక కాకతీయ కట్టడాలు, చెరువుల దగ్గర మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరంగల్‌ను పూర్వం ‘ఏకశిలా నగరం’, ఓరుగల్లు అనీ పిలిచేవారు. ‘కాకతి’ అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులకు ఆ పేరు వచ్చింది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటివారు ఈ రాజుల్లో పేరుపొందినవారు. వీరు వ్యవసాయం కోసం వేలాది చెరువు లను తవ్వించారు. అందులో ముఖ్యమైనవి పాకాల, లక్నవరం, బయ్యారం చెరువులు. వరంగల్ కోట, హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, పాలంపేట రామప్ప దేవాలయం వంటి ప్రసిద్ధ దేవాల యాలు, అనేక తోరణాలు – వీరి కాలంలోనే నిర్మితమయ్యాయి. అందులో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా కూడా లభించింది. అలనాడు తవ్విన అనేక చెరువులు ఇప్పటికీ తెలంగాణలో వ్యవసాయానికి ప్రాణాధారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాటి చెరువుల పునరుద్ధరణకు ‘మిషన్ కాకతీయ’ను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంగా కాకతీయుల ‘తోరణా’న్ని గ్రహించారు. హంసలు, పూర్ణకుంభం, గర్జించే సింహాలు, మొసలి వంటి శిల్పాలు ఈ తోరణంపై ఉన్నాయి. – ఈదునూరి వెంకటేశ్వర్లు, వరంగల్ -
ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లాలో జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ప్రగతి భవన్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్నాహక సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, కవులు, సాహితీవేత్తలను గౌరవించే విధంగా తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవాన్ని చాటేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను నిర్వహించాలని ఆదేశించారు. కాకతీయుల వైభవాన్ని, ప్రతిష్టను పెంచేవిధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనేలా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు భాగస్వాములు అయ్యేలా సాహితీ, సాంస్కృతిక, కళా కార్యక్రమాలను, మేధో చర్చలను రూపొందించాలన్నారు. విద్యార్థి, యువత కూడా ఉత్సాహంగా పాల్గొనేలా, అందరూ గర్వ పడేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, పండుగ వాతావరణం నెలకొనేలా విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. కాకతీయ వైభవ సప్తాహంను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: దిశ ఎన్కౌంటర్: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక